పురుషోత్తమప్రాప్తియోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి
అవతారిక - అట్టి పరమాత్మయొక్క మహిమను నాలుగు శ్లోకములద్వారా తెలియజేయుచున్నారు –
యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్ |యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌతత్తేజో విద్ధి మామకమ్ ||
తాత్పర్యము:- సూర్యునియందు ఏ తేజస్సు (ప్రకాశము, చైతన్యము) ప్రపంచమునంతను ప్రకాశింప
జేయుచున్నదో, అట్లే చంద్రునియందును, అగ్నియందును ఏ తేజస్సుగలదో, అదియంతయు నాదిగా నెఱుంగుము.
వ్యాఖ్య:- సూర్యాది ప్రకాశకపదార్థములందలి తేజస్సు తనదియని భగవానుడు తెలుపుటవలన ఆ యా వస్తువులను దర్శించినపుడు అవి భగవద్విభూతులే యను భావన గలిగియుండవలెను. ప్రపంచములో అనేక పదార్థములున్నప్పటికిని వానియన్నింటికిని మఱియొక వస్తువును ప్రకాశింపజేయు సామర్థ్యములేదు.
సూర్యచంద్రాగ్నులకు మాత్రమే కలదు. అవి తాము ప్రకాశించును; ఇతరమునుగూడ ప్రకాశింపజేయు చుండును. వాని యందలి ఆ ప్రకాశకశక్తి, ఆ తేజస్సు భగవానుని విభూతియే అయియున్నదని ఈశ్లోకముద్వారా తెలియుచున్నది. (అయితే సూర్యాదులను కూడా ప్రకాశింపజేయునది ఆత్మయే అని ఈ సందర్భమున జ్ఞాపకమునందుంచుకొనవలెను).
ప్రశ్న:- సూర్యచంద్రాగ్నులయందలి తేజస్సు ఎట్టిది?
ఉత్తరము:- పరమాత్మసంబంధమైనది; దైవమునకు జెందినది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి