4, అక్టోబర్ 2020, ఆదివారం

హృదయ ప్రక్షాళన

 


కంటికి కనిపించకుండా మానవ జీవితమనే మహానాటకాన్ని నడిపేది మనసొక్కటే! మనస్సంత చంచలమైనదీ, నిశ్చలమైనదీ, వజ్రకఠోరమైనదీ, వేగవంతమైనదీ, స్తబ్ధమైనదీ, పవిత్రమైనదీ, పాపభూయిష్ఠమైనదీ, సౌభాగ్యవంతమైనదీ, దౌర్భాగ్యమైనదీ మరోటిలేదు. మంచికీ చెడుకూ అదే మూలం. యశస్సుకూ, అపయశస్సుకూ అదే కేంద్రం. సుఖానికీ, దుఃఖానికీ అదే ప్రేరకం. ఎంతటివాడైనా మనసుకు దాసోహమనాల్సిందే. దాన్ని జయించడం చాలా కష్టం. చాలామందికి అసంభవం. జయించడమంటే అరిషడ్వర్గాలనీ, నవవికారాలనీ జయించినట్టే.

ఎంతటి వీరుడైనా, తాపసి అయినా, బ్రహ్మర్షి అయినా, మహానాయకుడైనా మనసు చెప్పినట్టు నడచుకోవాల్సిందే. మానసిక తృప్తి సంతోషాన్నిస్తుంది. ఆ సంతోషంకోసమే ఈ వెంపర్లాట. తెల్లవారింది మొదలు నిద్రించేవరకు మనిషి మానసిక తృప్తి, ఆనందంకోసమే తపనపడుతూంటాడు. ఆ సంతోషం, ఆనందం కోసం మంచేకానీ, చెడేకానీ ఏ విచక్షణా జ్ఞానం లేకుండా తాపత్రయపడుతూనే ఉంటాడు.


మనసును అదుపులో పెట్టుకోగలిగినవాడు ఇంద్రియాలను జయిస్తాడు. శాశ్వతమైన, సత్యమైన ఆనందానుభూతుల్లో తేలిపోతాడు. అందుకే, నిర్మలమైన హృదయం కోటి తీర్థయాత్రలతో సమానమైనదన్నారు. మనసు అనంతమైనది, అగాధమైనది. దానిలోతు ఎవరికీ అంతుపట్టదు. 


'ఏ మనస్సు జ్ఞానసాధనమో, ఏది ఆలోచనాశక్తిని కలిగి ఉంటుందో, ఏది ధైర్యానికి నిలయమో, ఏది వినాశరహితమైన ప్రకాశమో, దేనివల్ల సమస్త కార్యకలాపాలు జరుగుతాయో- అటువంటి మనస్సులో సదా శుభసంకల్పాలు ఉదయించుగాక' అని యజుర్వేదంలో భగవత్ప్రార్ధన కనిపిస్తుంది. మంచి మనస్సు మంచి శరీరానికి అలంకారం. మంచి శరీరం మంచి జీవితానికి సాధనం. మంచి జీవితం మంచి ఆధ్యాత్మికసౌధానికి సోపానం.


మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే అనుక్షణం పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు అందులో పుట్టుకొచ్చే దురాలోచనలను బైటికి వెళ్లగొడుతూనే ఉండాలి. అలా హృదయ ప్రక్షాళన చేసుకున్నప్పుడు సుఖశాంతులకు, తృప్తికీ, ప్రసన్నతకు, దివ్యభావాలకు మనసులో చోటివ్వగలం. ఇందుకు మహానుభావుల సద్బోధనలు, సత్సాంగత్యాలు దోహదపడతాయి. సద్గ్రంథ అధ్యయనమూ తోడ్పడుతుంది. ధ్యానం, యోగ, ఉపవాసం, దీక్ష ఎంతగానో సహకరిస్తాయి. ప్రధానంగా క్రమేపీ కోరికల సంఖ్యను తగ్గించుకుపోతూండాలి. ఐహిక బంధాలను తెంచుకుంటూ, నిర్లిప్తత, సమదృష్టి అలవరచుకోవాలి. ఆధ్యాత్మిక ప్రస్థానానికి మార్గాన్వేషణ చేస్తూ ఉండాలి. 'మంచితనా'న్ని మంచి చేసుకోవాలి.


మంచి ఆలోచనలకు మనసు తలుపులనెప్పుడూ తెరిచే ఉంచాలి. దురాలోచల్ని అసలు లోనికే రానీయొద్దు. అదే సంయమనం. అది సాధనతోనే సాధ్యపడుతుంది. అదే ఆధ్యాత్మిక సాధన!

కామెంట్‌లు లేవు: