4, అక్టోబర్ 2020, ఆదివారం

పోత‌న త‌ల‌పులో ...72

 


అర్జునుడి విచారానికి కార‌ణం క‌నుక్కుంటూనే ,ద్వారకలో అంద‌రూ క్షేమమే క‌దా... అని మ‌రీ మ‌రీ అడుగుతున్నాడు ధ‌ర్మ‌రాజు.


అన్నా! ఫల్గున! భక్తవత్సలుఁడు, బ్రహ్మణ్యుండు, గోవిందుఁ డా

పన్నానీకశరణ్యుఁ డీశుఁడు, జగద్భద్రానుసంధాయి, శ్రీ

మన్నవ్యాంబుజ పత్రనేత్రుఁడు, సుధర్మామధ్యపీఠంబునం

దున్నాఁడా బలభద్రుఁ గూడి సుఖియై యుత్సాహియై ద్వారకన్?

                       **

నాయనా! అర్జునా! భక్తుల యందు వాత్సల్యం కురిపించే వాడూ, బ్రహ్మణ్యుడూ, ఆపన్నశరణ్యుడూ, సర్వేశ్వరుడూ, లోకాలకు మేలు కలిగించేవాడూ, శోభవంతములై అప్పుడప్పుడే వికసిస్తున్న తామరరేకుల వంటి కన్నులు కలవాడూ అయిన గోవిందుడు ,ద్వారకలో సుధర్మ సభా మండపం మధ్యన సింహాసనం మీద అన్నగారైన బలరామునితో కూడి సుఖంగా ఉత్సాహంగా ఉన్నాడా. అని అడిగాడు.


 అర్జునిడి క‌ళ్ల‌లోకి సూటిగా చూసాడు.


 అత‌ని కంటిలో ఆగని క‌న్నీరు చూసి,ద్వారకలో జ‌ర‌గ‌రానిదేదో జ‌రిగింద‌ని గ్రహించాడు ధ‌ర్మ‌రాజు.


                        ***

మున్నుగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితోఁ బోరుచో,

సన్నాహంబునఁ గాలకేయుల ననిం జక్కాడుచోఁ, బ్రాభవ

స్కన్నుండై చను కౌరవేంద్రు పనికై గంధర్వులం దోలుచోఁ,

గన్నీరెన్నడుఁ దేవు తండ్రి! చెపుమా కల్యాణమే చక్రికిన్?

              **

 అర్జునా,“ఇదేమి టయ్యా? కళ్ళల్లో నీళ్ళు కారుతున్నాయి.


 పూర్వం భయంకరమైన ఆ అడవిలో పంది కోసం మూడు కళ్ళున్న ఆ పరమేశ్వరునితో పోరాడే టప్పుడు కాని, సర్వసన్నాహాలతో వెళ్ళి కాలకేయులను కదనరంగంలో చీల్చి చెండాడే టప్పుడు కాని, పరువు పోయి వైభవం కోల్పోయిన దుర్యోధనుని విడిపించే పనిలో గంధర్వులను తరిమే టప్పుడు కాని ఇంతకు ముందు ఎప్పుడూ కంట నీరు పెట్టి ఎరుగవు కదా. 

ఇప్పుడే మయిందయ్యా? కృష్ణుడు కులాసాగానే ఉన్నాడా? చెప్పు ...అంటూమ‌రింత ఆతృత‌తో అడిగాడు ద‌ర్మ‌రాజు.

***


        ఎవ‌రితో అయినా యుద్ధం చేసి అర్జునుడు ఓడియ‌పోయాడో, ఎక్ర‌డైనా ప‌రాభ‌వానికి గురై చింతిస్తున్నాడోన‌న్న‌ ఇంకో

అనుమానం ధ‌ర్మ‌రాజుకు క‌లిగింది. 

   ***

ఓడితివో శత్రువులకు,

నాడితివో సాధు దూషణాలాపములం;

గూడితివో పరసతులను,

వీడితివో మానధనము వీరుల నడుమన్

               **

పగవారితో పోరాడి ఓడిపోలేదు కదా? సజ్జనులను తూలనాడలేదు కదా? పరాంగనలను కూడలేదు కదా? అరివీరుల నడుమ అభిమానాన్ని వీడలేదు కదా?


తప్పితివో యిచ్చెదనని;

చెప్పితివో కపటసాక్షి; చేసిన మేలున్

దెప్పితివో; శరణార్థుల

రొప్పితివో ద్విజులఁ, బసుల, రోగుల, సతులన్;

          **

అన్నమాట తప్పలేదు కదా? దొంగసాక్ష్యం చెప్పలేదు కదా? ఇతరులకు మేలు చేసి తిరిగి చెప్పలేదు కదా? శరణార్థుల మీదా, బ్రాహ్మణుల మీదా, గోవుల మీదా, రోగులమీదా, స్ర్తీల మీదా పొరపాటున బాణాలు గుప్పలేదు కదా?

**


అడిచితివో భూసురులనుఁ;

గుడిచితివో బాలవృద్ధగురువులు వెలిగా;

విడిచితివో యాశ్రితులను;

ముడిచితివో పరుల విత్తములు లోభమునన్;"


ఆరాధ్యులైన భూసురులను అణచివేసావా? లేకపోతే బాలురకు వృద్ధులకు గురువులకు పెట్టకుండా తిన్నావా? శరణని చేరిన వారిని కాపాడకుండా వదలిపెట్టావా? పోనీ పరుల ధనాలను లోభం కొద్దీ వాడు కున్నావా? 

తప్పు చేసినవాడు బాధపడాలి కాని,

 నీ కెందుకయ్యా యీ విచారం?"

అని అంటున్నాడు ధర్మరాజు అర్జునుడితో....


🏵️పోత‌న ప‌ద్యం🏵️

        మాన‌వీయ

 🏵️విలువ‌ల‌కు ప‌ట్టం🏵️

కామెంట్‌లు లేవు: