పంచభూతాత్మకమైన ఈ ప్రకృతిలో నీటికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రాణికోటికి జీవనాధారమైనది కనుక నీటిని దైవస్వరూపంగా భావిస్తాం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, వాటినుంచి అన్నం, అన్నం వల్ల ప్రాణులు ఉత్పన్నమైనట్లు శృతులు చెబుతున్నాయి. మన శరీరం కూడా పంచభూతాల తత్వంతో ఏర్పడిందే. అందుకే దీన్ని పాంచభౌతిక దేహం అంటున్నాం.
సకల చరాచరాలను సృష్టించేది నీరే. 'నారాయణుడు' అంటే నీరే స్థానంగా కలవాడని అర్థం. నీటి నుంచే నారాయణుడు ఆవిర్భవించినట్లు రుగ్వేదం చెబుతోంది. ఉదకంలో భగవంతుడు, భగవంతుడిలో ఉదకం ఉందనీ, దాని విశేషం తెలుసుకున్నవారే ముక్తికి అర్హులనీ 'మంత్రపుష్పం' చెబుతోంది. 'జీవితమివ్వడానికి, దీర్ఘాయువు కలిగించేందుకు, తేజస్సు పెంచేందుకు ఈ జలాలు కదులుతూ మమ్మల్ని తడుపుతుండాలి' అన్న వేదార్థం కూడా ఉంది.
నీటితో చేసే అయిదు రకాల స్నానాల వివరణ పద్మపురాణంలో ఉంది. శరీరానికి విభూతి పూసుకొంటూ జలస్మరణం చేయటం ఆగ్నేయస్నానం. శుద్ధజలంతో స్నానం చేస్తే అది వారుణస్నానం. శిరస్సుమీద జలాన్ని ప్రోక్షణ చేసుకుంటే బ్రహ్మస్నానం. గోధూళిలో సంచరిస్తే వాయవ్యస్నానం. ఎండకాస్తుండగా కురిసేవానలో తడిస్తే దివ్యస్నానంగా చెబుతారు. తడిగుడ్డతో శరీరాన్ని తుడుచుకోవడం కపిలస్నానం. ఏనుగులా చాలాసేపు స్నానం చేయడం శ్రేష్ఠమని నీతిశాస్త్రకారుడు చెప్పాడు.
మన ఆరోగ్యవృద్ధి కోసం సనాతనులు పలు సందర్భాల్లో పలువిధాలుగా నీటిని స్వీకరించాలని చెప్పారు. ఆధునిక విజ్ఞానశాస్త్రమూ దీన్నే సమర్థిస్తోంది. సంధ్యావందనంలో పెట్టిన ఆచమన విధి అందులో ఒక భాగమే. అరచేతిని ఆవుచెవిలా చేసుకొని అందులో ఒక ఉద్ధిరణ శుద్ధోదకం పోసుకుని మూడుసార్లుగా ఆచమనం చెయ్యమన్నారు. సంధ్యావందనం ముగిసేలోగా ఇలా చాలాసార్లు చేయవలసి వస్తుంది. అంటే, రోజూ మనం నీరు తరచూ తాగాలన్న సంకేతమిది. పూజలో కూడా 'మధ్యేమధ్యే పానీయం సమర్పయామి' అంటున్నాం. ఎలాంటి జలం అంటే, 'శుద్ధాచమనీయం' అంటున్నది వేదం. నీరు పరిశుభ్రంగా లేకుంటే వ్యాధులు వస్తాయన్న హెచ్చరిక ఉంది అందులో.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి