_*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 11 వ భాగము*_
🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗
*శిష్యరికము:*
ఆదిశేషుని అవతారమైన పతంజలి మహా విజ్ఞానియై గొప్ప తపస్సాచరించి గౌడపాదుని శిష్యుడు అయ్యాడు. అట్టి గోవింద భగవత్ పాదుడు తన కడకు చేరిన శిష్యుని గుణగణాలను గ్రహించి నాడు. గురువుకు తగ్గ శిష్యుడు. శిష్యునికి తగ్గ గురువు. అటువంటి జంట కూడుట కడు దుర్లభం. అవతార మూర్తి అయిన శ్రీరామునికి వసిష్ఠుడు, శ్రీకృష్ణునికి సాందీపనిలాగ శంకరాచార్యునికి గోవిందభగవత్ పాదుడు గురువు అయ్యాడు. మరిగురుసేవ శాస్త్ర సమ్మతంగా, నిష్కళంకంగా జరపాలి. అట్లా చేసినవాడు శంకరా చార్యుడు. సదా గురు స్మరణ, గురుభజన, గురుస్తుతి, గురుసేవ చేస్తూ గురు దర్శనము అయినపుడల్లా సాష్టాంగ వందన మాచరించేవాడు. గురువు కడ బిగ్గరగా మాట్లాడడం ఎరుగడు. అసత్యవాక్కు పలికి ఎరుగడు. కోపము మచ్చుకయినా లేదు. గురువును పలకరించునపుడు సంబోధించి మరీ మాట్లాడేవాడు. గురువు ఉపదేశించిన మహా మంత్రాన్ని నిరంతరం జపించు కొంటూ మననం చేసికొనేవాడు. గురువునకు సకలోప చారాలూ తానే చేసేవాడు. తనువూ మనస్సూ సకలం గురువుకు సమర్పించి పరమభక్తితో చరించేవాడు. గురువు సకల పాపాలను పటా పంచలు చేయగల సమర్థుడు. కోపంతో గురుడు శపిస్తే దానికి నివృత్తి కల్పించడం బ్రహ్మ రుద్రుల తరం కాదని శంకరాచార్యునికి తెలుసును.గురువు గోవింద పాదుని ఆశయాలు మహోన్నత మైనవి. దానికి తగ్గట్టుగా తీర్చి దిద్దుతున్నాడు ఆ శిష్యశ్రేష్ఠుణ్ణి. అజ్ఞానపు చీకట్లను చీల్చిచెండాడ గల జ్ఞానప్రభాపూర్ణునిగా తయారు చేసికొన్నాడు శంకరాచార్యుని. అలా చేయడానికి నాలుగేండ్లు పట్టింది. దేశంలో విజయ దుందుభులు మ్రోగించగల శక్తి, దృఢసంకల్పము, వాత్సల్యభరిత మనోధృతి తన శిష్యునిలో కలవని నిశ్చయించుకొన్నాడు గోవిందభగవత్పాదుడు.
*నర్మద పొంగును కుండ లోనికి ఎక్కించుట:*
శంకరునికి పదిరెండేడులు ఇంకా నిండలేదు. ఆయన యశము దశదిశలా ప్రాకింది.శంకరాచార్యుని చల్లని చూపులకు మ్రోడులు చిగర్చనై ఉన్నాయి. గోవులకు చక్కని చిక్కని పసరాలను అందించడానికి ఉద్యుక్త మగు తున్నాయి పచ్చని పచ్చిక బయళ్ళు. పొలాలు సస్య శ్యామలం చేసి కొందామని ఉవ్విళ్లూరు చున్నారు కృషీ వలులు. భక్తుల హృదయాలను ఆనందింపజేయడానికి ఉద్యాన వనాలు పుష్ప సంతతిని వికసింప జేయాలని ఉబలాటపడు తున్నాయి. మేఘుడికీ ఆనందం పట్టలేకుండా ఉంది. బ్రహ్మాండం బ్రద్దలయ్యే అట్టహాసపు ధ్వనులతో విద్యుత్కాం తులతో వచ్చాడు. ఇంతలో అంతాకీకారణ్య మయింది.మార్గాలు దుర్గమ మయ్యాయి. చిన్ని తుంపరలతో మొదలై ఏనుగు తొండాల లాగ జలధారలు మారడంతో లోకం భీభత్సంలో మునిగింది. ఆసమయంలో నర్మద ఒంటరియై విజృంభించి ఊళ్ళు మ్రింగడం మొదలు పెట్టింది. ఎందరో మనుష్యులను, పశువు లను ఆ భీకర ప్రవాహం పొట్టను పెట్టుకొంది. మిగిలిన వాళ్ళు భయ భ్రాంతులై గోవింద భగవత్పాదులకు నివేదించడానికి వచ్చారు. గురుదేవులు బదరి కా వనం వెళ్ళారన్న సంగతి విని నిర్వీర్యులై ఆశ్రమంలో చతికిలబడ్డారు. వచ్చిన వారి ఆర్తనాదాలు విన్న శంకరాచార్యుని మనస్సు కరుణతో ఉప్పొంగింది. నర్మదను అణగారేటట్టు చేయడమే ముఖ్య కర్తవ్యంగా భావించాడు. ఒక సరిక్రొత్త భాండాన్ని తెప్పించాడు. దాన్ని చేత్తో పట్టుకొని, నిమీలిత నేత్రాలతో, నర్మదఎదురుగా నిలబడి ఇలా స్తుతించాడు:
*“సబిందు సింధురస్థల తరంగ రంజితం,*
*ద్విషస్తు దాపజాతకారివారిసంయుతం*
*కృతాంతదూత కాలభూత భీతిహారినర్మదే,*
*త్వదీయ పాదపంకజం నమామిదేవి నర్మదే|*
అని స్తోత్రం చేసి కుండను నర్మదకు ఎదురుగా ఉంచాడు శంకరాచార్యుడు. వెంటనే పాముల వాని బుట్టలో పాము దూరినట్లు కిక్కురు మనకుండా ఆ భాండం లోనికి నర్మదా జలం దూరింది. అప్పుడా నది వేసవి నాటి నర్మదలా ప్రత్యక్షం కావడంతో అందరి కన్నులలో పున్నమి పొడ చూపింది. కలా! మాయా! అన్నట్లుగా ఒక్క క్షణం ఆశ్చర్య చకితు లయ్యారు వచ్చిన జనం. వేల విధాల శంకరాచార్యుని స్తుతించి వందనాలు అర్పించారు. ఈ అద్భుత ఘటనను గోవింద భగవత్పాదులకు చెప్పారు వారు వచ్చాక. గురువు గారు పరమానంద భరితులయ్యారు.
*శంకరావతార గాథ:*
ఈ నర్మదా నదీ ఘటన వృత్తాంతం విన్న గోవింద భగవత్పాదునకు గతంలో తనకు సంఘటిలిన ఒక ఉదంతం స్మరణకు వచ్చింది. పూర్వం ఒకనాడు హిమాలయ గిరిపై అమరేంద్రుడు యజ్ఞం చేస్తున్నపుడు వేదవ్యాస మహర్షితో గోవిందభగవత్పాదుడు ఇట్లా మాట్లాడాడు. “మహాత్మా! మీరు వేదాలను విభజించి లోకోప కారం చేసారు. పదునెనిమిది పురాణాలు రచించాడు. యోగ శాస్త్రాన్ని వ్రాశారు. పతంజలి యోగశాస్త్రానికి భాష్యం చేకూర్చారు. ఇదీ కాక వేదసారంలో ఉపనిషత్తులను చవిగా కలిపి నారికేళపాకంగా అందించారు బ్రహ్మసూత్రాలనే పేరిట. అది వెలలేని గ్రంధరాజమై వేదాంత తత్త్వానికి శిరోభూషణమై విరాజిల్లు తోంది. కాని నేటి చిక్కేమంటే బహుళ ప్రచారంలో ఉన్నా ఏకాభిప్రాయం కుదరక భిన్నభిన్న దృక్పథాలు వెలువడి సత్యము కనుచూపులో కానకుండా పోతున్నది. ఆ సూత్రముల లోతుపాతులు తమకే తెలియును కదా! మీరే ఆ వ్యాఖ్య అందిస్తే ముముక్షువులు ధన్యులవు తారు” అని వ్యాసుని వేడు కొన్నాడు గోవింద భగవత్పాదుల వారు.
అందుకు సమాధానంగా ఆ మహర్షి ఈ విధంగా తెలియ పరచారు.
"ఆచార్య వర్యా! ఒకప్పుడీ ప్రస్తావన వచ్చినపుడు శివుడు చెప్పిన పరమ రహస్య మేమి టంటే, వ్యాసమహర్షికి దీటయిన ప్రతిభా సంపత్తులతో శివావతార సంభూతు డయినవాడు నీకు ప్రధానశిష్యుడై వస్తాడు. నర్మదానది భయంకరంగా పొంగిన తరుణంలో ఆ వెల్లువను కడవలోనికి ఎక్కిస్తాడు. అదే ఆనమాలు సుమా!" ఈ పలుకులు మనః ఫలకంలోనికి హఠాత్తుగా స్మరణకు వచ్చాయి. ముప్పిరి గొన్న ఆనంద బాష్పాలతో ఆ మహనీయ శిష్యుణ్ణి పారవశ్యాతిరేకంతో బిగిగా కౌగిలించు కొన్నాడు. విచిత్ర మేమిటంటే ఆ కౌగిలి మామూలు కౌగిలి కాదు. గోవింద భగవత్పాదాచార్యునినుండి దివ్యశక్తులు అన్నీ శంకరా చార్యునికి దత్తం చేయబడ్డాయి. తనకు జ్ఞప్తికి వచ్చిన కథను కూడా శిష్యునికి వినిపించాడు.
*కాశీప్రయాణము:*
గోవిందభగవత్పాదాచార్యుడు ఒకనాడు శంకరా చార్యుని పిలిచి ఆప్యాయంగా దగ్గరకు తీసికొని ఇలా సెలవి చ్చాడు: “ఆచార్యా! నీవు నా దగ్గఱ నేర్వ దగ్గది పూర్తి అయింది. నీవు ఇక్కడ ఉండ వలసిన పని లేదు. తిన్నగా కాశీ పట్టణానికి వెళ్ళి కైలాసనాథుని, అన్నపూర్ణా మాతనూ దర్శించుకో. వారు నీ రాకకు ఎదురు చూస్తూంటారు. అన్ని ఏర్పాట్లు సమకూరుస్తారు.
విద్యలకు నిలయమై, పరమ పవిత్రమైనదా స్థలం. నీవు చేయవలసిన ప్రక్రియలకు అచటనే నాంది. అచ్చోట నుండే బ్రహ్మసూత్ర భాష్యకారుడవు కమ్ము. అపచారభ్రష్ట మగుచున్న అద్వైతమునకు ప్రస్థాపనము చేయవలసి ఉంది. నీకు చెప్పదగినది లేదు. త్వరపడుము" గుర్వాజ్ఞకు మించినది లేదని తెలుసును శంకరాచార్యునికి. గురువుకు సాష్టాంగ ప్రణామం చేసి అంజలి ఘటించి నిలబడ్డాడు వారి అనుమతి కోసం. దిగ్విజయం పొందమని ఆశీర్వదించి నారాయణ స్మరణలు అనుగ్రహించాడు గురువు. వెనుతిరుగక ధర్మసంస్థాపనార్థం వెళ్ళే వీరవర్యునిలా సాగి పోతున్న శిష్య శేఖరునికి అభయం ఇస్తూ 'జయోస్తు' 'జయోస్తు' 'జయోస్తు' అని దీవించాడు గురుడు మహదానందంగా. తనలో గల మహిమ నెరుగని బాలుడు, తన కార్యభారం అపార మని తెలియని బుద్ధిమంతుడు, మితిమీరిన ఆటంకాలు కలుగునని యెరుగని వీరుడు శంకరా చార్యుడు. గురు కార్యం నెరవేరుతుం దన్న ధైర్యంతో గుర్వాజ్ఞనే వజ్రా యుధంగా చేసి కొన్నాడు. తాను గురు సాన్నిధ్యాన్ని విడనాడినా ఆ గురువునే తన హృదయాంత రాళాలలో ప్రతిష్ఠించుకొని ముందుకు పోతున్నాడు.
*గంగావతరణ గాథ:*
శంకరాచార్యుడు గంగానదీ పరిసరాలకు చేరుకుంటు న్నప్పుడు దివినుండి భువికి తెచ్చిన భగీరథ ప్రయత్నం గుర్తుకు వచ్చింది. కపిల మహర్షి కోపాగ్నికి అరువది వేలమంది సాగరులు భస్మమై పోయారు. వారికి ఉత్తరగతులు కల్పించ డానికి సగరుడు, అంశు మంతుడు, దిలీపుడు విఫలురయ్యారు. వారి తర్వాత భగీరథుడు అకుంఠిత సంకల్పంతో అనితరసాధ్యమైన మహా ఘోర తపస్సు చేసి గంగను భువికి రమ్మని ప్రార్థించాడు. గంగ అతనితో “రాజా! నా ప్రవాహ వేగాన్ని భూమి తట్టుకోలేదు. ఒక్క ఈశ్వరునికే అది సాధ్యం" అని చెప్పింది. అపుడు తిరిగి పరమేశ్వరుని గూర్చి తపంచేసి మెప్పించి వేడుకొన్నాడు గంగను శివుని తల మీదుగా భువికి దించడం కోసం. ఈశ్వరుడు ఒప్పుకొన్నాడు. ఉఱకలు వేసికొంటూ మహావేగంతో వస్తున్న గంగ కాస్తా శివుని జటా జూటంలో చిక్కు కొంది. మరల భగీరథుడు పరమేశ్వరుని వేడు కొన్నాడు: "గంగాధరా! శంకరా! ఆర్తత్రాణ పరాయణా! కరుణా సాగరా! విశ్వదేవా! మహాదేవా! భక్తవత్సలా!” గంగను విడువు మని మనసా వేడుకున్నాడు భగీరథుడు.
ప్రసన్నుడైన పశుపతి గంగను దిగవిడచాడు పర్వతాల మీదుగా. అందుండి కన్నూ మిన్నూ కానక పరుగులెత్తిన ఆ దేవనది ఒకచోనున్న మునివాటికను ముంచడం మొదలు పెట్టింది. అది జహ్నుముని ఆశ్రమం. ఆయన కోపం గంగను మ్రింగింది. వెనుకనే పరుగెత్తి వస్తున్న భగీరథునికి మరల మరొక అంతరాయం వాటిల్లింది. పరితాపంతో అర్థించిన భగీరథుని గోడు విని కరుణించి మ్రింగిన గంగను కర్ణం ద్వారా విడిచిపెట్టాడు పవిత్రతకు భంగం లేకుండా. అక్కడి నుండి కదలి తూర్పు ముఖంగా పారి పాతాళలోకం సొచ్చి సగరుల భస్మ రాశులను ముంచింది జాహ్నవి. శంకరాచార్యునికి భాగీరథీ దర్శన మయ్యింది.
*కైలాస శంకర కాలడి శంకర*
*శ్రీ శంకరాచార్య చరిత్రము*
*11 వ భాగము సమాప్తము*
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి