✍️ గోపాలుని మధుసూదన రావు
భృగుమహర్షి విష్ణు వక్షస్థలమును తన్నుట
మునియంతట ముందుకుజని
కనియును వైకుంఠమనెడి కైవల్యపురిన్
కనె నచ్చట శ్రీకాంతుని
కనులారగ లక్ష్మితోడ కాంక్షలు దీరన్ 34
హరి సిరి సరసకుసరసన
సరసంబుల దేలియుండ సంయమి గాంచెన్
హరి హరి శ్రీనారాయణ !
కరుణించుము నన్నటంచు కరముల మ్రొక్కెన్ 35
జరుగునది జరగనున్నది
హరి యెఱిగియు మిన్నకుండె నరమర తోడన్
హరి తత్త్వ మెఱుగజాలక
గరువంబున వొళ్ళు మఱచె కఠినుడు భృగువూ 36
పన్నగశయనుని గాంచియు
మిన్నంటిన యాగ్రహమున మీదకు నుఱికీ
కన్నుల నిండిన పొగరున
తన్నెను వక్షంబుపైన తాపసి జెడుడై 37
ముని జేసిన దుష్కృత్యము
మనమున తానుంచుకొనక మమతలు మీఱన్
ననునయమును జూపించుచు
ననియెను నీరీతి విష్ణు వాతనితోడన్ 38
“ స్వామీ ! మీ యాగమనము
మీ మీవిధి గాంచకుంట మిక్కిలి తప్పే
తామీశ్వర సంభూతులు
తమరీ కోపంబు మాని దయనిటు గనుడీ 39
సున్నితమగు మీ పాదము
తన్నిన నామేను దాకి తగ బాధ పడెన్
సన్నుత ! నను క్షమియించుము
నన్నిటు నీ పాదసేవకనుమతి నిమ్మా “. 40
అని శ్రీహరి మునినాథుని
తన కరముల చాచితెచ్చి తగురీతిగనూ
కనకమయ యాసనంబున
నునిచియు నాతిథ్యమిచ్చె ముని యుప్పొంగన్ 41
హరి తదుపరి సిరి యెదుటను
కరమున కరమునిచి మునిని కడు మర్యాదన్
సరగున దెచ్చియు భక్తితొ
నిరుకరములతోడ గడిగె నిరుపాదములన్ 42
తదుపరి భృగుపాదంబును
మృదువగు తనచేతబూని మృదువుగ నొత్తీ
యదనును జూచియు శ్రీహరి
యదిమియు చిదిమెను వెంటనె యడుగున కన్నున్ 43
కన్నుల నిండిన మదమును
వెన్నుడు యీరీతి నణచ , విస్మితుడగుచున్
కన్నుల భాష్పము లొలకగ
వెన్నుని పాదంబులంటి వేడెను యిటులన్. 44
“ కన్నుల కావరమొప్పగ
తన్నితి నిను నేను స్వామి ! తామసబుద్దిన్
తన్నిన పాదము బట్టియు
కన్నును చిదుమంగ నాదు గర్వంబణిగెన్ 45
శ్రీకేశవ ! నారాయణ !
సంకర్షణ ! వాసుదేవ ! సత్త్వప్రకాశా !
శ్రీకరమగు నీ దృక్కుల
ప్రాకటముగ నన్నునేల ప్రార్థింతుమదిన్. 46
భృగువీరీతిగ కుందుచు
భగవానుని పదములంటి ప్రార్థనసేయిన్
'వగవకు’ మనుచును శ్రీహరి
యగణితమగు ప్రేమతోడ యనెనీరీతిన్. 47
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి