**దశిక రాము**
మనం కూడా చాలా పనులు మొక్కుబడికి చేస్తుంటాము. ఎప్పుడో, ఏదో ఆవేశంలో, ఒక మాట అనేస్తాం, నేను అది చెస్తాను, ఇది చేస్తాను అని ప్రగల్భాలు పలికేస్తాం. తర్వాత ఆ పని పూర్తి చేయడానికి నానా తంటాలు పడతాం. ఎందుకు చెప్పాన్రా బాబోయ్! అంటూ మన మీద చిరాకుపడతాం. ఆఖరికి పనైతే పూర్తవుతుంది. కానీ ఇది ధృతి అనిపించుకోదు అంటారు ఋషులు. బలవంతంగా పనులు, కార్యాలు పూర్తి చేయడం కాదు, అయిష్టంగా సంకల్పాలు నెరవెర్చడం కాదు, ఇష్టంతో చేయాలి, ఉత్సాహంతో చేయాలి, మనసా, వాచా, కర్మణా (త్రికరణ శుద్ధిగా) చేయాలి. అలా చేయడమే ధృతి అనిపించుంకుటుంది.
నేను ఈ ధర్మాన్ని ఆచరిస్తాను అనుకుంటాం. సుఖాలు ఉన్నప్పుడు, సమయం అనుకూలించినప్పుడు ఆచరించడం సులువే. కానీ కష్టం వచ్చినా, మరణం సమీపిస్తున్నా, ప్రళయం వస్తున్నా, ధర్మాన్ని అదే ఉత్సాహంతో, సంతోషంతో ఆచరించడం ధృతి. ధృతిని మనుమహర్షి ధర్మానికి మొదటి లక్షణంగా చెప్పడంలో ఒక రహస్యం ఉంది. ఈ ధర్మంలో ఆధునిక వైద్యశాస్త్రంలో ఉన్నట్టుగా దేనికి క్షణికమైన ఫలితాలు (Instant results) ఉండవూ, అనుసంగ ప్రభవాలు (Side Effects) ఉండవు. ఆయుర్వేదమే తీసుకోండి, ఒక్కో ఔషధం పని చేయాలంటే కనీసం 41 రోజులు పాటు దాన్ని సేవించాలి, కానీ దాని ఫలితాలు అధ్బుతంగా ఉంటాయి. ధ్యానం, యోగా కూడా అంతే. గురువు దగ్గరకు వెళ్ళగానే, రా నాయానా! నేను నీ కోసమే వేచి ఉన్నాను. మొత్తం నీకు ఇప్పుడే భోధిస్తాను అని చెప్పడు. ముందు బోలెడు పరీక్ష పెడతారు, మన ఓపికను పరీక్షిస్తారు, మన శ్రద్ధను గమనిస్తారు, మనం అన్నిటిని తట్టుకుని సిద్ధమయ్యాక, అప్పుడి జ్ఞానాన్ని భోధిస్తాడు. ఇక్కడ కూడా వ్యక్తికి ధృతి ఉండాలి. లేకుంటే మోక్షం పొందలేడు. అట్లాగే భగవంతుని అనుభూతి ఒక్క రోజులో కలగదు. దానికి బోలెడు సాధన కావాలి, ఆహార నియమాలు పాటించాలి, బాగా ఓపిక కావాలి, నిరనతరం ఉత్సాహం ఉండాలి, భగవంతుడిని చేరాలన్న తపన నిరనతరంగా కలుగుతూనే ఉండాలి. ఇదంతా కేవలం ధృతి వల్లనే కలుగుతుంది. కనుక మనుమహర్షి ధర్మాచరణలో ధార్మికునకు ఉండవలసిన మొదటి లక్షణం ధృతి అని ప్రవచించారు. తరువాతి లక్షణం క్షమా.
**ధర్మము - సంస్కృతి**
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి