15, సెప్టెంబర్ 2024, ఆదివారం

*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 13

 _*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము13వ భాగము*_

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


*బదరీ ప్రయాణము:*


తపస్సాచరించాలన్నా, ధ్యానంలో నిమగ్నం కావాలన్నా, దేవతల ఉనికికైనా, బ్రహ్మనిష్ఠుల కైనా ఉత్తరదిశయే చాలా శ్రేష్ఠం. ఇది తెలిసిన శంకరాచార్యుడు భాష్య రచనకై బదరీ వనానికి బయలు దేరారు శిష్యులతో. తాపసు లనేకులు తపస్సు చేసి ధన్యులైన వనము బదరికావనము. ఒకప్పుడు సహస్ర కవచుడనే రాక్షసుడు లోకాల్ని కంటకావృతం చేస్తూంటే, వాణ్ణి సంహ రించడానికి నరనారాయణులు దుర్భర తపస్సు ఆచరించిన వనం అది. ఆ వనం నిర్మలం గాను, మనోహరం గాను, సకల శ్రేయస్సుల నిచ్చేది, మనోవాంఛలను సమకూర్చేది గాను ఉంటుంది. దారిలో ఉన్న ఎన్నో పుణ్యస్థలాలు చూస్తూ, పుణ్యతీర్థాలలో గ్రుంకు లిడుతూ మధ్య మధ్య గల ఋషి పుంగవులను దర్శిస్తూ ముందుకు పోతున్నారు శంకరాచార్యులు శిష్య బృందంతో.


ఆ మార్గం తిన్నగా లేదు. ఒకచో ఎగుడు దిగుడు, ఒకచో బురద, మరొకచో భరించరాని తాపము. పిమ్మట తట్టుకోలేని శీతము. చాల చోట్ల కంటకావృతము. పాము మెలికల్లా వంకరటింకరగా మెలికలు తిరిగిన దారి. ద్వంద్వాలకు అతీతు డైన ఆయనకు ఆమార్గము దుర్గమము కాదు. మధ్య మధ్యలో క్షుత్తు కలిగినపుడు మంచి మంచి ఫలాలు, చక్కటి నీరూ లభ్యము అయ్యేవి. మార్గాయాసం కలుగ కుండా మంచి మంచి మాటలు చెప్పుకొంటూ అక్కడక్కడ చెట్ల నీడలలో విశ్రమించే వారు. అలా చని చని కొన్ని వారాల తర్వాత బదరికావనం చేరేటప్ప టికి రాత్రి పోయి పగలు వచ్చినంత సంతోషాన్ని పొందారు శంకర శిష్యులు.


అక్కడ ఒక పెద్దదైన వృక్షాన్ని చూచుకొని దాని క్రింద ఆశ్రమాన్ని నిర్మించారు. దగ్గరలో తల ఒక పర్ణకుటీరం ఏర్పరచుకొన్నారు.


*బ్రహ్మసూత్ర భాష్య రచన యొక్క ఆవశ్యకత:*


కవులు వ్రాసే కావ్యాలు కొన్ని గుంభనంగా ఉండి అందరికీ వాటిలోని భావాలు తెలియవు. మరి కొన్ని శాస్త్రాలు సూత్ర రూపంలో ఉండ డంతో ఇంకా కష్టం వాటిని అర్థం చేసు కోవడం. సూత్రం చిన్నదిగా భావం బ్రహ్మాండంగా ఉంటుంది. సూత్రాలకు ఎన్నోముళ్ళు వేస్తారు. నేర్పుతో ఆముళ్లు విప్పితే భావం బయట పడుతుంది. సూత్రాలు ముందు వెనుకలతో సంబంధం కలిగి ఉంటాయి. జైమిని జ్యోతిష శాస్త్రాన్ని సూత్రాలలో ఇమిడ్చి వ్రాసాడు. ఒక్కొక్క సూత్రానికి భాష్యం వ్రాయాలనిన చాల పుటలు పడుతుంది. వేదాంతం లోని పరమార్థం కంటి కగపడే దాన్ని గురించి చెప్పునది కాదు. అందరికీ అవగాహన అయ్యేదీ కాదు. కొన్ని అర్హతలు సంపాదించు కొని ఉండాలి. వ్యాసరచితమైన బ్రహ్మ సూత్రాలను కొందరు మహనీయులు వేదాంత సౌధంగా వర్ణించారు.దాన్ని అధిరోహించ డానికి ఒకదాని తరువాత ఒకటి ఎక్కేలా మెట్లు కట్టాలి. అమాంతం ఎక్కబోతే అంధకార బంధురమే. క్రమం తప్పకుండా ఎక్కిన వారు ఆ ప్రాసాదం లోని జ్ఞాన కవాటం తెరవవచ్చు. వ్యాసుడు వ్రాసిన ఆ గ్రంథం వేదాంతమూ, ఉప నిషత్తులూ గుచ్చెత్తి తయారు చేసిన తత్త్వ పిండము. దాన్ని సరిగా అవగాహన చేసికొన లేక కొందరు చేసిన ధర్మ విరుద్ధమైన వ్యాఖ్యలు ప్రబలి దేశంలో ధర్మగ్లాని విస్తృతమై నాస్తికమతం చోటు చేసికొంది. పరిస్థితిని చక్కదిద్దగల దక్ష లేక బ్రహ్మసూత్రాలు అందు బాటులో లేకుండా పోయాయి.


*బ్రహ్మసూత్ర భాష్య రచన:*


తాను రచించిన బ్రహ్మ సూత్రములను తెలిసికొనే దెవ్వరన్న ప్రశ్నతో ప్రారంభించాడు వ్యాసుడు. ద్వారమే మూసి వేసినట్లు అందరికీ హక్కు లేదని మొదటే నిష్కర్షగా చెప్పేశాడు “అథాతో బ్రహ్మ జిజ్ఞాస" అన్న తొలిసూత్రంలోనే. ఆనాడు ఈ సూత్రాన్ని ఎవరికి తోచినట్లు వాళ్ళు అర్థం చెప్పారు.


'మంగళాచరణం చేసిన తర్వాత' అని కొందరు, 'సంపూర్ణ వేదాధ్యయనం తర్వాత' అని కొందరు, 'కర్మాచరణ ద్వారా జ్ఞానం కలిగిన తర్వాత' అని వేరొకరు అని వివరణ ఇచ్చారు.


*శంకరులు భావించినదిలా ఉంది:*


బ్రహ్మజ్ఞానార్జనకు పైచూపులు ఉపయోగిం చవు. లోపలి చూపులు ఉన్నవాడే అర్హుడు. లోపలి చూపులు సామాన్యంగా ప్రాప్తించేవి కావు.లోకము అనిత్యం అన్న సత్యం గ్రహించ గలగాలి. అప్పుడే పైచూపు నశిస్తుంది. చిత్తం పరిశుద్ధం అవుతుంది. చిత్తశుద్ధి మోక్షాపేక్షకుదారి ఇస్తుంది. అప్పుడు బ్రహ్మ విచారము అవశ్య కర్తవ్యమవుతుంది.


బ్రహ్మపదార్థమున్నదని తెలిసినా ఏది బ్రహ్మమనే విషయానికి వచ్చేట ప్పుడు తప్పటడుగులు పడతాయి. శరీరాన్నే దేవుడనీ, ఇంద్రియాలనే పరమాత్మ యనీ, విజ్ఞానమునే పరమాత్మ అనీ పలు తెఱగుల వాదాలు ఉన్నాయి. ఎట్టిది పరబ్రహ్మము? ఏది కాదు? ఈ ప్రశ్నలు విచారణ చేసి వ్యాస మహర్షి తన సూత్రముల ద్వారా సందేహ నివృత్తి చేశాడు. వ్యాసుని అభిమతమే సరియైన దని విజ్ఞుల నిర్ణయం. ఆ విషయం బహిర్గతం చేయడానికి వ్యాసుని మించిన వాడుండాలి.అందుకు నియమితుడైన వాడే శంకరాచార్యుడు. భాష్యంవ్రాస్తూ శంకరుడు ఏ రోజు భాష్యం ఆ రోజే శిష్యులకు బోధించేవాడు. ఈ వార్తలు విన్న దగ్గరలో ఉన్న మహర్షులు భాష్య పాఠాన్ని వినడానికి వచ్చేవారు. మూడు వారాలపాటు ఏకధాటిగా సాగి పూర్తయిన ఆ భాష్యం మునుల అనుమానాలను పటాపంచలు చేసింది.


*ఉపనిషత్తులకు భాష్యరచన:*


ఋషులు వేదాంత రహస్యాలను లోకం ముందు ఉంచా లన్న ఉద్దేశంతో ఉపనిష ద్రూపంలో చెప్పారు. పేరుబడిన ఉపనిషత్తులు నూట యెనిమిది. అందులో పదింటికి భాష్యం వ్రాస్తే చాలునని భావించాడు శంకరా చార్యుడు:


*“ఈశ కేన కఠ ప్రశ్న ముండక మండూక్య తిత్తిరి:*

*ఐతరేయంచ ఛాన్దోగ్యం బృహదారణ్యకం తథా”*


*ఈశోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నకోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తిత్తిరికోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు,* బృహదారణ్యక ఉపనిషత్తు వీటినే ఎన్నుకొన్నాడు తన భాష్యరచనకు. 


సంశయాలకు తావు లేకుండా క్రొత్తపోకడలను పొందుపరచి ఆ దశోప నిషత్తులకూ అందమైన భాష్యాన్ని రచించి అందించాడు. అద్వైతులకు శిరోధార్యమై వెలయుచున్నాయి ఆ భాష్యాలు.


పైన చెప్పిన భాష్యములు రెండు ముగించిన పిమ్మట శంకరాచార్యుల వారు భగవద్గీతకు భాష్యము వ్రాయడానికి ఉపక్రమించారు. కురు క్షేత్రంలో కౌరవ పాండవ యుద్ధము ఆరంభం అయ్యే సమయానికి అర్జునునకు జ్ఞానం లోపించి యుద్ధం చేయడానికి మనసొప్పక అస్త్రసన్న్యాసం చేశాడు. అది లోకానికి అపూర్వ మైనసందేశం ఇవ్వడానికి మంచి తరుణమని యెంచి శ్రీకృష్ణుడు సంపూర్ణమైన జ్ఞానబోధ చేశాడు అర్జునునకు. బాదరాయణుడు భారతాన్ని రచించే టప్పుడు ఈ భాగాన్ని అక్కడినుండి తీసి ప్రస్థానంలో చేర్చి భగవద్గీత అని పేరు పెట్టి యున్నాడు. 


బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత : ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయము అంటారు.

బ్రహ్మసూత్రాలు నూరినగాని పాకాన పడవంటారు. ఉపనిష త్తులు వినిన సరిపడు నందురు. గీతను ఆచరణ గ్రంథ మంటారు. అగాధ భావములు కలిగి గీత ముముక్షువులకు పెన్నిధిగా భాసిస్తున్నది. గీత తేలికయైన భాషలో ఉన్నా దాని భావాలను బహిర్గతం చేయడం అంత సుళువు కాదు. అప్పట్లో గీత లోని సత్యాన్ని గ్రహించుటకు పాఠకులు తికమక పడడం చూచి భగవద్గీతకు భాష్యం వ్రాయడానికి శంకరా చార్యులు పూనుకోవలసి వచ్చింది.


ఇవి కాక, మరి రెండు ఉపనిషత్తులు నృసింహతాపనీయ ఉపనిషత్తు, శ్వేతాశ్వతరోపనిషత్తు లకు కొందరి కోరికపై వ్యాఖ్య వ్రాశారు. పండ్రెండు మంత్రములతో కూడి మకుటమనిన మాండూక్యోపనిషత్తుకు గౌడపాదులు రెండు వందల పదిహేను కారికలు వ్రాసినా సుబోధకములు కాలేదని వారి కోరికతో శంకరులు భాష్యం వ్రాశారు. ఇది దశోపనిషత్తులలో చేరి యున్నది.


భాష్యత్రయ రచన ముగియడంతో బదరికా వనంవీడి శంకరా చార్యులు వారి శిష్యులు కాశీ పురి చేరుకున్నారు.


*హరహర శంకర కాలడి శంకర*


*శ్రీ శంకరాచార్యచరిత్రము*

*13 వ భాగము సమాప్తము* 

🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃

కామెంట్‌లు లేవు: