19, డిసెంబర్ 2023, మంగళవారం

ధనుర్మాస ధ్యానం భజనం

 *ధనుర్మాస ధ్యానం భజనం 2023-24 ప్రత్యేక శీర్షిక .*


*అన్నమయ్య అజరామర సంకీర్తనలు -  03* 


🌺🍃 *----------------* 🍃🌺


*అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 361*


*( భావములోనా బాహ్యమునందును ... )*


🌺🍃 *----------------* 🍃🌺


ఓం నమో వేంకటేశాయ. 🙏

 అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 361 కి శుభ స్వాగతం ..🙏 


*ప్రార్థన ః--*🌹🙏


*తపముగ లోనన్ వెలుపల-*

*నపరము లెరుగక హరిహరియను నొక నామం-*

*బపురూపంబుగ దల్చుటె*

*తపములనన్నిటిని మించు తపమౌనయ్యా !!*


🌹🌹


*వెలుపల లోపల నొకటిగ* 

*నలరుచు సమబుద్ధితోడ నధికముగ హరిన్*

*బలువిధములుగాఁ  దలచుము !*

*సులభముగా ముక్తికదియె సోపానంబౌ !*


🌹🙏🌹


✍️ *స్వీయపద్యములు ( కందము )*


🌹🌹


తపస్సు వలే అంతరంగములోనూ , బాహ్యమున , ఇతరములనన్నీ విడచి *"హరీ హరీ "* అన్న ఒక్క నామమును తల్చుకొనుట తపస్సులనన్నీ మించిన తపస్సు కాదా !🙏


మనస్సులోనూ ,భౌతికముగానూ స్థితప్రజ్ఞత కలిగి ఆనందముగా ఆ హరినే అనేక విధములుగా కీర్తించుటయే ముక్తికి సులభతరమైన మార్గమౌను కదా ! 🙏


అట్టి *శ్రీహరి* తలపులలో సదా ఉందాము !!🙏


🌹🙏🌹


🌺🍃 *----------------* 🍃🌺


అన్నమాచార్యుల వారి సుప్రసిద్ధ సంకీర్తనలలో ఈ కీర్తనకు ప్రత్యేక స్థానము ఉన్నది . 🙏 


భజనవలె ఈ కీర్తన పాడుకుంటే మనసుకు ఎనలేని సాంత్వన సమకూరుననుటలో సందేహమే లేదు .🙏


అందరికీ తెలిసిన కీర్తనయే అయినా నా తృప్తికోసము భావార్థమును అందిస్తున్నాను అంతే ! 👇


🌺🍃 *----------------* 🍃🌺


🌹🌹


మన మనస్సుల లోని భావన గానూ , బౌతికముగా మనము చేయు సదాచార కర్మలలోనూ సదా ఆ గోవిందునినే తలచుకొనుట ఉత్తమమైన మార్గము .🙏


*" గోవిందా గీవిందా "* అని సదా అతనిని ప్రార్థించుకుందాము .🙏


🌹🌹


ఆ *శ్రీ హరి* స్వరూపములే వెలసి ఉన్న అన్ని దేవతా రూపములు .

అసలు ఆ *శ్రీహరి* లోనుంచీ ఉద్భవించినదే ఈ సకల బ్రహ్మాండ సృష్టి అంతయును.🙏


 ఆ *శ్రీహరి* పేరును , ఆతని  గుణములను కీర్తించుచున్నవే అన్ని మంత్రములూ సారముగా . 🙏


కావున ఓ మనసా హరినామము విడువకు . సదా *"హరీ హరీ "* అని అంటూనే ఉండుము .🙏


🌹🌹


ఆ *విష్ణుని* మహిమలుగా నిర్దేశింప బడినవే ఈ కర్మలన్నియూ .🙏

 వీటికి కారణము , ఫలమూ కూడా అతని మహిమయే అని మరువరాదు .🙏


ఆ *విష్ణువును* కీర్తించుచున్నవే సకల వేదములు .🙏


ఆ *విష్ణువు* ఒక్కడే శ్రీమన్నారయణ స్వరూపమై విశ్వమంతటికీ ఆత్మ గానూ , మన అందరి అంతరాత్మగాను వెలసి ఉన్నాడు .🙏


ఆ *విష్ణువు*  బయట అంతటా , లోలోన కూడా ఉన్నాడని నమ్మి వెతుకవే మనసా ! 🙏


🌹🌹


ఈ *అచ్యుతుడే* నాశనమన్నది ఎరుగని వాడు . ఆదికి ఆదియౌ ఆది పురుషుడు ,అటులనే అంతము కూడా లేని వాడు .🙏


ఈ *అచ్యుతుడే* చెడును నాశనము చేసెడి వాడు . రాక్షసులను అంతము చేసెడి వాడు .🙏


ఆ *అచ్యుతుడే* ఇదిగో చక్కగా వేంకటాద్రిమీద ఇదిగో ,

*శ్రీ వేంకటేశ్వరుడై* కొలువుతీరినాడు .🙏


చక్కగా *" అచ్యుతా అచ్యుతా "* అంటూ ఈ వేంకటాద్రి విభునకు శరణని ఉండవే ఓ మనసా !!🙏


🌹🙏🌹


*ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !*🙏


🌹🙏🌹


తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏

దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏


*(  అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 361)*


✍️ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది* 🙏


   🌹🌹   *సంకీర్తన*    🌹🌹



*॥పల్లవి॥*


భావములోనా బాహ్యమునందును

గోవిందగోవింద యని కొలువవో మనసా


*॥చ1॥*


హరి యవతారములే యఖిలదేవతలు

హరిలోనివే బ్రహ్మాండములు

హరినామములే అన్నిమంత్రములు

హరిహరిహరి యనవో మనసా


*॥చ2॥*


విష్ణుని మహిమలే విహితకర్మములు

విష్ణునిఁ బొగడీ వేదములు

విష్ణుఁడొక్కఁడే విశ్వాంతరాత్ముఁడు

విష్ణు విష్ణువని వెదకవో మనసా


*॥చ3॥*


అచ్యుతుఁ డితఁడే ఆదియు నంత్యము

అచ్యుతుఁడే యసురాంతకుఁడు

అచ్యుతుఁడు శ్రీవేంకటాద్రిమీఁద నిదె

అచ్యుతయచ్యుత శరణనవో మనసా


           🌹🙏🌹🙏🌹

కామెంట్‌లు లేవు: