*సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి? సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి?*
*మనం నమస్కారాలను అనేక విధాలుగా చేస్తూ ఉంటాము. రెండు చేతులను జోడించి హృదయం దగ్గర ఉంచుకొని ఆ దేవుడికి చేసే నమస్కారం ఒకటి. రెండు చేతులను పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ చేసే ఆ సూర్య భగవానుడికి, గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణ చేస్తూ ఆ వేంకటేశ్వరునికి చేసే నమస్కారం మరొకటి. అలాగే గుడిలో దేవుని ముందు బోర్లా పడుకుని చేసే నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. ఈ సాష్టాంగ నమస్కారాన్నే మరో పేరుతో అష్టాంగ నమస్కారం అని అంటారు. సాష్టాంగ నమస్కారము, అష్టాంగ నమస్కారము అంటే అర్థం ఏమిటంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో కలిపి నమస్కారము చేయుట అని అర్ధము.*
*అష్టాంగాలు అంటే :*
*ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః*
*వీటి అర్థాలను ఒకసారి పరిశీలిస్తే "ఉరసా" అంటే తొడలు, "శిరసా" అంటే తల, "దృష్ట్యా" అనగా కళ్ళు, "మనసా" అనగా హృదయం, "వచసా" అనగా నోరు, "పద్భ్యాం" అనగా పాదములు, "కరాభ్యాం" అనగా చేతులు,"కర్ణాభ్యాం" అంటే చెవులు.*
*ఇలా "ఎనిమిది అంగములతో కూడి కలిపి ఈ నమస్కారం చేయాలి. అందుకే ఈ నమస్కారాన్నే "అష్టాంగ, సాష్టాంగ నమస్కారం అంటారు.*
*అలా ఎందుకు చేయాలంటే మానవుడు సహజంగా ఈ ఎనిమిది అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి..*
*ముఖ్యంగా మనందరమూ తెలుసు కోవలసిన విషయం ఏమిటంటే దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ద్వారానికి ధ్వజ స్తంభానికి మధ్యలో వుండి చేయాలి.*
*1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.*
*2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.*
*3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.*
*4) మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.*
*5) వచసా నమస్కారం అంటేవాక్కుతో నమస్కారం.. అంటే.. నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి. అంటే "ఓం నమః శివాయ" అని అంటూ నమస్కారం చేయాలి.*
*6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.*
*7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.*
*8) జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి.*
*అయితే స్త్రీలు మాత్రం సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం అనేది మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, మోకాళ్ళు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది.*
*పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి.*
*నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేయడం వల్ల పొందుతారని శాస్త్రవచనం.శుభం భూయాత్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి