26, జులై 2020, ఆదివారం

అష్టాంగ యోగ

అహంకారాదులను వదిలించుకోవడానికి పాతంజలి యోగ పద్ధతులలో అష్టాంగ యోగమని ఒక ఉపాయమున్నది. 

*అవి యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అని ఎనిమిది అంగాలు.* 

*మొదటి ఐదు విషయాసక్తిని నిగ్రహించడానికి, చివరి మూడు భగవంతునికి దగ్గరవడానికిని పనికి వస్తాయి.*

1. యమం : 
యమమనగా ఈ కనిపించే ప్రపంచాన్ని ఈశ్వరమయంగా చూస్తూ అన్ని వస్తువులు ఆయనవేననే భావం కలిగి ఉండి తనది అంటూ దేనిమీద హక్కు లేకుండడం, అవసరమైన వాటిని భగవంతునివిగా భావించి ఇవన్నీ ఆయనవే అని, ఆయనకు నివేదించి తిరిగి భక్తుడి అవసరానికి ప్రసాదించమని ఆయనను వేడుకొనడం చేయాలి. నైవేద్యం, ప్రసాదం అనే వాటి అర్థం అదే. అంతేగాని మన వస్తువులు భగవంతుని కివ్వడమనే భావన సరికాదు.

ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్‌
తేన త్యక్త్యేన భుంజీథా, మాగృథః కస్యస్విద్ధనమ్‌ ||

దీని అర్థం అంతా ఈశ్వరమయమని భావిస్తూ మనకు అవసరమైన వాటిని, ఆయనను అర్థించి అనుభవించు అని.

ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని మన తలపులలో, మాటలలో, చేతలలో మన వలన ఎవరికీ కీడు కలుగరాదు. ఇదే అహింస. అబద్ధమాడరాదు. ఇతరుల వస్తువులను, శ్రమను దోచుకొనరాదు. అవినీతి, అక్రమ చర్యలు మానాలి. పరస్త్రీని తల్లివలె భావించాలి. సకల జీవరాసుల యెడల దయ కలిగి ఉండాలి. ఎట్టి దాపరికం లేకుండా నిజాయితీగా ఉండాలి. ఎవరెంత రెచ్చగొట్టినా ఓర్పు నశించక, సత్వ గుణంలోనే ఉండాలి. భేద భావన, శత్రు భావన మనలో ప్రవేశించరాదు. అరిషడ్వర్గాన్ని జయించి స్థైర్యం, ధైర్యం, నిగ్రహం సాధించాలి. మితాహారం, హితాహారం భుజించడం.  జిహ్వ చాపల్యం పనికిరాదు. భక్తి సాధనలో ఏకాగ్రత కుదురుటకు మన లోపల, బయట శుచిగా ఉండాలి.

2. నియమం : 
నియమమనగా నిరంతరం భగవచ్చింతన చేయడం, ప్రాపంచిక విషయాలను ఇష్టంగా చూడక, తప్పదు కదా అని పట్టించుకోవడం. అయ్యప్ప దీక్ష ఉద్దేశ్యం అదే. మనలోని కల్మషాలను తొలగించాలనే దీక్షను చేపట్టాలి. దాని కొరకు కొన్ని సత్కార్యాలు ఆచరించాలి. భాగవతోత్తములను, ఆచార్యులను చేరి సత్సంగం చేయాలి. వారి ఆజ్ఞలను, సూచనలను పాటించాలి. స్వార్థం, అహంకారం మనలో వ్యక్తం కాకుండా చూచుకోవాలి. అదే తపస్సు. ప్రాప్తించిన దానితో సంతోషపడి తృప్తిగా ఉండాలి. ఎంత కష్టపడినా లభించకపోతే, దుఃఖపడరాదు.

భక్తి కోసం, జ్ఞానం కోసం చేసే సాధనలలో భగవంతుడున్నాడని విశ్వాస ముండాలి. ఆయనతో ఐక్యమవడమే లక్ష్యంగా చేసుకోవాలి. చాలామంది భగవంతుడున్నాడని నమ్ముతారు గాని, దైవేచ్ఛ ప్రకారం నడచుకోరు. అందువలన దైవం గురించి వివరమైన దృఢమైన అవగాహన ఉండాలి.

ధన, శ్రమ, అవయవ దానాల వంటి త్యాగబుద్ధి ఉండాలి. ఇందులో ‘‘నేను చేశాను’’ అనే అహంకారం తలెత్తరాదు. అందరిలోనూ భగవంతుడున్నాడనే భావనతో ‘నారాయణసేవ’గా చేయాలి.

భగవంతుని పూజించడం, జప, తప ధ్యానాలన్నీ నియమబద్దంగా, క్రమ శిక్షణతో దీక్షగా చేయాలి. కర్మకాండయందు అంతరార్థ మెరిగి చిత్తశుద్ద్ధితో చేయాలి.

చేయకూడని పనులు చేయరాదు. అట్టి ఆలోచన వచ్చినంతనే సిగ్గుపడి, పశ్చాత్తాపపడి, నిగ్రహించుకోవాలి. సత్యవ్రతం, అహింసా వ్రతం, బ్రహ్మచర్య వ్రతం, అపరిగ్రహ వ్రతం, మౌనవ్రతం వంటివి, ఉపవాసాలు వీలునుబట్టి, వాటి యొక్క అర్థం తెలిసి చేయాలి. ఇవన్నీ మనలను మనం క్రమశిక్షణలో పెట్టు కోవడానికి అవసరమౌతాయి. అంతేగాని ఈ పనులు నేరుగా భగవంతుని వద్దకు చేర్చవు.

3. ఆసనం : 
పూజాది కార్యక్రమాలకు ఒక స్థిరమైన చోటును ఏర్పరచుకొని భక్తి, ఏకాగ్రత కుదిరేటట్లు కదలకుండా కూర్చునే పద్ధతిని ఆసనమంటారు. పద్మాసనం, అర్థ పద్మాసనం, సుఖాసనం ఏది కుదిరితే అదే ఆసనం.

4. ప్రాణాయామం : 
భాగవతులు, గురువులు ఉపదేశించిన మంత్రాన్ని శ్వాసతో అనుసంధానం చేస్తూ జపిస్తే ఏకాగ్రత లభిస్తుంది. దాని వలన మనలో ఉన్న భగవంతుని వద్దకు చేరగలం.

5. ప్రత్యాహారం : 
భగవద్భావాన్ని మనయందు నింపుకొని, అహంకార మమకారాలకు కారణమైన ఇంద్రియ, మనోబుద్ధులను లోనికి ముడుచుకోవాలి. అనగా తాబేలు తన అవయవాలను ముడుచుకొన్నట్లు చేసి, బయటి విషయాలలోకి పోనీయకుండడం.

6. ధారణ : 
భగవంతుని హృదయం నిండా నింపుకోవడమే ధారణ. ఈ ధారణ మధ్య మధ్యలో మనసు విషయాలమీదికి పోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మళ్ళీ ధారణ చేస్తూ ఉంటాం.

7. ధ్యానం : 
ధారణ ఖండ ఖండాలుగా జరుగుతూ, చివరకు అఖండ ధారణ జరిగితే అంతవరకు చేసే ప్రయత్నాన్ని ధ్యానం అంటారు.

8. సమాధి : 
ధ్యానం అఖండ ధారణగా మారినప్పుడు కలిగేది సమాధి. సమాధిలో దైవ సాక్షాత్కారమవుతుంది.

ఈ ఎనిమిదింటిలో యమ నియమాలు పునాది వంటివి. ఆసన, ప్రాణాయామాలు ఉపకరాణాలు. ప్రత్యాహార, ధారణ, ధ్యానాలు సాధనా మార్గాలు. పర్యవసానంగా కలిగే సమాధి ఫలరూపమైన పరాభక్తి అనబడుతుంది.

ఈ విధంగా జ్ఞాన, యోగ పద్ధతులలో కూడా భక్తుడు తనను తాను సంస్కరించుకొని సంసిద్ధుడవవచ్చును. అన్ని మార్గాలు ఉపయోగ పడేవే. ఏదో ఒక పద్ధతిలో యోగ్యత సంపాదించి, భగవదనుగ్రహం పొందే ప్రయత్నం భక్తులే చేసుకోవాలి. అంతేగాని, ఆయనను నిందించడం అవివేకం.

కామెంట్‌లు లేవు: