*(87)*
*అమరేంద్ర వినుత నే నతి దురాత్ముడనంచు గలలోన నైనను గనులబడవు*
*నీవు ప్రత్యక్షమై నిలువకుండిన మానె దొడ్డగా నొక యుక్తి దొరెకనయ్య*
*గట్టి కొయ్యను దెచ్చి ఘనముగా ఖండించి నీ స్వరూపము చేసి నిలుపుకొనుచు*
*ధూపదీపములిచ్చి తులసితో పూజించి నిత్యనైవేద్యము ల్నీమముగను*
*నడుపుచును నిన్ను దలచెద నమ్మి బుద్ధి నీ ప్రపంచంబు గలిగె నాకింతే చాలు*
*భూషణవికాస శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర*
శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామీ! నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు. పాపములను పారద్రోలు వాడవు. దుష్టులను శిక్షించువాడవు.
తండ్రీ! సురరాజనుతా! నేను అతి దుష్టుడను అని కదూ కలలో కూడ కనిపించవు. పోనీలే, నీవు కనపడక పోయినా, నాకు ఒక ఉపాయం తట్టింది. గట్టి కొయ్యను తెచ్చుకొని, దానిని గొప్పగా చెక్కి, నీ రూపాన్ని అందులో నిలిపి, ధూపదీప తులసీ నైవేద్యములతో నియమం తప్పకుండా రోజూ పూజ చేసుకుంటాను. నిన్ను నమ్మినందుకు నాకు మంచి మార్గమే దొరికింది.
*జై నారసింహా*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి