మహాలయ పక్షం ప్రారంభం , మహాలయ పక్షం అంటే ఏమిటి ? మహాలయ అమావాస్య ఎప్పుడొస్తుంది?*
(సెప్టెంబర్ 18 వ తేది నుండి అక్టోబర్ 2 వ తేది వరకు ఈ 15 రోజులను మహాలయ పక్షం అంటారు.)
మహాలయ పక్షం ఈనెల సెప్టెంబర్ 18 న ప్రారంభమై అక్టోబర్ 2 వ తేదీ మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి , మీ పితృదేవతలను స్మరించి , వారికి నమస్కారము చేస్తూ , *నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి , మీ దీవెనలు అందచేయండి’* అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు.
భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో , బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని , మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ , శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో , ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.
తండ్రి జీవించి , తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ , శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య (అక్టోబర్ 2 వ తేది) నైనా చేసి తీరాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి