15, సెప్టెంబర్ 2024, ఆదివారం

*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 12

 *శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 12 వ భాగము*

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷


ఆ భాగీరధీ తీర పరిసరాలలో గల కదంబవనాలు, లతలతో పెనవేసికొన్న పొదలూ ముచ్చటగా చూచాడు. పొదలలో తపస్సు చేసు కుంటున్న మునులు కనబడ్డారు. గంగను దర్శించడంతో అందు స్నానమాడాలనిపించింది. ఆ నిమ్నగను స్తవం చేశాడు.. 


*"భగవతి భవలీలా మౌళి మాలే తవాంభః,*

*కణ మణు పరిమాణం ప్రాణినో యే స్పృశంతిఅమర నగర నారీ చామరగ్రాహిణీనాం,*

*విగత కలి కలంకాతంక పంకే లుఠంతి ||* 

*కాశీ ప్రాంతవిహారిణీ విజయతే గంగా మనోహారిణీ ॥*


గంగా దేవిని స్తుతించి స్నానం చేసి మెల్లిగా కాశీ పట్టణం చేరు కొన్నాడు శంకరా చార్యుడు. 


శంకరాచార్యుడు కాశీ పట్టణంలో అడుగు పెట్టగానే పురజనులు చాల అబ్బురంతో ఆ మహా తేజస్విని చూస్తూ చూస్తూ ఆయనను వెంటాడి వస్తున్నారు. బాల యతీంద్రుడు విశ్వేశ్వరుని ఆలయం ప్రవేశించాడు.

పురవాసులకు బాలశంకరుని వలె గోచరించి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారు. అందులకు శంకరా చార్యుడు నారాయణ స్మరణ చేస్తున్నారు. శంకరాచార్యుడు విశ్వేశ్వరుని కడకు వెళ్ళి అంజలి ఘటించి స్వామిని శివభుజంగ ప్రయాత స్తోత్రముతో స్తవం చేసాడు.


*సనందుడు శిష్యుడగుట:*


కాశీవాసులే కాక చుట్టుప్రక్కల నివసించే వారెందరో శంకరాచార్యుని దర్శనం చేసికొని వెళ్ళుతున్నారు. ఒకరోజు ఒక బ్రాహ్మణ బాలుడు శంకరాచార్యుల దగ్గరకు వచ్చి సాష్టాంగ వందనం చేసి స్వామి కాళ్ళు రెండూ గట్టిగా పట్టుకొని వదల లేదు అభయం ఇచ్చేదాక. నెమ్మదిగా బాలకుడిని లేవ నెత్తి ఇలా పలకరించారు:


"బాలకా! నీ వెవ్వరు? ఎక్కడి నుండి వచ్చావు? నీకు ఏమి కావాలి? దేనికి అభయం అర్థిస్తున్నావు? వివరంగా చెప్పు.”


గురువర్యా! నేను కావేరీతీరంలోని చోళ దేశస్థుణ్ణి. పెద్ద రోగంతో వ్యథ పడుతున్న వాడిని. మీ ప్రభావము, ఆసేతు హిమాచలం వ్యాపించిన మీ కీర్తిని విని ఇప్పుడు మీరు ఈ కాశీపురంలో ఉన్నారని తెలిసి మిమ్మల్ని వెదుక్కుంటూ మీ పాదపద్మాలకు సేవ చేసి తరిద్దామని వచ్చాను. మీరే నాకు దిక్కు. మీ శరణు కోరి వచ్చిన వాణ్ణి కాదనక ఆశ్రయం ఇవ్వండి. లేకున్న నాకు విముక్తి లేదు” అని మొర పెట్టుకొన్నాడా బాలవిప్రుడు దీనాతి దీనంగా. 


ఆ విశిష్ట బాలుణ్ణి గమనించిన శంకరాచార్యుడు ఆదరంగా అతనిని చేరదీసి “నీ కేమీ భయం లేదు. నిశ్చింతగా ఉండు. నా అండదండలు నీకు ఎప్పుడూ ఉంటాయి. నీ ఆవేదనలు, నీ మనోవేదనలు బాధలు విశదీక రించు. భగవదను గ్రహంతో తీరని రుజలున్నాయా?” అని అడిగారు

శంకరయతి.


"స్వామీ! లోకంలో పలురకాల కర్మలు ఆచరిస్తున్నారు జనులు. పుణ్యకర్మలాచరించి పుణ్యమూ, పాపకర్మ లాచరించి పాపమూ గడిస్తాడు జీవి. కర్మఫలాల అనుభవా నికి తిరిగి తిరిగి జన్మలెత్తుతూంటాడు. మరి ఏ కర్మలు చేస్తే చావు పుట్టుక లు లేకుండా పోతాయో తెలియదు. ఆ సత్యం తమ వంటి మహాజ్ఞానులకు తెలియాలి. నన్ను ఈ భవ రోగమే తీవ్రంగా వేధిస్తోంది. ఈ రోగం నుండి విముక్తి ఒక్క మీ కరుణా కటాక్షం వల్లనే సాధ్యము అవుతుంది. నన్ను ఈ పరమ బాధా కరమైన భవరోగం నుండి తప్పించండి. తమ కృపా కిరణాల ను నాపై కొంచెం ప్రసరింపజేసి నన్ను అజ్ఞానాంధకారము నుండి తప్పించండి. వెలుతురు ప్రసాదిం చండి. నా భవరోగ చికిత్స మీ ఒక్కరి వల్లే సాధ్యం. మీరే దానికి భిషగ్వరులు. దయ చూపండి. నేను మీకు ఈ క్షణం నుండి అధీనుడను. నన్ను శాసించండి" అంటూ ప్రాధేయ పడ్డాడు చిఱుత ద్విజుడు. అంతా విన్న శంకరా చార్యుడు నిశ్చయించుకున్నాడు ఇతడు తనకు ముఖ్య శిష్యుడు కాదగినవాడని. హస్తమస్తకయోగం ద్వారా విప్ర కుమారుని మనస్సు ను కప్పిన అజ్ఞానపు తెరను తొలగించి క్రమ సన్న్యాసాన్ని ప్రసాదించాడు. మహావాక్యోపదేశం కావించి దండ కమండలాలు చేతికి ఇచ్చాడు. ఆ విధంగా శంకరుని హృదయసీమలో సుస్థిరనివాస మేర్పరచుకొన్నాడు. అప్పటి నుండి నిశ్చింతుడై ఉంటున్న అతనికి సనందుడు అనే పేరు స్థిర పడింది. ఆ తరువాత వరుసగా ఆనందగిరి, చిత్సుకుడు శంకరాచార్యుని శిష్యులయ్యారు. 


*కాశీలో ప్రచారము:*


కాశీపురంలో శంకరాచార్యుడు అనుదినమూ వేదాంతబోధలతో తత్త్వబోధలతో భక్తులకు, విద్వాంసు లకు, ముముక్షు మార్గ గాములకు ధర్మసత్యపథాల లోతుపాతులను వివరిస్తూ వారి సంశయాలను పటాపంచలు చేస్తున్నాడు. కమనీయమైన గళంతో గంభీరమైన వాక్కులతో ఎంతో మంది మానసాలను రంజింపజేస్తున్నాడు. పతంజలి వ్రాసిన వ్యాకరణ భాష్యాన్ని విపులపరుస్తూ శబ్దశాస్త్రావగాహన కల్పిస్తున్నాడు. వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణంలో గల రసామృతాన్ని వీనుల విందుగా శ్రోతలకు పంచిపెడు తున్నాడు. అలాగే యోగశాస్త్ర రహస్యాలు వివరిస్తున్నాడు.

అలంకారశాస్త్రం లోని అందాలు చూపి అలరిస్తు న్నాడు. అష్టాదశ పురాణాలనూ, ఉపనిషత్సారాన్ని, వేదవిజ్ఞానాన్ని మధురమైన కదళీపాకంగా అందించుచున్నాడు ఆ శంకర యతి. పతంజలి, ప్రాచేత సుడు, కృష్ణద్వైపా యనుడు ఏకమై ఈ రూపంలో అవతరిం చారా అని ప్రఖ్యాతి గాంచాడు.


*చండాలోపాఖ్యానము:*


మిట్ట మధ్యాహ్నపువేళ. మార్గంలో ఒక ఆజానుబాహువు అప్పుడే కోసిన పచ్చిమాంసం మూట కట్టుకుని నెత్తిన వేసుకొని, మరి కొన్ని పచ్చి తోళ్ళు బుజాన వేళ్ళాడదీసుకొని వస్తున్నాడు. ఆతని తల మీది మూట నుండి ఇంకా నెత్తురు కారుతోంది.


ఒక ఆనపకాయ బుఱ్ఱలో కల్లు నింపిన కుండ చంక నుండి వ్రేలాడు తోంది. ఒక చేత దుడ్డు కఱ్ఱ. మద్యం మత్తెక్కేలా సేవించా డేమో త్రేనుపులు విపరీతంగా వస్తు న్నాయి. మధ్య మధ్య కుండ లోని కల్లు కొద్ది కొద్దిగా త్రాగుతున్నాడు. బలిసిన కుక్కలు నాలుగు అతని వెంట వస్తున్నాయి. ప్రచండ భాస్కరునికి జడిసి వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. మాధ్యాహ్నిక కృత్యాలు నిర్వర్తించడానికై శిష్యసహితుడై గంగానదికి వెడుతున్న శంకరా చార్యునికి ఎదురు అయ్యాడు ఆ చండాలవేషధారి. అల్లంత దూరాన ఆ వ్యక్తిని చూచారు శంకరుని శిష్యులు. తమలో తాము కూడబలుక్కుంటు న్నారు వచ్చేవాడు చండాలుడా కాదా అని. సమీపానికి రాగానే తేల్చు కొన్నారు ఔనని. శిష్యులు ముందూ, వెనుక శంకరా చార్యుడూ వస్తున్నారు. గురువు మీది భక్తితో "దూరం గచ్ఛ! దూరం గచ్ఛ!” అన్నారా వ్యక్తితో. అపుడా వ్యక్తి శిష్యులతో "బాబూ! తామన్న మాట తెలిసింది లెండి. ముందు నా మాట ఇని మరీ యెల్లండి! మీరన్న మాట మీరు తెలిసే అంటున్నారా. నేను మాదిగోణ్ణి

అని ‘దూరం గచ్ఛ’ అంటున్నారా? అలాగయితే మీ మాట కట్టిపెట్టి నామాట ఇనండి. మీరు పొమ్మంటు న్నది ఈ కనిపించే బొందినా? లేక ఇందులో ఏదో ఆత్మ ఉందట దాన్నా? శరీరాన్ని పొమ్మంటే అర్థం లేదు. మీదీ మట్టి కాయమే నాదీ మట్టి కాయమే. మీది బంగారం నాది మట్టీ కాదు కదా! మీ శరీరం పవిత్రం అయితే నాదీ పవిత్రమే. ఆత్మ అంటారా. మీలో ఉండేదీ నాలోపల ఉండేదీ అది ఎక్కడ ఉన్నా ఒకటేనట! ఆ ముక్క కూడా మీ బాపనోరు చెప్పిందే. అశుద్ధం అంటారా! సూరిభగవానుడు మంచి నీళ్ళల్లోనూ కల్లులోనూ కనిపిస్తాడు గదా చూస్తే. రెండు చోట్లా కనిపించే సూరీడుకు ఒకచోట అశుద్ధం ఒకచోట శుద్ధం కాదు కదా! ఏమంటారు? చూస్తే మీరు బాపనోళ్ళులా లేరే! జందాలు లేవు. సన్నాసులా! అయినా ఈవిసయాలు మీకు తెలవక పోతే మీ గురువు నడగండి" అని నిష్కర్షగా అడిగాడు. 


*శంకరాచార్యునికీ సనందునికీ సంభాషణ:*


శంకరుడు: సనందనా! ఇతడు శివుడు కాడు కదా!. 


సనందనుడు: స్వామీ! నాకు ఆ అనుమానం మొదటే తోచింది.


వ్యక్తి : ఏంటి గుస గుసలు మహా సెప్పుకొంటన్నారు?


శంకరాచార్యుడు: స్వామీ! బ్రహ్మ జ్ఞానులకు నమస్కారము!


వ్యక్తి : సన్నాసులు మాకు దండాలు పెట్టడమా!


శంకరుడు: పుల్కసా! నీ వెవ్వరవు? నీ ఊరేది?


వ్యక్తి : సామీ! నేనొక మంత్రగాణ్ణి. లింగడంటారు కొందరు. కొందరు ముండడనీ అంటారు. నా పేరుకేం గానీ మా ఊరు మంత్రాలపల్లి. రాతురులు వల్లకాడే మకాం. నన్ను ఎప్పుడూ విడవని పెళ్ళాం ఉంది. నా బిడ్డడు బొజ్జడు. ఇవీ నా కొన్ని గుట్టు మట్లు.


శంకరుడు: మీ రెవ్వరైతే నేమి బ్రహ్మజ్ఞానికి నమస్కారం చేశాను. అది మీకు చెందుతుంది మీరు బ్రహ్మవేత్తలవడం చేత.


వ్యక్తి : అయితే మాలడన్నా బాపడన్నా ఒకటే అంటావు?


ఆ ప్రశ్నకు సమాధానంగా శంకరాచార్యుడు మనీషపంచకం ఈ క్రిందివిధంగా చదువుతారు:


*జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా* 

*చణ్ణాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషామనీషా మమ||*


పుల్కసునకు సమాధానంగా శంకరాచార్యుడు చెప్పిన మనీషా పంచకం యొక్క అర్థం ఇది:


“చైతన్యస్వరూపం మెళకువలోను, నిద్రలోను, స్ఫుటంగా ప్రకాశిస్తుంది. అట్టి అఖండరూపం పిపీలికాది బ్రహ్మ పర్యంతం సాక్షీ మాత్రంగా ఉంటుంది. అలాటి చైతన్య రూపాన్ని నేను” అనే గట్టి నమ్మకం గలవాడు మాలడైనా బ్రాహ్మ డైనా నాకు గురువు. ఇది నా నిశ్చయం. "నేను బ్రహ్మనై ఉన్నాను. లోకాలన్నీ చైతన్యంతో నిండి యున్నవి.సర్వమూ త్రిగుణాత్మక మైన అవిద్య వలన నా చే కల్పింప బడినది" అనే గట్టి నమ్మకం ఎవ్వానికి సుఖ తరమూ, నిత్యమూ, పరమూ, నిర్మలమూ అయిన పరమాత్మ యందు గట్టిగా నిలచునో అతడు మాలడైనా ద్విజు డైనా నా గురువు. ఇది నా నిశ్చయము. గురువునందు అత్యంత భక్తి శ్రద్ధలతో విశ్వమంతా నిశ్చితం గాదని నమ్మిన మనస్సుతో ఇదివరకు చేసినవి, ఇప్పుడు చేస్తున్నవి, చేయబోయేవి పాప కర్మలను దగ్ధం చేశాను. ప్రారబ్ధ భోగాలను సంవిన్మయాగ్నిలో హెూమం చేయ డానికి ఈ శరీరాన్ని అర్పించితిని. ఇదే నా నిశ్చయం. మృగాలు, నరులూ, దేవతలూ, 'నేను, నేను' అని దృఢం గానూ, స్పష్టంగానూ నమ్ముటకు ఏ చైతన్యం వలన అట్టి భావన కలుగుచు న్నదో ఏ చైతన్యం వల్ల ఇంద్రియాలు ప్రకాశిస్తున్నవో, మేఘావృత మయిన సూర్య మండలం దేనివలన ప్రకాశిస్తు న్నదో, అలాటి చైతన్యాన్ని ఏ మహానుభావుడు ఎల్లపుడు భావిస్తూ శాంతుడై ఉంటాడో అతడే నా గురువు. ఇది నా నిశ్చయం. ఏ సుఖ సముద్ర కణలేశాన్ని పొంది ఇంద్రుడు మొ. వారు ఆనందాన్ని పొందు చున్నారో ప్రశాంత చిత్తులైన తాపసులు దేన్నిపొంది ఆనంది స్తున్నారో అట్టి వాడు బ్రహ్మవేత్త కాదు. బ్రహ్మమే. అట్టి వాని పాదాలకు దేవేంద్రుడు కూడ నమస్కరిస్తాడు.


శంకరుడు: సనందనా! ఈతడు చండాలుడు కాదంటావా? పుల్కసా! నీవేదియో మాయ చేస్తున్నట్లు ఊహించవచ్చా? మర్యాదలన్నీ ఎఱిగినవానిలా ఉన్నావు. మేము ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళం. 


అంతలో చండాల రూపధారి అదృశ్య మయ్యాడు.


శంకరుడు: సనందనా! ఈతడు ఈశ్వరుడే. మనలను మోసం చేస్తున్నాడు. ఇక్కడ ఎవ్వరూ లేరే?


సనందనుడు: స్వామీ! ఈ కాశీ పట్టణంలో విశ్వేశ్వరుడు ప్రచ్ఛన్నవేషధారియై సంచరిస్తాడని ప్రతీతి.


శంకరుడు: అట్లనా! ఈశ్వరా! పరీక్షకా! మాయ నీ అధీనం.


మాయావీ! మంత్రాయా! సోమాయా! గిరీశా! మహేశా! ముండాయా! శంకరా! గంగాధరా! దేహబుద్ధితో దాసుడను. తత్త్వశాస్త్రరీత్యా మీరే నేను. నేనే మీరు.


ప్రార్థనకు సంతోషించి పశుపతి నిజరూపం లో దర్శనం ఇచ్చాడు.


శివుడు: పరీక్ష ముగిసినది. సర్వజ్ఞుడవయ్యావు. లోకోద్దారకుడవు కమ్ము. వత్సా! వేదవ్యాసుడు అద్వైతమతప్రబోధనకై బ్రహ్మసూత్రాలు రచించాడు. అందు అద్వైతమే పరమ మతమని ఇతరము లు కాదని వెల్లడిం చాడు. అయినా ఆ బ్రహ్మసూత్రాల నిజమైన భావం తెలియక తప్పట డుగులు వేస్తున్నారు కొందరు. అందు చేత తగిన ఆధారాలతో ఆ సూత్రాలకు సరియైన భాష్యం అందించ వలసిన తరుణం ఇది. అందుకు తగ్గవాడవు నీవు ఒక్కడవే. శాస్త్రాలన్నీ క్షుణ్ణంగా ఆకళించుకొని గోవిందభగవత్పాదాచార్యులు కడ మహావాక్యోపదేశం పొంది బహు ముఖాల తీర్చి దిద్దబడిన మనీషివి.


భాస్కరుడు, భట్టపాదుడు, మండనమిశ్రుడు, నీలకంఠుడు, అభినవగుప్తుడు మున్నగువారు అద్వైతమతానికి వ్యతిరేకులై ఉన్నారు. వారిని జయించి చిరకాలం పాదుకొనేలా అద్వైతాన్ని స్థాపించు”.


*కాలడి శంకర కైలాస శంకర* 


*శ్రీ శంకరాచార్య చరిత్రము* 

*12 వ భాగము సమాప్తము*

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

కామెంట్‌లు లేవు: