4, అక్టోబర్ 2020, ఆదివారం

వకుళమాత

 అమ్మా! 

ఎవరు నాయనా అంటూ బయటకొచ్చింది వకుళమాత. ఎదురుగా తిరునామాలు పెట్టుకుని పట్టు పీతాంబరధారి అయిన నవ యువకుడు నిలబడి ఉన్నాడు. 


'ఎవరు నాయనా' అడిగింది మళ్ళీ 

'అనాథనమ్మా. అమ్మ కోసం వచ్చానమ్మ’. 

అప్పుడు అర్థమయింది ఆమెకు అతడెవరో. 

‘జగన్నాధుడివి కదా! అనాధవెట్లా అవుతావు. రా నాయనా లోనికి. నీకోసమే ఎదురు చూస్తున్నాను.’

హృదయ కవాటాలు తెరచి ఆహ్వానించింది ఆ తల్లి ఆ విశ్వనాధుడిని 

అమ్మా ఆకలిగా ఉంది ఏమైనా పెట్టవా తినటానికి 

తప్పక నాయనా పాలు వెన్న ఉంచాను నీ కోసమే కృష్ణ.అంటూ లోనికెళ్ళి వెండిగిన్నె లో వెన్న, కుండలో కాగి మీగడ కట్టిన పాలు తెచ్చి అందించింది. 


ఆకలితో ఆకొని ఉన్నాడేమో అతి ప్రేమతో ఆరగించేడు. తృప్తిగా పెదాలు వత్తుకున్నాడా క్షీర ప్రియుడు ఉత్తరీయం తో. 


యుగాల ఆకలిని తీర్చావు తల్లీ. కృష్ణా 

అని పిలిచేవు. ఎవరమ్మ అతడు. 


నీవే! నా కృష్ణుడివి. అమ్మా అని అంత తీయగా ఆర్తిగా ఇంకెవరు పిలుస్తారు నన్ను. ఆకలి తో నున్న సుతుని నీ తల్లి యశోద గుర్తించలేదా తండ్రి. నీ తల్లి యశోదనేగా. అందుకేగదా ఆకలివేళ అమ్మా అని నా దరికొచ్చావు. నీ కోసమే మరుజన్మనెత్తి ఎదురు చూస్తున్నాను ఎప్పుడు నీ దర్శన మవుతుందాయని. ఇన్నాళ్ళకు నీ దర్శన మయింది కృష్ణా.


యశోద ఒక పిచ్చితల్లి. కొడుకువనే అనుకుంది. గాని భగవంతుడివని తెలుసుకో లేక పోయింది. ఎన్ని లీలలు చూపినా ఆఖరికి నోరు తెరచి పదునాల్గు భువనాలు చూపినా తెలుసుకో లేకపోయింది నీవెవరో. చేతిలో ఉన్న మోక్షాన్ని కాలదన్నుకుని నీ వివాహం చూడాలనుకొంది. ఫలితం ఈ జన్మ. బ్రహ్మాండనాయకా నాతప్పు సైరించి మోక్షమిప్పించవా తండ్రి. 


ఏమి మాటలమ్మ ఇవి. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ నా తల్లివేనమ్మ నువ్వు. ఇప్పుడే కలిశాము. ఇంకా చేయవలసిన పనులు చూడవలసిన వేడుకలూ చాలా ఉన్నాయమ్మ. నీతోనే ఉంటాను ఇకపై. నీకోసమే వచ్చాను వెతుకుతున్నాను ఎక్కడున్నవా అని. నీ చేతి పాల్వెన్నలు ఆరగించి ఎన్నియుగాలో అయింది. ఆ రుచి పాలలో లేదమ్మా. నీ మనసులో పొంగే అపరిమిత ప్రేమ వాత్సల్యపూరితమైన నీకరస్పర్శలో ఉందమ్మా. అది నీవద్ద కాక ఇంకెక్కడ దొరుకుతుందమ్మా.  


తల్లి లేనివాడికి తల్లివయినావు. మాతృప్రేమని వాత్సల్యాన్ని చవి చూపావు. ఆ వాత్సల్యానికి నేనుకూడా మేను మరిచానమ్మా. ఆ జన్మ లో నీకూ నాకు అంతే యోగముందమ్మా. అందుకే 

మరో జన్మ మన యిద్దరికి. 


నా వివాహం నీ చేతి మీద జరిపించమ్మా. ఇదే ఆఖరు వివాహం అమ్మా. ఈ వివాహం తో నువ్వూ నేను ధన్యత చెందుతాం. వివాహానంతరం నీ చేతి వంట తింటూ ఇక్కడే ఉందామమ్మ.


కడుపు నిండుగా మనసు నిండగా నీ చేతి పాల్వెన్నలు ఆరగించితిని. కొంచెము సేపు నీ ఒడిలో సేద తీరుతానమ్మా. అనుమతినీయవూ. 


తప్పక తండ్రీ. పాలకడలిలో శేష శాయివై నిదురించు నీవు నా ఒడిని పావనం చేస్తానంటే అనుమతి ప్రశ్న లేనే లేదు. అది నా భాగ్యం. విశ్రమించు తండ్రీ. 


ఆమె తొడపై తలయుంచి నిదురించిన ఆ భగవంతుణ్ణి చూస్తూ మెల్లగా వీవన వీస్తూ తల్లి వకుళమాత అమందానందాన్ని పొందుతూంది. 


తల్లి ఒడిని మించిన పడక ఇంకెక్కడ. ఎన్ని యుగాలైందో అటువంటి పడక దొరికి. అనంత శయనుడు ఒడలు మరచి నిదురిస్తున్నాడు. 


ఆ అందమైన దృశ్యాన్ని ఊహించు కుంటూ మనం భక్తితో నమస్కరిద్దాం.

కామెంట్‌లు లేవు: