26, నవంబర్ 2024, మంగళవారం

*33 - భజగోవిందం

 *33 - భజగోవిందం / మోహముద్గర*

🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑


*భజగోవిందం శ్లోకం:-31*


*గురుచరణాంబుజ నిర్భర భక్తః సంసారాద చిరాద్భవ ముక్తః॥*

*సేన్ర్దియమానసనియమాదేవం  ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవమ్ ॥భజ॥  31*


*ప్రతి॥* గురుచరణాంబుజ = గురుచరణములనే కమలాలపై; నిర్భరభక్తః = ఎక్కువైన భక్తి కలిగివాడు; స+ ఇన్ర్దియ = ఇంద్రియములూ; మానస = మనసూ; సంసారాత్ = చావుపుట్టుకలనుండి; ముక్తః = ముక్తుడవు; భవ = అగుదువు గాక; నిజ = నీయొక్క; హృదయస్థం = హృదయాంతరాళంలో వున్న; దేవమ్ = దేవుని; ఏవమ్ = ఈ విధంగా; ద్రక్ష్యసి = చూచెదవు గాక.


*భావం:-*


గురుచరణ సేవారతుడవైన ఓ భక్తుడా! నీ జ్ఞానేంద్రియములూ మన స్సులను క్రమ శిక్షణలో పెట్టడం ద్వారా యీచావు పుట్టుకలనే సంసారం నుంచి విముక్తుడవు అగుదువుగాక. అప్పుడు నీ హృదయంలోనున్న పరమే శ్వరుని ప్రత్యక్ష పరుచుకొందువు.


*వివరణ:-*


సాధకుని యాత్రలోని ఎత్తుపల్లాలు తేలికగా సమానం చేయగలగాలంటే విశ్వాసం గురుభక్తి రెండూ అవసరం, మానవ హృదయంలో 'నమ్మిక” అనేది అతడి లో శక్తి నుద్భవింపజేయటానికి రహస్యమైన బలమైన ఆధారం, 'సెంట్ అగస్టిన్' అనే ఆయన విశ్వాసము అనేదాన్ని యిలా నిర్వచించి చెప్పాడు, విశ్వాసము అంటే నీవు ప్రత్యక్షంగా చూడలేని దానిని నమ్మటం, దాని ఫలితం నీవు నమ్మినదాన్ని ప్రత్యక్షం చేసుకోవటం అని.


గురువుచెప్పిన సూత్రము వెనువెంటనే తెలిసికొనలేముగాక, కాని ఆయన ఉపదేశములలోని తర్కము మన జ్ఞానలేశంచేత సూత్రమును తెలిసికోవటానికి సహాయం చేస్తుంది. ఇదమిత్థమని తెలియనప్పుడు కూడ ఆయన చెప్పిన ఒకానొక ఆశయ మును నమ్మటం అందుకనే తప్పనిసరి అయివుంటుంది. అందుచేత "విశ్వాసము" లేదా "నమ్మిక” అంటే యేమిటంటే వచే జ్ఞాన వశంచేత ఇంకా తనకు ప్రత్యక్షంకాని విషయం గూర్చి తెలిసీ తెలియనట్లుగా నున్న స్థితిలో నమ్మకమనేది హృదయంలో వున్నప్పుడు ఆ నమ్మకమే "విశ్వాసము'' అనాలి. 


ఈ ‘విశ్వాసము' అనే దానికున్న రహస్యమైన శక్తి. మనిషిని సునాయాసం గా తన రెక్కలమీద నెక్కించుకొని, అతడి గమ్యస్థానానికి ప్రత్యక్ష దర్శనం కలిగించటానికి తీసికొని పోతుంది. విశ్వాస రహితుడైన శిష్యుడు - వట్టిగా బజారులపై తిరిగే అంధుడు - బధిరుడు - ఒక ప్రక్క తన శరీరం నిర్జీవమై పోయినట్టివాడున్నూ అనవచ్చు.


శంకరులు తన శిష్యులనూ అంతే కాకుండా తన కాలంనుంచి అనంతమైన యీ కాలం వున్నంతవరకూ ఏ యే శిష్యులయితే వుండబోతారో ఆ శిష్యులందరనూ ఆశీర్వదిస్తున్నారు. మీరీ చావు పుట్టుకల సంసారం నుంచీ బయటపడి పోతారుగాక అని.


ఈ ముక్తి ఎప్పుడో ఎక్కడో దూరాన జరిగే పనికాదు, ఇక్కడి కిక్కడ ఇప్పటి కిప్పుడు జరిగేపని, అద్వైతమూర్తి తిరిగి శిష్యుని ఆశీర్వదిస్తూ చెప్పారు, "నీ జ్ఞానేంద్రి యాలు మనసూ క్రమశిక్షణ పొందటం ద్వారా నీ హృదయంలో నున్న ప్రభువునే నీవు ప్రత్యక్షం చేసికొంటావుగాక" అని. 


నిష్కపటమైన స్తుతి, ప్రపత్తి పూర్ణమైన సమర్పణం గురువును గూర్చి చేయ టమే అభ్యసించాలి. శిష్యుల కొక్కరికే కాదు యీ పాఠం, గురువులయిన వారికి కూడా యిదే ఆజ్ఞ. ఈ శ్లోకంలో చెప్పేటప్పుడు శంకరులు బహుశ తన గురుదేవులకు సాష్టాంగపడి నమస్కరించి వుంటారు. ఎందుకంటే- ఆయన గురువుల పేరు గోవిందా చార్యులవారు ఈశ్లోకం చెప్పగానే భజగోవిందం భజగోవిందం అని పల్లవి అందుకునే టప్పుడు తన గురువులను ధ్యానించి, నమస్కరించి వుంటారు, తప్పదు.


ఉపనిషత్తులలో కూడ గురవు వుండవలసిన అవుసరం ఎంతో ముఖ్యమని చెప్పబడింది. ముండకోపనిషత్తులో గురువు యొక్క గుణగణములెలా వుండాలో విహితమయింది. తిరిగి ఛాందోగ్యోపనిషత్తులో గురువు లేకుండా ఆధ్యాత్మికాభివృద్ధి కలిగించుకొనే అవకాశం కించిత్తు కూడా లేదని చెప్పి అలాటి అవకాశాన్ని విచ్ఛిన్నంచేసి పడేశారు. *"ఆచార్యవాన్ పురుషా వేద”* ఆచార్యుని కలిగియున్నవాడే పరమ పురుషుని గుర్తింపు చేయగలగటం ముక్తిని పొంద గలగటమున్నూ అని.


సా గురుమేవాభి గచ్చేత్, సమిత్పాణిః, శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం----ముండకోపనిషత్తు--(

1-11-12)



గురువులకు నమస్కరించటం అనే దానితో ఓయీ! వేదాంత విషయికమైన క్రోడీకరింపు కలిగిన యీ ప్రక్రియా స్తోత్రము ముగింపు అవుతుంది. - భజగో విందమ్ భజగోవిందమ్ అంటూ,


భజగోవిందము అనేది శ్రీశంకరుల రచనల్లో ఒకానొక చిన్న రచనగా పరిగణించబడుతోంది. ఆధ్యాత్మిక గురువులందరూ కూడ తమకు ప్రత్యక్షానుభూతి కలిగిన క్షణాల్లో పరమోత్కృష్టమైన సత్యపదార్థాన్ని అతి చిన్న వాక్యాల్లో విడమర్చి చెప్పటం అల వాటు. పెద్ద పెద్ద వ్యాకరణ శాస్త్రాలు చదివిన పండితులు యిలాంటి రచనలను చిన్న రచన అని ప్రక్కకు నెట్టటం కూడ మామూలే.


ఈ స్తోత్రంలో వుపయోగింపబడిన పదములు యెంతో సర్వసాధారణమైనవి అవటం వల్లనూ, పాటలోని చక్కని ఫణితివల్లనూ, అందులోని సంగీత మాధుర్యము వల్లనూ, ఈ స్తోత్రము కలిగించే విషయ వాతావరణము వల్లనూ, గుమిగూడి అనేక మంది పాడటంవల్ల కలిగే ఉధృతమువల్లనూ దేశంలో భజగోవింద స్తోత్రము యెంతో ప్రాపకమునకు వచ్చినది. మొన్నమొన్నటి వరకూ కూడ బజారుల్లో అనేకమంది దీనిని పాడుతూ వుండటం భారతదేశం అంతటా కూడ వింటూ వచ్చాం. పసివాళ్ళు పెదాలు కదిల్చి పలుకుతారు.


శైశవంలో వున్నవాళ్ళు ఉరిమినట్లు కదం త్రొక్కుతారు. జ్ఞానవంతులు దీజ అర్థంచేసికొంటారు. వేదాంతులు దీనిని పాడి సంతోషించుతారు. సాధకులు దీనిలోని ఉపదేశాన్ని ఉపయోగించుకొంటారు. తమ జీవితాలను సఫలం చేసుకొంటారు.


అనేకమంది జనులచే పాడబడి ఉపయోగించబడినప్పుడు కొద్దికాలము మాత్రమే గాక పదిశతాబ్దాలనుంచి దేశమంతా అలా జరుగుతున్నప్పుడు ఆ పాటకు చిలవలు పలవలు పుట్టటం కద్దు. ఈ స్తోత్రం అచ్చయిన ప్రచురణల్లో యే రెండూ ఒకే విధంగా లేవు. వాటన్నిటినీ చూసి అత్యంతమైన వాస్తవాన్ని వ్యక్తీకరించటానికి యేవి ఎక్కువగా సహాయపడుతున్నాయో పాఠాలు తీసికొని యిక్కడ సమకూర్చటమయింది.


ఈ కవిత్వంలో ముప్పది యొక్క శ్లోకాలున్నవి. మొదటి శ్లోకం పల్లవి, సామూహిక సాధనల్లో దాన్ని పల్లవిగా అందరూ కలిసి పాడతారు. ఎవరో ఒకానొకరు లేదా కొందరు మాత్రం ఇతర శ్లోకాలు ఒకటొకటిగా పాడుతూ వుంటారు. మొదటి పన్నెండు చరణాలున్నూ (2-13) ఆదిశంకరులు చరించినవని ప్రసిద్ధము. ఆ తరువాత వచ్చే పదునాలుగు శ్లోకాలున్నూ (14-27) శ్రీ శంకరుల శిష్యులు పదునాల్గురు

ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చెప్పినట్లు చెప్తారు. వాళ్ళు శ్రీ శంకరులు కాశీయాత్ర చేసినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిన శిష్యులు.


వాస్తవంగా చెప్పాలంటే ఈ పదునాలుగు శ్లోకాలు ఎవరెవరేది రచించారనే విషయానికి సాక్ష్యమేదీలేదు. కాలమనే తుఫానులో కలిసిపోయి సాక్ష్యమనేది తుడుచుకు పోయింది. ఫలాన ఫలాన శ్లోకం ఫలాన ఫలాన వారిదని అను శ్రుతిగా చెప్పే సాక్ష్య మొక్కటే, మిగిలింది.


చివరి నాలుగు శ్లోకాలున్నూ ఆచార్య శంకరులే రచించారని ప్రతీతి. అత్యంత ముఖ్యమయిన వేదాంత విషయాలను ప్రకటించిన ఈ స్తోత్రం అందుకు తగినట్లుగా శ్రీ శంకరుల ఆశీర్వచనాలతో ముగింపు చేయబడింది. సాధకులను ఆశీర్వదించటం ఎంతో తగివుంది.


ఆ పరమేశ్వరుని ఆశీర్వచనములు నిరంతరం మనందరిపై ప్రసరించుగాక!


*హరిః ఓం తత్ సత్!!*

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

కామెంట్‌లు లేవు: