26, నవంబర్ 2024, మంగళవారం

10-18,19-గీతా మకరందము

 10-18,19-గీతా మకరందము

          విభూతియోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


విస్తరేణాత్మనో యోగం 

విభూతిం చ జనార్దన | 

భూయః కథయ తృప్తిర్హి 

శృణ్వతో నాస్తి మేఽమృతమ్ || 


తా:- ఓ కృష్ణా! మీయొక్క యోగమహిమను, జగల్లీలావిభూతులను (ధ్యానింపదగిన వస్తువులను) సవిస్తరముగ మఱల తెలియజేయుడు. ఏలయనగా మీయొక్క అమృతవాక్యములను వినుచున్న నాకు సంతృప్తి కలుగుట లేదు (ఇంకను వినవలయునని కుతూహలము గలుగుచున్నది). 

 

వ్యాఖ్య:- శిష్యునకు గురువాక్య శ్రవణమున ఇట్టి ఉత్కంఠ జనింపవలెను.

____

అ|| అర్జునుని యా వాక్యములనువిని భగవానుడు తన విభూతులను వర్ణింపదొడగుచు, ప్రధానములైనవానిని మాత్రమే చెప్పెదనని తెలుపుచున్నాడు - 


శ్రీ భగవానువాచ :-

హన్త తే కథయిష్యామి 

దివ్యా హ్యాత్మవిభూతయః | 

ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ 

నాస్త్యన్తో విస్తరస్య మే || 


తా:- శ్రీ భగవంతుడు చెప్పెను - కురువంశశ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! ఇప్పుడు దివ్యములైన నాయొక్క విభూతులను ప్రాధాన్యతననుసరించి (ముఖ్యములైనవానిని) నీకు చెప్పెదను. ఏలయనగా - నాయొక్క విభూతి విస్తారమునకు అంతములేదు. 


వ్యాఖ్య:- భగవానుడు అనంతుడు. కాబట్టి వారి విభూతియు అనంతమైనదియే యగును. కాబట్టి ముఖ్యములైన విభూతులను మాత్రమే వర్ణించిచెప్పుటకు భగవానుడు పూనుకొనుచున్నాడు.

కామెంట్‌లు లేవు: