అష్టమ స్కంధము - మూడవ అధ్యాయము
గజేంద్రుడు భగవంతుని స్తుతించుట - ఆ ప్రభువు అతనిని రక్షించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
3.18 (పదునెనిమిదవ శ్లోకము)
ఆత్మాత్మజాప్తగృహవిత్తజనేషు సక్తైర్దుష్ప్రాపణాయ గుణసంగవివర్జితాయ|
ముక్తాత్మభిః స్వహృదయే పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ॥6409॥
దేహము, దారాపుత్రులు, బంధుమిత్రులు, గృహము, సంపదలు, స్వజనులు మొదలగు వారియందు ఆసక్తిగలవారు నిన్ను పొందుట అసాధ్యము. ఏలయన, నీవు స్వయముగా గుణాతీతుడవు. జీవన్ముక్తులు తమ హృదయములయందు నిరంతరము నిన్నే ధ్యానించుచుందురు. సర్వైశ్వర్య పూర్ణుడవు, జ్ఞానస్వరూపుడవైన నీకు ప్రణామములు.
3.19 (పందొమ్మిదవ శ్లోకము)
యం ధర్మకామార్థవిముక్తికామాః భజంత ఇష్టాం గతిమాప్నువంతి|
కిం త్వాశిషో రాత్యపి దేహమవ్యయం కరోతు మేఽదభ్రదయో విమోక్షణమ్॥6410॥
ధర్మార్థకామమోక్షములను అభిలషించువారు ఆ పరమాత్మను సేవించి, తమ అభీష్ట వస్తువులను పొండుచుందురు. ఆ ప్రభువు వారికి అన్ని విధములుగా సుఖ, శాంతులను ప్రసాదించుచుండును. అంతేగాదు, వారికి శాశ్వతమైన పార్షదదేహమును గూడ అనుగ్రహించుచుండును. పరమ దయాళువైన ఆ స్వామి నన్ను ఉద్ధరించుగాక!
3.20 (ఇరువదియవ శ్లోకము)
ఏకాంతినో యస్య న కంచనార్థం వాంఛంతి యే వై భగవత్ప్రపన్నాః|
అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనందసముద్రమగ్నాః॥6411॥
అనన్య భక్తులు ఆ ప్రభువునకు ప్రసన్నులై, ఆయన నుండి ఏమియును అపేక్షింపరు. వారు కడకు మోక్షమునుగూడ కోరరు. కేవలము ఆ ప్రభువుయొక్క దివ్యమైన, శుభప్రదమైన లీలలను గానము చేయుచు ఆనంద సముద్రమునందు ఓలలాడుచుందురు.
3.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
తమక్షరం బ్రహ్మ పరం పరేశమవ్యక్తమాధ్యాత్మికయోగగమ్యమ్|
అతీంద్రియం సూక్ష్మమివాతిదూరమనంతమాద్యం పరిపూర్ణమీడే॥6412॥
ఆ పరమాత్మ శాశ్వతుడు, సర్వశక్తిమంతుడు, అవ్యక్తుడు, ఇంద్రియాతీతుడు. అత్యంత సూక్ష్మస్వరూపుడు. అందరికిని సమీపముననే యున్నను, అతి దూరముగా ఉన్నట్లు అనిపించును. ఆయన ఆధ్యాత్మిక యోగము ద్వారా అనగా జ్ఞానయోగ, భక్తియోగముల ద్వారా ప్రాప్తించును. ఆది పురుషుడు అనంతుడు, పరిపూర్ణుడు ఐన ఆ పరబ్రహ్మమును స్తుతించుచున్నాను.
3.22 (ఇరువది రెండవ శ్లోకము)
యస్య బ్రహ్మాదయో దేవా వేదా లోకాశ్చరాచరాః|
నామరూపవిభేదేన ఫల్గ్వ్యా చ కలయా కృతాః॥6413॥
ఆ భగవంతుని యొక్క అతి సూక్ష్మమైన అంశము నుండియే పెక్కు నామరూపములు, భేదభావములు గల బ్రహ్మాది దేవతలు, వేదములు, చరాచర లోకములు సృష్టింపబడినవి. ఆ అల్పాంశమే ఈ సర్వమూ రూపుగొని ప్రకటమైనదని భావము.
3.23 (ఇరువది మూడవ శ్లోకము)
యథార్చిషోఽగ్నేః సవితుర్గభస్తయో నిర్యాంతి సంయాంత్యసకృత్స్వరోచిషః|
తథా యతోఽయం గుణసంప్రవాహో బుద్ధిర్మనః ఖాని శరీరసర్గాః॥6414॥
ప్రజ్వలించుచున్న అగ్ని జ్వాలలు, ప్రకాశించుచున్న సూర్యకిరణములు పదే పదే బహిర్గతమై, తిరిగి అందే (సూర్యాగ్నులయందు) లీనమగుచున్నవి. అట్లే స్వయం ప్రకాశుడైన పరమాత్మ నుండియే గుణ ప్రవాహ రూపములైన శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి పదే పదే ప్రకటితమగుచుండును. మరల ఆయనలోనే లీనమగుచుండును.
3.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
స వై న దేవాసురమర్త్యతిర్యఙ్న స్త్రీ న షంఢో న పుమాన్న జంతుః|
నాయం గుణః కర్మ న సన్న చాసన్నిషేధశేషో జయతాదశేషః॥6415॥
భగవానుడనగా దేవతగాని, రాక్షసుడుగాని కాదు. మానవుడుగాని, పశువుగాని, పక్షిగాని కాదు. అట్లే స్త్రీగాని, పురుషుడుగాని, నపుంసకుడుగానీ కాదు. ఆయన ఒక సాధారణ లేదా అసాధారణ ప్రాణి (జంతువు) మాత్రము కూడా కాదు. సత్త్వరజస్తమో గుణములలో ఒక గుణము గాని, క్రియ (కర్మ) గాని, కార్యముగాని, కారణముగాని కాదు. ఇదికాదు- ఇదికాదు అని సర్వమునూ నిషేధించగా మిగలేది. అంతేగాక! ఈ సర్వమునూ తనయందే కలిగియున్నది అగు (చైతన్య) తత్త్వమే ఈశ్వరుడు. అట్టి పరమాత్ముడు నన్ను ఉద్ధరించుటకు ప్రకటమగుగాక!
పోతనామాత్యులవారి పద్యము
కంద పద్యము
కలఁ డందురు దీనుల యెడఁ
గలఁ డందురు పరమయోగి గణముల పాలం
గలఁ డందు రన్నిదిశలను
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?
తాత్పర్యము
దేవుడు ఆర్తు లైన వారి వెంట ఉంటాడు అని అంటారు. ఉత్తము లైన యోగుల చెంత ఉంటా డని అంటారు. అన్ని దిక్కుల లోను ఉంటా డంటారు. “ఉన్నాడు ఉన్నాడు” అనే ఆ దేవుడు మరి ఉన్నాడో! లేడో!
3.25 (ఇరువది ఐదవ శ్లోకము)
జిజీవిషే నాహమిహాముయా కిమంతర్బహిశ్చావృతయేభయోన్యా|
ఇచ్ఛామి కాలేన న యస్య విప్లవస్తస్యాత్మలోకావరణస్య మోక్షమ్॥6416॥
ఈ ఏనుగు దేహము బయట, లోపల, అన్ని వైపుల అజ్ఞానము అను ఆవరణముచే కప్పబడియున్నది. దీని వలన ప్రయోజనము శూన్యము. ఆత్మ ప్రకాశమును కప్పివేయునట్టి ఈ అజ్ఞానమను ఆవరణమునుండి బయటపడగోరుచున్నాను. ఇదీ కాలక్రమమున తనంతట తానుగా వదలిపోదు. కేవలము భగవత్కృప, లేక తత్త్వ జ్ఞానము ద్వారానే ఈ అజ్ఞానావరణము తొలగిపోవును.
3.26 (ఇరువది ఆరవ శ్లోకము)
సోఽహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసమ్|
విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోఽస్మి పరం పదమ్॥6417॥
కనుక, నేను పరబ్రహ్మయైన ఆ పరమాత్మనే శరణు వేడెదను. ఆ ప్రభువు విశ్వరహితుడైనను విశ్వస్వరూపుడు మరియు విశ్వసృష్టి చేయువాడు. విశ్వమునకు అంతరాత్మయై విశ్వరూప సామాగ్రితో అతడు క్రీడించుచుండును. జన్మరహితుడు, పరమపదస్వరూపుడు ఐన ఆ భగవంతునకు నమస్కారములు.
పోతనామాత్యులవారి పద్యము
కంద పద్యము
విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
శాశ్వతు నజు బ్రహ్మప్రభు
నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్.
తాత్పర్యము
ప్రభువు లోకాన్ని సృష్టించేవాడు. లోకులు అందుకోలేని వాడు. లోకానికి అంతరాత్మ అయిన వాడు. లోకంలో బాగా తెలుసుకోదగిన వాడు లోకమే తానైన వాడు. లోకాతీతుడు. ఎల్లప్పుడు ఉండేవాడు. పుట్టుక లేనివాడు. బ్రహ్మదేవునికి అధి నాయకుడు. లోకాన్ని నడిపించేవాడు. పరమాత్మ. అట్టి ఆది పురుషుని నేను ఆరాధిస్తాను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి