ఓం నమో వేంకటేశాయ🙏
సహజ సుందర క్షేత్రాల్లో తిరుమల క్షేత్రం దివ్యమైంది. భవ్య మైంది మరియు నిత్యనూతన మైనది. ఈ పుణ్యాక్షేత్రాన్ని ప్రశంసిస్తూ బ్రహ్మాండ పురాణము ఇలా చెప్పింది.
వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన"
అంటే బ్రహ్మాండమంతా వెదకినా ఈ పుణ్యక్షేత్రం సాటియైన క్షేత్రం మరేదీ లేదు చెప్పింది. తిరుమల క్షేత్రం ఎన్నో పేర్లతో, అనేక శిఖరాలతో, వివిధ లోయలతో, తీర్థాలతో భూలోక వైకుంఠంగా వన్నె కెక్కింది.
సత్యం సత్యం పునస్సత్యం న దేవో వేంకటేశ్వరాత్ బ్రహ్మాండే నాస్తి యత్కించిత్ న భూతం న భవిష్యతి" -
శ్రీవేంకటాచల మాహాత్యం (భవిష్యోత్తరపురాణం) .
సత్యంగా చెబుతున్నమాట! ఒకమారు కాదు. రెండుమార్లు కాదు. పదే పదే చెబుతున్న సత్యమైన మాట! అంటే, శ్రీవేంకటేశ్వరునివంటి దేవుడు ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా లేదు. లేనేలేదు. ఇపుడు మాత్రమేకాదు. గడచిన భూతకాలంలోనూ, ఇటు రాబోయే భవిష్యత్కాలంలోను లేదు. లేనే లేదూ ఉండదు కూడా. అందువల్లే వెంకటేశ్వరస్వామి కలియుగ ప్రత్యక్షదైవంగా కీర్తింపబడ్డాడు.
"కృతేతు నరసింహాఽ..భూత్ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసూదేవ శ్చ కలౌ వేంకటనాయకః"
కృతయుగంలో నరసింహుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో వాసుదేవుడు (శ్రీకృష్ణుడు), కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడు ఈ నాలుగు అవతారాలు నాలుగు యుగాలు ప్రసిద్ధి పొందాయి.
వీటిల్లో మొదటి మూడు అవతారాలు, శ్రీమహావిష్ణువు దశావతారాల్లో చెప్పబడ్డవే .
విచిత్రం! ఏమంటే కలియుగంలో వేంకటేశ్వరుడు అవతారంగా ప్రత్యేకంగా పేర్కొని బడటం విలక్షణంగా ఉంది .
ఆయా యుగాల్లో ఆయా రక్కసులను సంహరించి ధర్మం నిలబెట్టడం కోసం వచ్చిన అవతారాలు మాత్రమే ఈ మూడు కూడా...
కాని శ్రీనివాసుని అవతారం అలా సంభవించలేదు.
శ్రీ వైకుంఠం నుంచి సాక్షాత్తుగా దిగివచ్చిన దివ్య మంగళ అర్చావతార మూర్తి శ్రీవేంకటేశ్వరుడు.
ఓం నమో వేంకటేశాయ 🙏.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి