28, జూన్ 2024, శుక్రవారం

గొప్ప స్నేహితులు

 కర్ణుడిని, దుర్యోధనుడిని గొప్ప స్నేహితులు అనుకుంటారు. ఇలాంటి స్నేహాలు ఎంత ప్రమాదకరమో నిజంగా తెలుసుకోవాలి. స్నేహ లక్షణాలు ఇద్దరిలోనూ లేవు. స్నేహమంటే చెట్టాపట్టాలేసుకొని తిరిగేవాళ్ళు కాదు. 


పాపాన్నివారయతి యోజయతే హితాయ 

గుహ్యన్నిగూహయతి గుణాన్ ప్రకటీకరోతి 

ఆపద్గతంచ న జహాతి దదాతి కాలే 

సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః!!(భర్తృహరి)


స్నేహం అంటే మిత్రుడు పాపం చేయకుండా ఆపాలి. వాడికి హితమైనది చెప్పాలి. ఆపదలలో విడిచిపెట్టకూడదు, అవసరమైన సంపదలు ఇవ్వాలి. చివరి రెండూ మాత్రం పాటించారు ఇద్దరూ. మొదటి రెండూ లేవు. 


స్వార్థపూరితమైన స్నేహానికి ఉదాహరణ చెప్పాలంటే దుర్యోధన, కర్ణులే. కుమారాస్త్రవిద్యా ప్రదర్శన సన్నివేశంలో వీళ్ళిద్దరికీ స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఎటువంటి పరిస్థితులలో ఏర్పడింది? అక్కడ అర్జునుడు చూపించిన అద్భుతమైన ప్రతాప ప్రదర్శనకి మొత్తం అందరూ చకితులై నిశ్చేష్ఠులై చూస్తూ ఉంటే దుర్యోధనుడికి బెంగపట్టుకుంది. భీముడు, నేను గదావిద్యలో పోటాపోటీ. అర్జునుడితో పోటీ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే నేను అని వచ్చాడు కర్ణుడు. ఇప్పుడు దుర్యోధనుడికి పాండవులను దెబ్బతీయడానికి ఒకడు దొరికాడు గనుక వీడి స్నేహం నాకు కావాలి అనుకున్నాడు. అంటే వీడి స్నేహం ఎందుకోసం? పాండవులకోసం. 


కర్ణుడు ఎందుకు దుర్యోధనుడితో కలిశాడు? అంటే -

కర్ణుడికి మహాస్పర్థ అర్జునుడితోనే. ఎలాగోలా అర్జునుని దెబ్బతీయాలి అని. అర్జునుడిని దెబ్బతీయాలంటే తనకి ఒక అండ ఉండాలి. అందుకని దుర్యోధనుని ప్రక్కకి చేరాడు. ఎంత అర్జునుడి మీద పగ లేకపోతే తన గురించి తెలిసినా వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట అర్జునుడిని తప్ప అందరినీ విడిచిపెడతాను అన్నాడు. అందుకే ద్రోణుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం ఇమ్మని అడిగాడు. అప్పుడు ఆయన నువ్వు యోగ్యుడివి కాదు అన్నారు. నువ్వు ఇవ్వకపోతే నీ గురువు దగ్గరికి వెళ్తాను అని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ గురుధిక్కారం. అటువంటి వాడికి మంత్రము, అస్త్రము వచ్చినా పనిచేయవు అని తెలుసుకోవాలి. 


కర్ణుడు పరశురాముని దగ్గరికి కూడా వంచనతో వెళ్ళాడు. ఉపనయన సంస్కారం లేనివాళ్ళకి మంత్రోపదేశం చేయరాదు గనుక తనకి తత్ సంస్కారములు లేవు గనుక బ్రహ్మాస్త్రం మంత్రం గనుక తాను విప్రుడు అని అబద్ధం ఆడాడు. అసత్యంతో గురువును ఆశ్రయించాడు. పోనీ ప్రయోజనం ఏమైనా గొప్పదా? ప్రయోజనం గొప్పదైతే దానిని ధర్మంగా స్వీకరించవచ్చు. అర్జునుడితో సమ ఉజ్జీ కావాలి అని మాత్రమే. ఆ సమయంలో అక్కడ పొరపాటున అయినా గోహత్య చేశాడు. ఆ గోవు కలిగిన బ్రాహ్మణుడు శపించాడు – నువ్వు ఏ విద్య నేర్చుకున్నా వ్యర్థమైపోతుంది అని. అటుతర్వాత పరశురాముడికి కర్ణుడి మోసం తెలిసి ఆయనా శపించాడు. ఉద్దేశ్యం మంచిది కానప్పుడు విద్యనేర్చుకునేటప్పుడు వంచన ఎంత ప్రమాదకారియో తెలుసుకోవాలి. 


విద్యను ఒక వస్తువుగా చూస్తున్న నేటి నాగరికతలో ఈవిషయం తెలుసుకోవాలి. గురుదక్షిణ పారేశాం, వాళ్ళు విద్య నేర్పారు, అని అనుకోకూడదు. గురువును కేవలం ఒక మంత్రం ఇచ్చినటువంటి ఒకానొక వస్తువు అనుకోకూడదు. ఆ మంత్రము, ఆ దైవము గురురూపంలో ఉన్నారనే భావన ఉండాలి. అందుకే సృష్టిలో గురువును విడిచిపెడితే పరమేశ్వరుడు కూడా కాపాడడు. గురువును విడిచిపెట్టి ఎన్ని మంత్రాలు, జపాలు, తపాలు చేసినా వాడిని ఏ దేవతా రక్షించదు. సర్వనాశనం అవుతాడు అని చెప్తున్నారు. అర్జునుడు గురుభక్తికి ఒక ఉదాహరణ, కర్ణుడు గురుతిరస్కారానికి ఒక ఉదాహరణ.


పైగా తన అస్త్రాలన్నీ శాపగ్రస్తాలు అని కర్ణుడికి తెలుసు. తన అస్త్రాల మీద తనకే నమ్మకం లేదు. అర్జునుడి దగ్గర ఆ దోషం లేదు. అటువంటప్పుడు ఏం చూసుకొని దుర్యోధనుడికి ధైర్యం చెప్పాడు. ఇంతకంటే దుర్మార్గం, మిత్రద్రోహం మరొకటి ఉంటుందా? తన అస్త్రములు శాపోపహతములు అని తెలిసినప్పుడు, తన విజయం మీద తనకే నమ్మకం లేనప్పుడు నేనున్నాను ఫరవాలేదు అని చెప్తాడా?


అంటే ఒకవిధంగా దుర్యోధనుడిని వంచనచేసి ముంచాడు. 

నన్ను వంచన చేశావు మిత్రద్రోహి అనడానికి దుర్యోధనుడికి అర్హత లేదు. స్వార్థ స్నేహాలు ఇలాగే ఉంటాయి. ఇది తెలియక మనవాళ్ళు గొప్ప మిత్రుడిలాగా చూపిస్తూ ఉంటారు. 

కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి పక్షాన పోరాడి నశించిన అసురాంశ కలవాళ్ళు ఇంక ఏ లోకాలకూ వెళ్ళక భూలోకంలో మానవులుగా పుట్టి భారతంలో కృష్ణుడినీ, ద్రౌపదినీ, విమర్శిస్తూ నవలలు, నాటకాలు, వ్యాసలు వ్రాస్తూ అవార్డులు తెచ్చుకుంటూ ఉన్నారు.

1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

చివరివాక్యం బాగుందండీ.