26, జులై 2020, ఆదివారం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - మూడవ అధ్యాయము*

*గజేంద్రుడు భగవంతుని స్తుతించుట - ఆ ప్రభువు అతనిని రక్షించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*3.12 (పండ్రెండవ శ్లోకము)*

*నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే|*

*నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ॥6403॥*

ఆ దేవదేవుడు సత్త్వ, రజ, స్తమో గుణముల ధర్మములను స్వీకరించి, క్రమముగా, శాంతస్వరూపుడుగను, ఘోరుడుగను, మూఢుడుగను భాసించును. ఐనను, భేదరహితుడై, సమభావముతో నున్న ఆ జ్ఞానస్వరూపునకు నేను పదేపదే ప్రణమిల్లుచున్నాను.

*3.13 (పదమూడవ శ్లోకము)*

*క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే|*

*పురుషాయాత్మమూలాయ మూలప్రకృతయే నమః॥6404॥*

సర్వమునకు అధ్యక్షుడు, సర్వాధీశ్వరుడు అగు పరమేశ్వరుడే దేహేంద్రియ మనస్సంఘాతములు అన్నింటియందు చైతన్యస్వరూపుడై   సర్వసాక్షిగా వెలుగొందుచున్నాడు. ఆయన తనకు తానే కారణమైనట్టి సర్వకారణుడు. పూర్ణపురుషుడగు ఆ పరమేశ్వరుడు మూలప్రకృతి (మాయాశక్తి) కి అధిష్ఠానమై యున్నాడు. అట్టి పరమప్రభువునకు అనేకానేక నమస్కారములు.

*3.14 (పదునాలుగవ శ్లోకము)*

*సర్వేంద్రియగుణద్రష్ట్రే సర్వప్రత్యయహేతవే|*

*అసతాచ్ఛాయయోక్తాయ సదాభాసాయ తే నమః॥6405॥*

నీవు సకల ప్రాణుల ఇంద్రియములకు, వాటి విషయములకు ద్రష్టవు. సమస్త ప్రాణుల జ్ఞానమునకు నీవే ఆధారము. ఈ విశ్వమునందలి అసద్వస్తువుల నిరాకరణముద్వారా  నీ సత్తాస్వరూపము కనుగొనబడును. సమస్త వస్తువుల సత్తా రూపముల యందు గూడ కేవలము నీవే భాసిల్లుచుందువు. అట్టి నీకు నమస్కారము.

*3.15 (పదునైదవ శ్లోకము)*

*నమో నమస్తేఽఖిలకారణాయ  నిష్కారణాయాద్భుతకారణాయ|*

*సర్వాగమామ్నాయమహార్ణవాయ నమోఽపవర్గాయ పరాయణాయ॥6406॥*

సర్వమునకు మూలకారణమైన నీకు వేరొకకారణము లేదు. మూల కారణము ఐనప్పటికినీ అనగా సర్వము నీ నుండియే ఉద్భవించినా, సర్వము నీ యందు వాస్తవముగా లేదు. అట్టి అద్భుతమగు ఆశ్చర్యమును గొలిపెడి జగత్కారణుడవు నీవు. సమస్త నదీనదములు సముద్రమునందు కలిసిపోయినట్టుగా సకలములైన శాస్త్రములు, వేదములు నీయందే పర్యవసానము నొందుచున్నవి. నీవే మోక్షస్వరూపుడవు. సమస్త సాధకులు పొందెడు సర్వాశ్రయమైనట్టి సర్వోత్తమమైన గతివి నీవే. అట్టి నీకు అనేక నమస్కారములు.

*3.16 (పదునారవ శ్లోకము)*

*గుణారణిచ్ఛన్నచిదూష్మపాయ తత్క్షోభవిస్ఫూర్జితమానసాయ |*

*నైష్కర్మ్యభావేన వివర్జితాగమస్వయంప్రకాశాయ నమస్కరోమి॥6467॥*

నిప్ఫును అరణి (అగ్నికొరకు మధించెడు కొయ్య) దాచిపెట్టినట్లుగా, సత్ప్వము, రజస్సు, తమస్సు అనెడు త్రివిధగుణముల కార్యమగు దేహాదికము, జ్ఞానఘనమగునట్టి ఆత్మను కప్పివేయును. సృష్ట్యాదిలో ఆ త్రివిధగుణములయందు క్షోభను కలిగించి తద్ద్వారా జగద్రూపముగా ప్రకటము కావలెననెడు సంకల్పము భగవానునియందు కలిగెను. సకల కర్మల సంగము లేనివాడైనట్టి నిష్కాములై ఆత్మతత్ప్వమునందు నిష్ఠగా నిలిచియున్నవారై, విధినిషేధముల పరిధిని పూర్తిగా దాటిపోయిన మహాత్ములయందు ఆ భగవానుడు ఆత్మస్వరూపుడుగా సాక్షాత్కరించును. అట్టి భగవానునకు నేను నమస్కరించుచున్నాను.

*3.17 (పదునేడవ శ్లోకము)*

*మాదృక్ ప్రపన్నపశుపాశవిమోక్షణాయ  ముక్తాయ భూరికరుణాయ నమోఽలయాయ|*

*స్వాంశేన సర్వతనుభృన్మనసి ప్రతీతప్రత్యగ్దృశే  భగవతే బృహతే నమస్తే॥6408॥*

నేను నీ శరణుగోరినవాడను. బంధింపబడిన పశువు యొక్క బంధములను ఛేదించునట్లు నీవు నావంటి శరణాగతుల సంసార బంధములను ఛేదించెడు దయామూర్తివి. నీవు నిత్య ముక్తుడవు. పరమ కరుణామయుడవు. భక్తులకు శుభములను చేకూర్చుటలో నీవు ఎన్నడును ఆలస్యము చేయువు. సకలప్రాణుల హృదయములలో అంశగానుండి, అంతరాత్మ రూపమున వెలుగొందుచుందువు. నీవు షడ్గుణైశ్వర్య సంపన్నుడవు. అనంతుడవు. నీకు నమస్కారములు.

*పోతనామాత్యులవారి పద్యములు*

8-78-సీస పద్యము

భవము దోషంబు రూపంబుఁ గర్మంబు నా;
హ్వయమును గుణము లెవ్వనికి లేక
జగములఁ గలిగించు సమయించు కొఱకునై;
నిజమాయ నెవ్వఁ డిన్నియునుఁ దాల్చు
నా పరేశునకు ననంతశక్తికి బ్రహ్మ;
కిద్ధరూపికి రూపహీనునకునుఁ
జిత్రచారునికి సాక్షికి నాత్మరుచికినిఁ;
బరమాత్మునకుఁ బరబ్రహ్మమునకు

*8-78. ఆటవెలది*

మాటలను నెఱుకల మనములఁ జేరంగఁ
గాని శుచికి సత్త్వగమ్యుఁ డగుచు
నిపుణుఁ డైనవాని నిష్కర్మతకు మెచ్చు
వాని కే నొనర్తు వందనములు.

*తాత్పర్యము*

భగవంతుడికి పుట్టుక, పాపము, ఆకారం, కర్మలు, నామలు, గుణాలు లేవు. అతడు లోకాలను పుట్టించడానికి, నశింపజేయడానికి తన మాయా ప్రభవంతో ఇవన్నీ ధరిస్తాడు. అతడు పరమేశ్వరుడు, అంతులేని శక్తి కలవాడు, బ్రహ్మ, నిండైన రూపంగలవాడు, ఏ రూపంలేనివాడు, చిత్రమైన ప్రవర్తన కల వాడు, సర్వసాక్షి, ఆత్మప్రకాశమైన వాడు, పరమాత్మ, పరబ్రహ్మ, మాటలకు ఊహలకు అందని వాడు, పరిశుద్ధుడు, సత్వగుణంతో దరిజేర దగినవాడు మరియు నేర్పరులు చేసే ఫలాపేక్షలేని కర్మలను మెచ్చువాడు అయినట్టి ఆ దేవదేవునికి నేను నమస్కారాలు చేస్తాను.

*8-79- సీస పద్యము*

శాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి;
నిర్వాణ భర్తకు నిర్విశేషు
నకు; ఘోరునకు గూఢునకు గుణధర్మికి;
సౌమ్యున కధిక విజ్ఞాన మయున
కఖిలేంద్రియద్రష్ట కధ్యక్షునకు బహు;
క్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి
మూలప్రకృతి కాత్మ మూలున కఖిలేంద్రి;
య జ్ఞాపకునకు దుఃఖాంత కృతికి

*8-79.1-ఆటవెలది*

నెఱి నసత్య మనెడి నీడతో వెలుఁగుచు
నుండు నెక్కటికి మహోత్తరునకు
నిఖిల కారణునకు నిష్కారణునకు న
మస్కరింతు నన్ను మనుచు కొఱకు.

*తాత్పర్యము*

భగవంతుడు శాంతస్వరూపుడు. పరలోక సౌఖ్యప్రదాత. మోక్షానికి అధిపతి. నిర్విశేషుడు. దుష్టులకు భయంకరుడు. సంసారబద్దులకు అందనివాడు. సర్వ గుణ ధర్మాలు కలవాడు. సరళ స్వభావి. విశేషమైన ఙ్ఞానము కలవాడు. సర్వేంద్రియాల కార్యాలను చూసేవాడు. సమస్తానికి ప్రభువు. బహు క్షేత్రఙ్ఞుడు. దయారసానికి సముద్రం వంటివాడు. సర్వానికి ఆది మూల పురుషుడు. ఆత్మకు ఆధారమైనవాడు. సకల ఇంద్రియాలకు నియామకుడు. దుఃఖాన్ని తొలగించేవాడు. మాయ అనే నీడతో ప్రకాశించే బహు నేర్పరి. మిక్కిలి గొప్పవాడు. సమస్తానికి ఆది బీజం అయినవాడు. తనకి మూల కారణం ఏది లేనివాడు. అట్టి ఆ దేవ దేవునికి నన్ను కాపాడమంటు నమస్కరిస్తున్నాను.

*8-80 కంద పద్యము*

యోగాగ్ని దగ్ధకర్ములు
యోగీశ్వరు లే మహాత్ము నొం డెఱుఁగక స
ద్యోగ విభాసిత మనముల
బాగుగ వీక్షింతు రట్టి పరము భజింతున్.

*తాత్పర్యము*

యోగీంద్రులు యోగం అనే అగ్నితో తమ సర్వ పూర్వ కర్మలను కాల్చివేసి. ఇతరమైనది మరేది తలచకుండ ప్రకాశించే తమ మనసులలో ఆ దేవదేవుని చూస్తు ఉంటారు. అట్టి ఆ మహానుభావుడిని నేను సేవిస్తాను.

*8-81-సీ.సీస పద్యము*

సర్వాగమామ్నాయ జలధికి నపవర్గ;
మయునికి నుత్తమ మందిరునకు
సకలగుణారణిచ్ఛన్న బోధాగ్నికిఁ;
దనయంత రాజిల్లు ధన్యమతికి
గుణలయోద్దీపిత గురు మానసునకు సం;
వర్తితకర్మనిర్వర్తితునకు
దిశ లేని నా బోఁటి పశువుల పాపంబు;
లడఁచువానికి సమస్తాంతరాత్ముఁ

*8-81.1-ఆటవెలది*

డై వెలుంగువాని కచ్ఛిన్నునకు భగ
వంతునకుఁ దనూజ పశు నివేశ
దారసక్తు లయినవారి కందఁగరాని
వాని కాచరింతు వందనములు.

*తాత్పర్యము*

పరమేశ్వరుడు సమస్త ఆగమాలు వేదాలు అనే నదులకు సంగమరూపమైన సముద్రము వంటివాడు. మోక్షస్వరూపుడు. గొప్ప గుణాలకు నిలయమైన వాడు. ఆరణి కొయ్యలలోని అగ్నివలె సుగుణాలలో దాగి ఉండేవాడు. స్వయం ప్రకాశకుడు. గొప్ప మనస్సు కలవాడు. ప్రళయాన్ని సృష్టిని నడిపేవాడు. నాలాంటి ఏ దిక్కులేని జీవుల పాపాలను శమింపజేసేవాడు. సర్వులలోను ఆత్మయై వెలగువాడు. నాశనం లేనివాడు. పూజింప దగినవాడు. భార్యా పుత్రులు ఇల్లు పశువులు వంటి వాటి యందు ఆసక్తి కలవారికి అందరానివాడు. అటువంటి ప్రభువునకు నమస్కారాలు చేస్తాను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

కామెంట్‌లు లేవు: