15, సెప్టెంబర్ 2024, ఆదివారం

శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 10

 _*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 10 వ భాగము*_ 

🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅


*కాలడిని విడనాడుట:*


ఒకనాడు బ్రహ్మచర్యాశ్రమం నాటి పలాశ దండాన్ని వదలి దాని స్థానే జ్ఞానదండం వహించాడు. రాత్రంతా పూర్ణ ప్రక్కన ఉన్న కృష్ణాలయంలో గడిపాడు. తెల్లవారు జామున లేచి, అరుణో దయవేళకే కాలకృత్యాలు తీర్చుకొన్నాడు. తన ప్రయాణానికి అంతరాయం ఉండదని, రవి రాకుండా బయలు దేరడానికి సిద్ధ మయ్యాడు. ఎలా తెలిసిందో ఊరు ఊరంతా వచ్చి ముట్టడించారు శంకరుని.  వచ్చినవాళ్ళలో ఉన్న తల్లిని చూచి సాష్టాంగ వందనంచేసి సెలవడిగాడు. ఆమె నోట మాట రాలేదు. మౌనం అర్థాంగీకారమని వచ్చిన వారందరి దగ్గతా సెలవు తీసికొని ఉత్తర దిశగా అడుగులు వేశాడు. ఊరివారు శంకరుని వెన్నంటే వస్తున్నారు.  ఊరు దాటినా వారు వదిలి పెట్టలేదు. శంకరుడు లేని ఊరిలో ఉండ గలమా! అనుకొంటున్నారు. జయజయ ధ్వానాలు మిన్ను ముట్టడంతో శంకరునికి అర్థమైంది ఊరందరూ తన వెంటే ఉన్నారని. అపుడు వారిని ఉద్దేశించి "తండ్రులారా! తల్లులారా! నేను దేశం విడిచి వెళ్ళిపోవడం లేదు. మీ మీ పనులు మానుకోకండి. ఇళ్ళకు వెళ్ళండి. నాపై నున్న ప్రేమను ఊరిపై పెట్టండి. దయ యుంచి మరలి వెళ్ళండి” అని ప్రార్థించాడు. విడువ లేక విడువ లేక మరలు ముఖాలు పెట్టారు ఆ ఊరి జనం. మనస్సులలో చింతా, విచారమూ అలముకొని కన్నీరుగా ప్రవహించాయి.


*గురువుకడకు ప్రయాణము:*


కోటిసూర్య తేజస్సుతో వెలిగి పోతున్న శంకర బాలయతిని ఎవరా అని సిగ్గుతో తొంగి చూస్తు న్నాడు బాలభాస్కరుడు. పల్లెలూ పట్టణాలూ దాటి వెళ్ళుతున్నాడు. దారిలో ఉన్న ఊరి ప్రజలు చాలా ఆసక్తిగా ఆశ్చర్యసంభూ తులై సందర్శించు కొంటున్నారు ఆ అవతార మూర్తిని. ఎలా ఉంది ఆ విగ్రహం! పసిమి చాయ తోడి పాల బుగ్గలు. దొండపండును మించిన అధరోష్ట్రము. శ్రీకారాలను మించిన దానిమ్మపండు రంగుకల వీనులు. పద్మ దళాలను పోలిన నేత్రాలు. లేత అరటి దూట వంటి కాలుచేతులు.బంగరు మేనిఛాయ. తళ తళ లాడే విభూతి రేఖలు. పాదపద్మాల నుండి పావుకోళ్ళకు జారుచున్న దానిమ్మ పుప్పొడి. చూచిన వారికి కన్నుల పండు వైంది. వీధులలో శంకరుడు నడచి వెడుతుంటే అరుగులపై కూచున్న వాళ్ళు చరచరా దిగి వచ్చి ఆ బాలయతికి వినయ విధేయ తలతో నమస్కారాలు  అర్పించే వారు. కొందరు ఆయన వెంట కొంత దూరం నడచి వెళ్ళేవారు. అప్రతిహత తేజంతో విరాజిల్లే ఆ బాల సన్న్యాసిని చూచి సంబర పడని వారు లేరు. మరికొందరు ఆ బాలుని తనివి తీరా పలకరించి అట్టిభాగ్యం తమకు లభించి నందుకు మురిసి పోయేవారు. అట్టివారికి శంకరుడు ఇచ్చే సందేశం ఎప్పుడూ ఇదే: “ధర్మం మఱువకుండా ఆచరించండి. సత్యాన్ని విడువకండి”.


ఊరి బయట బయళ్ళలో గోపాలబాలునిగా భ్రమించి ఆలమందలు మోరలెత్తి దగ్గఱగా సమీపించేవి. గోపాలురు ఆ వింత చూచి పరుగుపరుగున వచ్చి పడే వారు. వన్యమృగాలు బహుళంగా విహరించే కారడవిలోనుండి వెళ్ళడం శంకరునికి కష్టమనిపించ లేదు. అలా కొంత దూరం పోయాక మార్గం కంటకా వృతమయ్యింది. జాగ్రత్తగా అడుగులిడుతూ నడుస్తు న్నాడు. ఇరుపార్శ్వాలు దట్టమైన పొదలు అలుముకొని ఉన్నా ఆయన పురోగతికి అడ్డులేదు. వనంలోని మృగాలకు బాలయతి అర్థనారీశ్వరుడై కన్పట్టాడు. బహుదూరంగా ఉన్న సింహాలు తమ ఏలిక గిరిజయే వచ్చిందని శంకరుని వామ పార్శ్వం చేరాయి. మహానాగులు పడగ విప్పి ఛత్రం పట్టాయి. గజరాజులు ఘీంకారం చేస్తూ తొండాలెత్తి జేజేలు పలికాయి. పరమాత్మ చింతనలో ఉన్న ఆ అవతార పురుషుని మహిమలు ఎవరూహించ గలరు?


*నర్మదా నదీ ప్రాంతము:*


మన బాలశంకరుడు నర్మదానదీ ప్రాంతం చేరుకోబోతున్నాడు. లోకోత్తర మహాపురుషుడు అన్న వార్త తెలిసిన వాయుదేవుడు తన పరివారాన్ని ఆయత్తపరచి దారి పొడుగునా వృక్షరాజ ములచే వంగి వంగి నమస్కారాలర్పించ జేసాడు. పరిమళములు గుబాళించే పుష్ప వర్షాన్ని కురిపించి స్వాగతం పలికాడు. అందుండి సమీరుడు బాలయతిని ఒక నందన వనంలోనికి ప్రవేశ పెట్టాడు. కొంత విశ్రాంతి తీసికొన్న పిమ్మట మధురాతిమధురమైన ఫలాలను నివేదన చేశాడు. ప్రయాణపు బడలిక లేకున్నా ఆ పండ్లు తిని ఒకింత తడవు విశ్రమించాడు శంకరుడు. ముందు ముందు పోగా పోగా మునులు నివసించే జాడలు పొడగట్టాయి. మరి కొంత దూరం ఆ వైపుగా నడవగా ఆరవేసిన మునులు కట్టే బట్టలు కనబడ్డాయి. అక్కడ జంతువులు తమ తమ సహజ వైరం మరచి పరస్పర మైత్రీ భావంతో మెలగుచున్నాయి.


శంకరుడు రావడం చూచిన ఋషులు ఆడబోయిన తీర్థం ఎదురైంది అనుకొన్నారు. అతని లేబ్రాయమూ, దివ్యతేజమూ చూచి విభ్రాంతులయ్యారు. బాల్యంలోనే పరమవిరాగి అయిన అతని పూర్వభవ పుణ్యానికి విస్తుపోయారు. ఒక ముని ప్రశ్నించాడు: "బాలకా! ఎందుకో ఈ తావు చేరావు? ఎచటికి పోనుంటివి?” “మునివర్యా! గోవింద భగవత్పాదాచార్యుల కడకు నా ప్రయాణం" అని శంకరుని సమాధానం.


*శ్రీగోవింద భగవత్పాదాచార్యుల సన్నిధి:*


అప్పుడా ముని మారు మాటాడక తనతో రమ్మని దారి చూపుచూ ముందుకు నడుస్తున్నాడు.దగ్గరలో ఉంది ఒక గుహ. అక్కడికి చేరాక అందు దేదీప్య మానంగా వెలుగొందుచున్న గురువర్యుడు కానవచ్చాడు బాలయతికి. అది తన గురుని సన్నిధియే అని గ్రహించి శంకరుడు గుహ చుట్టూ ప్రదక్షిణచేస్తూ ఇలా ప్రార్థించాడు. 


“సద్గురుదేవా! జ్ఞానదాతా!

పరబ్రహ్మస్వరూపా! బ్రహ్మానందదాయకా! నిరంజనా! నిర్వికల్పా! సర్వధీసాక్షిభూతా! త్రిగుణాతీతా! దివ్యమూర్తీ! పూర్ణకృపానిధీ! ప్రసన్నాత్మా! యోగీశ్వరేశ్వరా! జ్ఞానస్వరూపా! నిరాకారా! చిదానందా! సచ్చిదానందా! జగద్గురో!”


అని ప్రధమ ప్రదక్షిణ చేసాడు. “విశ్వాతీతా! నిష్కళంకస్వరూపా! సమస్త జగదాధారమూర్తీ! దీనబాంధవా! ప్రణవ స్వరూపా! మహాప్రాజ్ఞా! త్రికాలజ్ఞా! ద్వంద్వాతీతా! సద్గురుమూర్తీ! ఆర్తత్రాణ పరాయణా!వందనములు” అని ప్రార్థిస్తూ రెండవ ప్రదక్షిణం. 


మూడవ ప్రదక్షిణం చేస్తూ ఇలా స్తుతించాడు గురువును: “నాదబిందుకళాత్మకా! జన్మకర్మనివారకా! భవతారకా! సర్వకారణ మహేశ్వరా! భూతాత్మా! భక్తవత్సలా! పురుషోత్తమా!”.


బిలద్వారానికి ఎదురుగా నిలబడి ఉన్నాడు శంకర యతి. ఆ ద్వారం చాలా చిన్నదిగా ఉంది. "స్వామీ! నిన్ను ఆశ్రయించ డానికి వచ్చిన దీనుడను. ఆత్మతత్త్వాన్ని బోధించి తరింప జేస్తూ అఖిలానందాన్ని ప్రసాదించుటకు అవతరించిన మహామహుడవు. శేషశయనునకు హాయి నిచ్చే ఆదిశేషుడవు. మమ్ము తరింపజేయుటకు వెలసిన కరుణామయుడవు. విశాల హృదయంతో వ్యాకరణశాస్త్రానికి భాష్యం అందించిన అప్రమే యుడవు. శరణని వేడిన శిష్యునిలో బంధింపబడి యున్న జుగుప్స, సంశయము, శీలము, కులము, బలము, భయము, మోహము, దయ అనబడే ఈ ఎనిమిది పాశాలను ఛేదించ గలవాడే సద్గురువని తెల్పి యున్నావు. అన్నింట మిన్న అయిన మిమ్ములను ఆశ్రయించ వచ్చాను”. అప్పుడు శంకరుడు ఈ విధంగా గుర్వష్టకం చదివాడు:


'శరీరం సురూపం తథా వా కలత్రం, 

యశశ్చారు చిత్రంధనం మేరు తుల్యమ్ మనశ్చేన్న లగ్నం గురో రంఘ్రి పద్మే, తతః కిం తతః కిం తతః కిం తతఃకిమ్


"గురుదేవా! వేరొకరి శరణుగానక మీ శరణు గోరి మీ చరణములు శిరమున దాల్చగోరి వచ్చిన వాడను. ఇదిగో మీ శిష్యుడు. అనుగ్రహించుడు. మీ యిచ్ఛ చొప్పున శాసించుడు" సవినయంగా నివేదించాడు శంకరుడు. ఆ పలుకులు వీనులకు విందులై ఈ తెఱంగున ఎవరూ వేడుకొన లేదే!' అని మదిలో తలపోసాడు శ్రీ గోవింద భగవత్పాదా చార్యులు.


*గురువుకు తానెవరో ఎఱిగించుట:*


చేతులు జోడించి బిలద్వారానికి ఎదురుగా వినయం ఉట్టి పడుతూ నిలబడిఉన్న ఆ బాలుణ్ణి “ఎవ్వడవు నీవు?” అని ప్రశ్నించారు గురువు. గురుడు కరుణామూర్తియై ఉన్నాడని తన పంట ఫలించిందని గ్రహించి ఈ క్రింది రీతిని చెప్పుకొంటున్నాడు.


“మనో బుద్ధ్యహజ్కార చిత్తాని నాహం, న జిహ్వా న చ ఘ్రాణ నేత్రమ్ న చ వ్యోమ భూమి ర్నతేజో న వాయు:, చిదానన్దరూపః శివోహం శివోహమ్–

ఈ అతుల విన్నపం విన్న శ్రీ గోవిందభగవత్పాదా చార్యులు పరమానంద భరితులై శంకరుని దగ్గరకు రమ్మని పిలిచారు.


*శంకరయతి శంకరాచార్యుడగుట:*


మన శంకరుని సన్న్యాస కర్మకాండ పూర్తి కావడానికి మరొక అంశం ఉంది. శిఖ, యజ్ఞోపవీతం విసర్జించాలి. ఆ పని కాస్తా గురువులు యధావిధిగా జరిపించారు. తక్కుగల కర్మకాండ యావత్తూ శాస్త్రోక్తంగా నిర్వర్తింపజేసి మహా మంత్రోపదేశం చేశారు. పిమ్మట మహావాక్యోప దేశం చేసారు. పూర్వాశ్రమంలో పెట్టిన పేరు విసర్జించాలి. అంతే కాదు విస్మరించాలి. జన్మించిన ఊరి పేరే కాక తల్లిదండ్రుల పేర్లు కూడా తలపరాదు. చెప్పరాదు. సన్న్యాసంతో అవన్నీ పోతాయి. ఈ ఆశ్రమం లోనిది క్రొత్త పుట్టుక. క్రొత్త పేరు ధరించాలి. శ్రీ గోవిందపాదులు ఆలోచించి శంకరాచార్యుడు అని నామకరణం చేసారు. శంకరుడంటే ఆనంద కరుడని. ఇది ఈ యతికి అన్వర్థనామం. తల్లిదండ్రులు పెట్టిన పేరు ఈ ఆచార్యరూపంలో ప్రసిద్ధి కెక్కినది. నేటి పీఠాధి పతులకూ ఇదే నామం. ఇక గురుపరంపరకు వస్తే పరాశరునకు వ్యాసుడు, వ్యాసునకు శుకుడు, శుకునకు గౌడపాదుడు, గౌడపాదునకు గోవింద భగవత్పాదుడు, గోవింద భగవత్పాదునకు శంకరాచార్యుడు శిష్యులైనారు.


*కైలాస శంకర కాలడి శంకర*


*శ్రీ శంకరాచార్య చరిత్రము* 

*10 వ భాగము సమాప్తము*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

కామెంట్‌లు లేవు: