4, అక్టోబర్ 2020, ఆదివారం

*ధార్మికగీత - 38*

  *శ్లో:- నిమిషం నిమిషార్థం వా౹*

                  *ప్రాణినాం విష్ణుచింతనం౹*

                  *క్రతు కోటి సహస్రాణాం ౹*

                  *ధ్యాన మేకం విశిష్యతే ౹౹*

                                        *****

*భా:- ఆధునికత, సాంకేతికత, యాంత్రికత వెల్లి విరిసిన నేటి నవీన సమాజంలో వృత్తి ప్రవృత్తులలో ఉరుకులు, పరుగులు పెడుతున్న మనిషికి భగవంతుని కించిత్తైనా తలచే అవకాశం కనుచూపుమేరలో కనబడడం లేదు. నిత్యం "నారాయణ" స్మరణలో తానే గొప్పనుకొని విర్ర వీగుతున్న నారదునికి , పగలంతా శ్రమించి రాత్రివేళ "రామ,కృష్ణ" అని ఒక్కసారి మనసారా తలచే ఆ కర్షకుడే మిన్న అని విష్ణువు కళ్ళు తెరిపించాడు. కోట్లాది క్రతువులు, యజ్ఞ యాగాల కంటె, ఒక నిమిషం గాని, అరనిమిషం గాని దైవనామాన్ని త్రికరణశుద్ధితో తనివితీరా ధ్యానిస్తే అదే విశేష ఫలితాన్ని ఇస్తుందనేది ఆధ్యాత్మ విదుల అనుభవోక్తి. ప్రహ్లాదుడు తింటూ,త్రాగుతూ,ఆడుతూ,పాడుతూ, చదువుతూ, తిరుగుతూ, ఎగురుతూ కూడా నామస్మరణ చేశాడట. మనకు కూడా మనసుంటే మార్గ ముంటుందనేది యథార్థము. చావడానికి కూడా క్షణం తీరిక లేదనే వారు కూడా నేటి లోకంలో తారస పడుతున్నారంటే ఆశ్చర్యపడ నవసరం లేదు. కాన ధ్యాన విశిష్టత తెలిసికోవలసిందే. "కోటిం త్యక్త్వా హరిం భజేత్ " అని మహర్షులు తీర్మానించారు. దుస్తర భవ సాగర తరణానికి , సకల సంకట పాప హరణానికి కేవలం "హరి" అనే రెండంటే రెండక్షరాలు చాలు అని, అవే ముక్తి మార్గ దిశా నిర్దేశాలని సారాంశము*.

                                    *****

                      *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: