మనస్సు అంటే చంచలంగా ఉండేది అని అర్ధం. మనసు స్థిరంగా కూడా ఉంటుంది అనే అనుభవం మనకి లేదు. అలాంటి అనుభవం లేనంత మాత్రాన మనసు స్థిరంగా ఉండడం అసంభవం అనుకోకూడదు. ఒక్కసారి అసంభవం అనుకుంటే, ప్రయత్నించాలి అనే సంకల్పం నీరుకారిపోతుంది.
మనిషి ఎలా ఉన్నవాడిని అలా వున్నట్లుగా స్వీకరిస్తే మనసు వశం అవదు. మనసు వశం అవడానికి అభ్యాస, వైరాగ్యాలు కావాలి. మనల్ని వేరే విధంగా తయారు చేయగలిగే పద్ధతి, "అభ్యాసం". మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుండి వేరే స్థితికి తీసుకెళ్లడం," వైరాగ్యం". వైరాగ్యం అంటే జీవితంలో రాగం యెడల విముఖత. ఒక రాగం వ్యర్ధమైనపుడు, అన్ని రాగాలలో వ్యర్ధతని చూడగలిగే వాడికి వైరాగ్యం కలుగుతుంది. ఈ ప్రపంచంలో బాహ్యంగా ఎటువంటి సుఖం లభించదు అనే జ్ఞానాన్ని వైరాగ్యం అంటారు.
మంచిపని చేయాలని వచ్చిన ఆలోచన, ఆ మంచిపని చేయడానికి వేసే ప్రతీ అడుగు వలన, ఆ మంచిపని పూర్తి అయినా, అవకపోయినా మనిషి దుర్గతిని పొందడం జరుగదు. యోగం దిశగా చేసే ఏ ప్రయత్నం వృధాగా పోదు. పరమాత్మ వైపు వేసే ఏ అడుగు కూడా వ్యర్థం కాదు.
ఎవరికి పరమాత్మ యెడల శ్రద్ధ ఉంటుందో, అతను ఆ పరమాత్మని పొందడానికి ఎంతో శ్రమ పడతాడు. కానీ తాను పడే శ్రమ సరిపోయింది అని ఎప్పటికీ భావించడు. పూర్తిగా కష్టపడినా, పరమాత్మా! నీ సహాయం లేకుండా నిన్ను పొందుట అసంభవము అంటాడు. నీ అనుగ్రహం ఉంటేనే నిన్ను పొందగలను అంటాడు. మనం చేసే సాధన అంతా ఆ పరమాత్మ అనుగ్రహం కోసమే. విరాట్ జీవన సాగరంలో నేను ఒక బిందువు కన్నా ఎక్కువేమీ కాదు అని అనుకోవడమే శ్రద్ధ అంటే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి