అది కైలాసం.. పరమ శివుడు, ఆదిశక్తి ముచ్చట్లాడుకొంటున్నారు. ప్రకృతిమాత పార్వతీ దేవి భర్తతో అంటోంది.. "భూలోకంలో సమస్యలు చాలా తీవ్రరూపం దాల్చుతున్నాయి." అదేంటి? అడిగాడు పరమ శివుడు." మానవులకు తాగుడు ఎక్కువైపోయింది..పీకల దాకా తాగి ఇష్టానుసారం చెలరేగుతున్నారు.. కుటుంబాలను కాల్చుకు తింటున్నారు..పెళ్లాం పిల్లల్ని రోడ్డున పడేస్తున్నారు.. అదేమంటే చంపేస్తున్నారు.. ఎటు చూసినా..భరించలేని వాయుకాలుష్యం..అమ్మో.. ఈసారి చవితికి గణేశుని భూమికి పంపండం నాకు సుతరామూ ఇష్టం లేదు పెదవి విరిచింది పార్వతి.. అంతేకాదు.. ముంబైలో ఊపిరి ఆడటం లేదు.. ఒకసారి గాలి పీలిస్తే 100 సిగరెట్లు కాల్చినట్టు లెక్క అంటున్నారు నిపుణులు.. ప్రాణవాయువునందించే చెట్లను నరికి పారేస్తున్నారు..
అడ్డూ అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు.. శిశుపాలుడికైనా నూరు తప్పులుసరిపోయాయేమో.. ఈ మానవులు మాత్రం దానికి వంద రెట్లు దాటేశారు.. ఎప్పుడో నా చేతిలో శిక్ష అనుభవిస్తారు.. పార్వతీ మాత కళ్లు ఆగ్రహంతో ఎరుపెక్కాయి..
ఆది దంపతులిలా ముచ్చటించుకుంటున్నారో లేదో అంతలోనే భూలోకంలో ప్రళయం వచ్చేసింది..
ముల్లోకాలూ కంపించి పోయాయి.. భూకంపానికి భూమి నెగళ్లు వారింది. అదేంటి? ఎందుకిలా ? దివ్యదృష్టితో చూసింది ప్రకృతిమాత. భూలోకంలో సూక్ష్మాతి సూక్ష్మమైన ఓ వైరస్ ఒంటికాలిపై ఘోర తపస్సు చేయడం కనిపించింది.
అంతే ఆదిశక్తి ఇక ఆగలేకపోయింది.. తనను అంతలా శరణు వేడుతున్న ఆ వైరస్ కు వచ్చిన బాధేంటి? అనుకుంటూ కైలాసంలో అంతర్ధానమై సరాసరి వైరస్ ఎదుట ప్రత్యక్షమైంది.
"ఓ అల్ప జీవీ ఎందుకీ తపస్సు ?" అడిగింది మాత..
"ఏమిచెప్పను? మాతా నన్ను భూమండలంలో బతకనివ్వడం లేదు.. అందరిలాగా నాకూ భూమిపై బతికే హక్కు లేదా? 1977 లో మశూచి నిర్మూలనా కార్యక్రమం కింద నన్ను భూమినుంచి వెళ్లగొట్టారు. భూమండలంలో నాకు స్తానం లేకుండా చేసారు. నేను అల్పజీవిని బడుగు వర్గానికి చెందిన దానిని... అందరినీ చల్లాగా చూసే జగన్మాతవు.. మాతా నీయేలుబడిలోనే నాకే అన్యాయం జరిగింది " బాధగా మూల్గింది వైరస్.. "నేను విన్నాను నేను వున్నాను . నీవేమీ భయపడకు. నేనసలే బడుగు వర్గ పక్షపాతిని... నీకు వరం ఇస్తా కోరుకో "అంది మాత .."నాకు వరం వద్దు. దానిలో ఎదో ఒక లొసుగుంటుంది. గతంలో బ్రహ్మ హిరణ్యకశిపునికిచ్చిన వరంలో లొసుగువల్లే నరసింహావతారంతో హిరణ్యకశిపుడు చంపబడ్డాడు." అంది వైరస్. భూమండలంపై నాకూ కోపంగానే ఉంది.. అన్ని హంగులూ కల్పించి బతకమని మానవులను వదిలితే.. ప్రకృతి మాతనైన నా నెత్తినే చెయ్యి పెట్టేలా తయారయ్యారు.సుందర ప్రకృతి దృశ్యాలతో రమణీయంగా ఉండాల్సిన భూమండలం సర్వనాశనమైపోయింది.. ఇప్పుడిక తప్పులు దిద్దుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.. అందుకే నేనే నీరూపంలో ప్రవేశించి సంస్కరిస్తా.. నీలో ప్రవేశించి కరోనా రూపంలో కఠిన శిక్ష వేస్తాను.. ప్రపంచాన్ని సంస్కరిస్తాను ఒకింత ఆవేశంతో అన్నది ఆదిశక్తి..
ధన్యు రాలను తల్లీ.. ఐతే నాకు కొన్ని సందేహాలున్నాయి. భూమండలంలో జనం తెలివి మీరిపోయారు.. హ్యాండ్ వాష్ వాడుతున్నారు.. షేక్ హాండ్స్ మానేశారు.. ముఖానికి మాస్క్ కూడా ధరిస్తున్నారు.. వ్యక్తిగత దూరం పాటిస్తున్నారు.. పదే పదే చేతులు కడిగేసుకుంటున్నారు.. శానిటైజర్లు తెగ వాడేస్తున్నారు.. మూల మూలలా రసాయనాలుస్ర్పే చేసి నా ఉనికన్నది లేకుండా తరిమేస్తున్నారు.. ప్రభుత్వమేమో లాక్ డౌన్ ప్రకటించేసిది. శాస్త్రజ్ఞులు వాక్సిన్లు కనిపెట్టేస్తున్నారు. ఫార్మసీలు వ్యాక్సిన్, టీకా అంటూ నానా హంగామా చేసేస్తున్నాయి. జనం లైఫ్ స్టైల్ మార్చేశారు.. యోగా అంటూ ఉదయానే వ్యాయామాలు చేసేస్తున్నారు.. మంచి పోషకాహారం తినేస్తున్నారు..నేను ప్రవేశించే అవకాశం లేకుండా అన్ని చర్యలూ తీసేసుకుంటున్నారు. కుటుంబ స్థాయిలో, రాష్ట్రా స్థాయిలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అనేక వ్యూహాలు పన్నేసారు. ఇలాంటి టైమ్ లో మన ప్రయత్నం ఎలా ఫలిస్తుంది తల్లీ.. ? చాలా ఆతృతగా అడిగింది వైరస్.
అందుకు మాత మందస్మిత ముఖారవిందంలో వైరస్ తో ఇలా అంది.. నిన్ను విశ్వద్విగ్మండల వ్యాపి గానూ, బహుముఖ టెంటకిల్ సంజాత ధారిణిగానూ, 200 దేశంబులం దర్శించి, మొత్తం కోటిన్నర మంది మనుజుల సోకి లెక్కలేనంత మంది ప్రాణాలు దునిమిన శిక్షాన్వివై మనుజులం నీదాసానుదాసుండులం, ఏకాకులంజేసి ఏడ్పించెదవు. ఇహ పొతే నా సంస్కరణలు మొదలౌతాయి.అపరిశుభ్రత అడ్రస్ లేకుండా పోతుంది.. వాయుకాలుష్యం తగ్గి స్వచ్ఛమైన గాలి అందుతుంది. మద్య పానం మందగిస్తుంది.. రోడ్లపై ట్రాఫిక్ జాములు తగ్గుతాయి. గృహ నిర్బంధంవల్ల కుటుంబంలో వ్యక్తిగత సంబంధాలు పెరిగి కుటుంబవ్యవస్థ బలపడుతుంది. బయట ఆహరం తినకపోవడం ఇంటిఆహారాన్నే తినడంవల్ల ఆరోగ్యం మెరుగౌతుంది. మార్కెట్లు లేకపోవడంవల్ల అవసరంలేని వస్తువులను కొనకపోవటంవల్ల పొదుపు పెరిగింది. ఐతే నా సంస్కరణలు అమలు చేయడంలో చాలామంది మానవులు అనగా పారిశుధ్య పనివారు, పోలీసువారు, వైద్యులు ప్రాణాలకు తెగించి కష్ట పడ్డారు..వారికి నా ఆశీస్సులు"అంది ప్రకృతిమాత . "అవునుమాతా నా విజృంభణా వేగంలో అంతమంచివారిని నేను గుర్తించలేక పోయాను" అంది వైరస్ పశ్చాత్తాప పడుతూ.."అవును నిజమే కొందరు పీపీఈ కిట్లను ధరించినా డాక్టర్లు, కొందరు రాజకీయనాయకులు యంపీలు, యమ ఎల్ ఏలు మంత్రులు, సినీమా స్టార్లూ బలైపోయారు.వారికి మోక్ష ప్రాప్తిని ప్రసాదిస్తున్నాను. ఇక వాక్సినులు మందులు కనిపెట్టేస్తున్నారని బెంగపడకు.. వాళ్లు ఎంత కనిపెట్టినా అవేం పనిచేయవు.ఎందుకంటే నేను నీ డీఎన్ ఏ నిర్మాణాన్నే మార్చేస్తానుగా.. మానవులలో కొంతమంది మంచివారున్నట్లే కొంతమంది పాపులు, దుర్మార్గులు వుంటారు. అటువంటివారికి ఇమ్యూనిటీ ఉంటే, దానిని నాశనం చేస్తా. ఎట్లాగంటావా? రక్తంలోని న్యూట్రోఫిల్సు,కిల్లర్ డి సెల్స్ నిన్ను చంపేస్తాయి. దీనినే ఇమ్యూనిటీ అంటారు. ఆ న్యూట్రోఫిల్సు కిల్లర్ డి సెల్స్ ని గందరగోళంలోకి నెట్టేసేస్తా. అప్పుడు వైరస్ ఏదో శరీర కణమేదో గుర్తించలేక శరీర కణాలనే వైరస్ అనుకోని తన శరీర కణాలనే నాశనం చేస్తాయి. అంటే వాళ్ల వాళ్ల ఇమ్యూనిటీ పవర్ పైనే దాడి చేస్తానన్న మాట.. దీన్నే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు.. ఇది మానవుల వ్యూహానికి ప్రతివ్యూహం.
ఓయి నా భక్త వైరస్.. భూమండలంలో నీకు చోటేలేకుండా చేయాలని వారు వ్యూహం పన్నినా అంత సీనుండాదు.. ఇప్పటికే కోటిన్నర మందికి నీ దెబ్బ ఏంటో రుచి చూశారు.. నీస్థానం పటిష్టం అయిపోయింది. భూమిపై నా ప్రకృతి నాశనం అవుతుంటే సదరు ప్రకృతిని సంస్కరించాను." అని వివరంగా చెప్పింది ప్రకృతి మాత.. ఉరఫ్ ఆది పరాశక్తి.. .
మిత్రులారా దీనర్ధం మాస్కులు ధరించవద్దని , సోషల్ డిస్టెన్స్ పాటించవద్దని.. చేతులు కడుక్కోవద్దనీ కాదు. వీటితోపాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని దేవానుగ్రహం కూడా పొందండి.
-- వి.వి. రత్నాకరుడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి