4, అక్టోబర్ 2020, ఆదివారం

ఆదిపర్వము-39

 

కురురాజు జన్మవృత్తాంతం


ఆ ప్రకారం పాండవులు రాత్రిళ్ళు, పగళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఒకరోజు అర్థరాత్రి వారు గంగా తీరానికి చేరుకున్నారు. అది సోమశ్రవ తీర్థము. అందులో స్నానం చేయాలని అనుకున్నారు. ఆ సమయానికి అక్కడకు అంగారపర్ణుడు అనే గంధర్వుడు తన భార్యలతో కూడి విహారానికి వచ్చాడు. పాండవులను చూసి అంగారపర్ణుడికి కోఅపమం వచ్చింది.

“మానవా, ఇది అర్థరాత్రి సమయము. యక్షులు, రాక్షసులు, గంధర్వులు తిరిగే సమయము. ఈ వేళలో మానవులు తిరగరాదు. నేను అంగారపర్ణుడు అనే గంధర్వుడిని, ఈ అడవి, గంగాతీరం నా అధీనంలో ఉన్నాయి. మీరు ఇక్కడ నుండి వెళ్ళిపొండి. లేకపోతె నా బాణాలకు బాలి అవుతారు” అని గర్వంగా పలికాడు.

దానికి అర్జునుడు “నువ్వు చెప్పిన మాటలు బలహీనులైన మానవులకు వర్తిస్తాయి, కాని మావంటి మహా వీరులకు కాదు. ఇంకొక్క మాట ఈ భూమి మీద ఉన్న నదులు అన్నియు జనులకు ఉపయోగకరమైనవి. పైగా ఈ పవిత్ర గంగానది జనులందరికి చెందిన పుణ్య నది. ఇది ఏ ఒక్కరి సొంతమూ కాదు” అని పలికాడు.

తనకు ఒక మానవుడు ఎదురు చెప్పినందుకు అంగారపర్ణుడు కోపించాడు. అర్జునుని మీద పదునైన బాణాలు వేసాడు. అర్జునుడు ఆ బాణాలను, తన చేతిలోని కొరివితో అడ్డుకున్నాడు.

అంగారపర్ణుని చూసి “ఓయి గంధర్వా, ఇది ఆగ్నేయాస్త్రము. దేనిని పూర్వము అగ్నిదేవుడు బృహస్పతికి ఇచ్చాడు. అతడు భారద్వాజునికి ఇచ్చాడు. భరద్వాజుడు దానిని పరశురామునికి , పరశురాముడు ద్రోణుడికి ఇచ్చారు. నా గురువైన ద్రోణుడు నాకు ప్రసాదించాడు” అంటూ ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. వెంటనే అంగారపర్ణుని రథం కాలిపోయింది. అతను నేలమీద పడ్డాడు. అతనిని అర్జునుడు, ధర్మరాజు వద్దకు తీసుకొని వచ్చాడు.

“అర్జునా, ఓడిపోయిన వాడిని, శౌర్యం కోల్పోయిన వాడిని శిక్షించరాదు. విడిచిపెట్టుము” అన్నాడు.

అప్పుడు అంగారపర్ణుడు అర్జునుని చూసి, “అర్జునా, నీ పరాక్రమానికి మెచ్చాను. నీతో స్నేహం చెయ్యాలని ఉంది. నేను నీకు, నాకు లభించిన చాక్షుసీ విద్యను ఇస్తాను. నీకు మహా వేగం కల గుఱ్ఱాలను ఇస్తాను. నాకు నీ వద్ద ఉన్న ఆగ్నేయాస్త్రాన్ని ఇవ్వు” అని అడిగాడు.

దానికి అర్జునుడు “గంధర్వా, మనం ఎంత స్నేహితులమైనా, నీ వద్ద నుండి విద్యలను, ధనాన్ని స్వీకరించలేను. నీకు ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తాను. నీ వద్ద నుండి గుఱ్ఱాలను స్వీకరిస్తాను” అని అన్నాడు.

దానికి గంధర్వుడు సమ్మతించాడు. అర్జునుడు గంధర్వుని చూసి “గంధర్వా,మేము ధర్మబుద్ధి కలవాళ్ళము. మమ్ములను చూసి నువ్వు ఎందుకు అలా గర్వంగా మాట్లాడావు?” అని అడిగాడు.

“అర్జునా, మీరు ఎవరో నాకు తెలియును. కాని ఆడవాళ్ళతో విహరించే వాళ్ళు ఎంత వివేకము కలవాడు అయినా అహంకారం కలిగి ఉంటాడు. కాని ఆ సమయంలో మనకు ఒక బ్రాహ్మణుడు పురోహితుడుగా ఉంటే, ధర్మాధర్మ విచక్షణ చేస్తాడు. మనలను తప్పు చెయ్యకుండా నివారిస్తాడు. ఓ తాపత్యా,మరి మీరు కూడా పురోహితుడు లేకుండా ఇలా సంచరించడం భావ్యం కాదు కదా. అందువలన ఒక ఉత్తమ బ్రాహ్మణుడిని పురోహితుడిగా చేసుకోండి” అని అన్నాడు.

అప్పుడు అర్జునుడికి ఒక సందేహం కలిగింది. “గంధర్వా, మేము కుంతీ పుత్రులము, నువ్వు తాపత్యా అన్నావు. మేము తాపత్యులము ఎలా అయ్యాము?” అని అడిగాడు.

దానికి ఆ గంధర్వుడు ఇలా చెప్పసాగాడు: “సూర్యునికి కూతురు,సావిత్రికి చెల్లులు అయిన తపతి అనే కన్య మహా సౌందర్యవతి. అజాఘీడుని కొడుకు సంవరణుడు. అతను సూర్యుని గూర్చి తపస్సు చేస్తున్నాడు. ఇది తెలిసిన సూర్యుడు, సంవరణుడే తన కూతురు తపతికి తగిన భర్త అనుకున్నాడు.

ఒకరోజు సంవరణుడు అడవికి వేటకు వెళ్ళాడు. తిరిగి తిరిగి అలసిపోయి, ఆ అరణ్యంలో విహరిస్తున్న తపతిని చూసాడు. తపతి సౌందర్యానికి సమ్మోహితుడయ్యాడు. ఆమెను చూసి “ఓ అబలా, నీవు ఎవరు? ఈ అరణ్యంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు?” అని అడిగాడు. కాని తపతి బదులు చెప్పకుండా వెళ్ళిపోయింది.

సంవరణుడు ఆమె మీద మోహంతో, పిచ్చి వాడిలా ఆమె కోసం వెదుకుతున్నాడు. తపతి కూడా సంవరణుడిని చూసి మోహించింది. అతని దగ్గరకు వచ్చి “ఓ రాజా, నన్ను చూసి ఎందుకు మోహం చెందావు?” అని అడిగింది.దానికి సంవరణుడు “ఓ సౌందర్యవతీ, నేను ఎవరికీ భయపడలేదు. కాని నీ సౌందర్యం చూసి నువ్వు నాకు దక్కవేమో అని భయపడుతున్నాను. మన్మధ బాధ భరించలేకుండా ఉన్నాను. నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటాను” అని అడిగాడు.

తపతి అతనిని చూసి నవ్వి “నేను సూర్యుని కుమార్తెను. సావిత్రికి చెల్లిని. నా పేరు తపతి. నాకు స్వతంత్రము లేదు. నీకు నాపై ప్రేమ ఉంటే, నా తండ్రిని అడుగు. మన పెండ్లి జరుగుతుంది” అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పటి నుండి సంవరణుడు అక్కడే ఉండి సూర్యుని పట్టుదలతో ఆరాధిస్తున్నాడు.

ఒకరోజు వసిష్టుడు సంవరణుడి దగ్గరకు వచ్చాడు. అతని బాధను తెలుసుకొని, వెంటనే సూర్యుని వద్దకు వెళ్ళాడు.వశిష్టుని చూసి సూర్యుడు అర్ఘ్య పాద్యాలు ఇచ్చి సత్కరించాడు. వచ్చిన కారణం అడిగాడు.

“పూరు వంశజుడు, ధర్మ పరుడు, సద్గుణ సంపన్నుడు అయిన సంవరణుడు నీ కుమార్తె తపతిని చూసి మోహించాడు. నువ్వు నీ కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చెయ్యాలి” అని చెప్పాడు. సూర్యుడు కూడా తన కోరిక తీరబోతున్నందుకు సంతోషించాడు. తపతిని వశిష్టునితో సంవరణుడి వద్దకు పంపించాడు. వసిష్టుడు ఇద్దరికి వివాహం జరిపించాడు. సంవరణుడికి , తపతికి కురు మహారాజు జన్మించాడు. మీరు కురు వంశజులు కాబట్టి, మీరు తాపత్యులు అయ్యారు” అని వివరించాడు అంగారపర్ణుడు.

కామెంట్‌లు లేవు: