26, నవంబర్ 2024, మంగళవారం

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము*


*207 వ రోజు*


*నహుషుడు శచీదేవిని కోరుట*


నహుషుడు ఇంద్రుని భార్య శచీదేవిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను మోహించాడు. అతడు దేవతలను పిలిచి " నేను స్వర్గాధి పతిని అందరూ నన్ను చూడటానికి వచ్చారు. కాని శచీ దేవి మాత్రం నా వద్దకు రాలేదు. వెంటనే ఆ సుందరాంగి శచీదేవిని ఇక్కడకు పిలిపించండి " అని ఆజ్ఞాపించాడు. అది విని శచీదేవి భయపడి దేవ గురువు బృహస్పతిని శరణు వేడింది. జరిగినదంతా విన్న బృహస్పతి " అమ్మా! శచీదేవి ఊరడిల్లుము. నీభర్త తిరిగి రాగలడు. నేను నిన్ను కాపాడతాను " అన్నాడు. ఇది తెలిసిన నహుషుడు " నేను కోరిన వనితకు బృహస్పతి రక్షణ కల్పిస్తాడా? " అని ఆగ్రహించగా దేవతలు " దేవేంద్ర పదవిలో ఉన్న మీరు పరస్త్రీలను కోరుట తగదు " అని నచ్చ చెప్పారు. అందుకు నహుషుడు నవ్వి " ఇంద్రుడు గౌతముని భార్యను కామించినప్పుడు ఈ బుద్ధులు మీరెందుకు చెప్ప లేదు? మీరు వెంటనే శచీదేవిని నా వద్దకు తీసుకు రండి " అన్నాడు. దేవతలు మునులతో బృహస్పతి వద్దకు పోయి " గురుదేవా! ఇంద్రపదవిలో ఉన్న నహుషుడు శచీదేవిని కోరడానికి అర్హుడు. కనుక శచీదేవిని అతని వద్దకు పంపి అతని కోపం పోగొట్టండి " అని ప్రార్ధించారు. బృహస్పతి నవ్వి " నహుషుడు శచీదేవిని కోరడమా? అందుకు మీరు అంగీకరించడమా? ఇది లోక హితమా? ఇంతటి మహా కార్యాన్ని ఆచరించ వలసినదే కాని శరణు వేడిన వారిని విడుచుట ధర్మం కాదు కనుక నేను ఆమెను పంపను " అన్నాడు. మునులు " అయితే తగిన కర్తవ్యం ఆలోచించండి " అని అర్ధించారు. బృహస్పతి " ఒక పని చేద్దాము శచీదేవి నహుషుని వద్దకు వెళ్ళి కొంత సమయం అడుగుతుంది. ఆ తరువాత జరగ వలసినది ఆలోచిస్తాము " అన్నాడు. బృహస్పతి ఆదేశానుసారం శచీదేవి నహుషుని వద్దకు వెళ్ళింది " నేను ఇంద్ర పత్నిని ఇంద్రుడు ఉన్నాడో లేదో తెలియలేదు. నా మనసు శంకిస్తుంది ఏవిషయం తెలియకుండా తొందర పడకూడదు. నాకు కొంత సమయం కావాలి " అన్నది. నహుషుడు అందుకు అంగీకరించాడు. మునులు రహస్యంగా విష్ణుమూర్తిని కలుసుకుని ఇంద్రుని పాపం పోగొట్టమని అడిగారు.


*శచీదేవి ఇంద్రుని వద్దకు పోవుట*


విష్ణుమూర్తి " ఇంద్రునిచేత అశ్వమేధయాగం చేయించండి అతని పాపం పోతుంది " అన్నాడు. మునులు అలాగే ఇంద్రునిచేత అశ్వమేధయాగం చేయించారు. ఇంద్రుని పాపం పరిహారం కాగానే అమరావతికి వెళ్ళాడు. అక్కడ నహుషుడు అమిత తేజోమయుడై ఉండటం చూసి భయపడి ఎవ్వరికీ చెప్పకనే వెళ్ళి పోయాడు. ఇంద్రుని జాడ తెలియని శచీదేవి కలత పడి ఉపశ్రుతి అనే దేవతను ఆరాధించి ఆమెను సాక్షాత్కరింప చేసుకుంది. ఉపశ్రుతి " అమ్మా శచీదేవి! నేను నీ పాతివ్రత్యానికి మెచ్చి వచ్చాను. నీవు నా వెంట వచ్చిన ఎడల నీ భర్తను చూడగలవు " అని ఉపశ్రుతి శచీదేవిని హిమాలయాలకు ఉత్తర దిక్కున ఉన్న మంజుమంతము అనే పర్వతము వద్దకు తీసుకు వెళ్ళింది. అక్కడ ఉన్న సరోవరంలో ప్రవేశించారు. ఆ తరువాత ఒక తామరపుష్ప కాడలో ప్రవేసించారు. అక్కడ సూక్ష్మరూపంలో ఉన్న ఇంద్రుని చూపి ఉపశ్రుతి " అమ్మా! నీ భర్త ఇక్కడ ఉన్నాడు చూడు " అని చెప్పి ఉపశ్రుతి అదృశ్యమైంది. ఇంద్రుడు ఆశ్చర్యపడి " నేను ఇక్కడ ఉన్నది నీకెలా తెలుసు " అని శచీదేవిని అడిగాడు. శచీదేవి జరిగినది అంతా చెప్పి " నాధా! నీవు నహుషుని చంపి నన్ను రక్షించాలి " అని వేడుకుంది. ఇంద్రుడు " దేవీ ! నహుషుడు ఇప్పుడు నా కంటే బలవంతుడు. దేవతలు ఋషులు అతనికి తమ శక్తులు ప్రసాదించారు. కనుక అతను అజేయుడు. శత్రు శక్తి సంపన్నుడై ఉన్నప్పుడు వేచి ఉండటం రాజనీతి. అతనికి నీ మీద మోహం కలిగింది మనం దానిని అనుకూలంగా మార్చుకోవాలి. నీవు అతనితో సఖ్యం నటించి " నీవు నన్నుపొందాలంటే సప్తఋషి వాహనంపై రమ్మని చెప్పు దానితో అతని పుణ్యం క్షీణించి పతనం కాక తప్పదు. ఆ పై నేను అతనిని జయించడం సులువు " అన్నాడు. అందుకు అంగీకారం చెప్పి శచీదేవి అమరావతికి తిరిగి వచ్చింది. నహుషుడు మరలా శచీదేవి వద్దకు వచ్చి తన కోరిక తీర్చమని అడిగాడు.శచీదేవి " మహేంద్రా! నేను పెట్టిన గడువు ఇంకా మిగిలి ఉంది. ఆ గడువు తీరగానే నీవు సప్తఋషి వాహనం మీద వస్తే నేను నిన్ను వరించగలను " అని చెప్పింది. మోహావేశంలో ఉన్న నహుషుడు ఉచితానుచితాలు మరచి మునులను వాహనంగా చేసుకుని తిరగసాగారు. శచీదేవి " బృహస్పతి వద్దకు పోయి నన్ను నా నాధుని రక్షించండి " అని అడిగింది. బృహస్పతి " శచీదేవీ! చింతించ పని లేదు నహుషుడు ఋషి వాహనంతో శక్తిని కోల్పోతాడు " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: