4, అక్టోబర్ 2020, ఆదివారం

రామాయణమ్.116

 

...

చిన్నపిల్లల ముద్దుముద్దు మాటలు మన హృదయానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో సీతమ్మపలుకులు కూడా అంతే ఆహ్లాదకరంగా ఉన్నాయి అనుసూయామాతకు.

.

 సీతమ్మపెళ్ళిముచ్చట్లు చెప్పించుకొని సంబరపడిపోయింది ఆ మహాసాధ్వి.

.

అమ్మా సీతా! నీవు ప్రతి అక్షరము స్పష్టముగా ,ప్రతిపదమును మధరంగా పలికి నన్ను సంతోషపెట్టావే బంగారుతల్లీ .చాలా బాగుందమ్మా !

.

ఇక రాత్రి అవుతున్నది పక్షులన్నీ తమతమగూళ్ళు చేరుకొంటున్నాయి.నేనిచ్చిన వస్తువులు అలంకరించుకొని రాముడి వద్దకు ఇక వెళ్ళమ్మా అని అనగా సీతమ్మ అట్లే చేసి ఆమెకు శిరస్సు వంచి నమస్కరించి రాముని వద్దకు వెళ్ళింది.

.

అనసూయామాత ఇచ్చిన ఆభరణములు ,వస్త్రములు ధరించి నూతనశోభతో కనపడుతున్న తన రమణి సీత ను చూడగనే రాముడి హృదయంలో మధురభావనలు పులకలెత్తాయి.

.

మనుష్యులలో ఎవరికీ దక్కని గౌరవము తన భార్యకు దక్కినందుకు చాలా సంబరపడిపోయాడు రామయ్య.

.

ఆ రాత్రి గడిచింది .తెల్లవారగనే అగ్నిహోత్రము పూర్తి చేసుకొని ఉన్న మునులందరూ సీతారామలక్ష్మణులకు వీడ్కోలు పలికారు.

.

అరణ్యములోనికి ప్రవేశించుచున్న వారికి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు వారు.రామా చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా .

ఈ అడవిలో నరమాంసభక్షకులైన రాక్షసులు వివిధరూపాలలో సంచరిస్తూ ఉంటారు.రక్తముత్రాగే క్రూరమృగాలు ఎన్నో ఉన్నాయి.వాటిని జాగ్రత్తగా తప్పించుకొని వెళ్ళు.అని అరణ్యములోనికి వారు వెళ్ళిరావడానికి నిత్యము ఉపయోగించే మార్గాన్ని చూపించారు.

.

అందరికి నమస్కరించి బయలుదేరిన సీతారామలక్ష్మణులు దట్టమైనమబ్బులలో దూరే సూర్యుడిలాగా ఆ అడవులలో ప్రవేశించారు.

.

ఈ రోజుతో "*****అయోధ్యకాండ సమాప్తము*****

.

శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః


రామాయణమ్..117

అరణ్యకాండము ప్రారంభము

.

ప్రవిశ్య తు మహారణ్యం దణ్డకారణ్యమాత్మవాన్.

రామోదదర్శదుర్దర్షస్తాపసాశ్రమమణ్డలమ్.

.

బుద్ధిమంతుడు ,ఎవరూకూడ తేరిపారచూడసాధ్యముకాని వాడు ఎదిరింపశక్యము కాని వాడు అయిన రాముడు దండకారణ్యములో ప్రవేశించి మునుల ఆశ్రమ సముదాయాన్ని చూశాడు.

.

ఆ ముని వాటికలలో అన్ని మృగాలూ నిర్భయంగా సంచరిస్తున్నాయి.వాకిళ్ళు అన్నీ రంగవల్లులతో తీర్చిదిద్దబడి మనోహరంగా ఉన్నాయి.

.

ఆ ఆశ్రమం చుట్టూ మధురఫలాలనిచ్చే ఎన్నో వృక్షాలు దట్టంగా ఏపుగా పెరిగి చూడటానికి మనోహరంగా ఉన్నాయి.

.

ఆ ఆశ్రమంలో బలిహోమాలతో దేవతాపూజలు,వేదఘోషలతో ప్రాంగణమంతా మారుమ్రోగుతూ బ్రహ్మలోకాన్ని తలపిస్తున్నది.

.

సూర్యుడితో సమానమైన తేజస్సుగల మహామునులంతా ఆ ఆశ్రమంలో నివసిస్తున్నారు.

.

వారందరినీ చూసి తన ధనస్సుకు ఉన్న నారి విప్పివేసి మెల్లగా వినయపూర్వమకముగా వారున్న వైపుకు రాముడు వెళ్ళాడు.

.

సీతారామలక్ష్మణులను కాంచినంతనే మునులు ఎదురేగి స్వాగతము పలికారు.

.

వారందరికీ ఒకటే ఆశ్చర్యం అబ్బ! ఎంత నయనమనోహరంగా ఉన్నాడు రాఘవుడు.

మంచి శోభతోకూడిన శరీర సౌష్ఢవము,సౌకుమార్యము,అద్భుత రూపసౌందర్యము చూసి రెప్పవాల్చకుండా తదేకంగా వారినే చూస్తూ ఉఙడిపోయారు ఆ ముని గణమంతా!

.

సీతారామలక్ష్మణులకు ఆశ్రమప్రాంగణంలో ఒక పర్ణశాలలో బస ఏర్పాటు చేసి ఆయనను సత్కరించి వినయపూర్వకముగా వేడుకున్నారు.,"రాఘవా,నీవే మాకు రాజువు రక్షకుడవు కావున సర్వదా తల్లిగర్భమును రక్షించినట్లు నీవు మమ్ములను రక్షించ వలెను ." అని పలికారు అందరూ.

.

వారి ఆతిధ్యము స్వీకరించి సూర్యోదయమైన వెంటనే మరల బయలు దేరాడు శ్రీ రాముడు.

.

అరణ్యమధ్యంలోకి ప్రవేశించారు.

అడవి ఈగలు రొదపెడుతున్నాయి,క్రూరమృగాలు గుంపులుగా తిరుగుతూకనపడుతున్నాయి.ఆ ప్రదేశంలో ఉన్న లతలూ వృక్షాలూ పాడుబడ్డట్టుగా కనిపిస్తున్నాయి.ఎక్కడా జలాశయమన్నదే కానరావడంలేదు.ఇంతలో ఎక్కడనుండో వస్తున్న భయంకరమైన అరుపులు పెడబొబ్బలతో అరణ్యమంతా మారు మ్రోగిపోతున్నది.

.

వారి ఎదురుగా పర్వతకాయుడైన ఒక రాక్షసుడు వికృతంగా అరుస్తూ నిలబడి ఉన్నాడు.

కామెంట్‌లు లేవు: