4, అక్టోబర్ 2020, ఆదివారం

**మహాభారతము**

  **దశిక రాము**

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//

101 - అరణ్యపర్వం.

సత్యవంతుని తో సావిత్రి వివాహం చేయడం తనకెందుకు సమ్మతం కాదో, నారద మహర్షి, అశ్వపతికి వివరిస్తున్నాడు :' రాజా ! సత్యవంతుడు చిన్ననాటినుండి కూడా నాకు బాగాతెలుసు. అతని అసలు పేరు చిత్రాశ్వుడు. అతనికి అశ్వాలంటే యెంతో యిష్టము. చిన్నప్పటి నుండి మట్టితో, చిత్రలేఖనంలో అనేక అశ్వాల బొమ్మలు తయారుచేసి, చిత్ర విచిత్ర అలంకరణలు వాటికిచేసి మురిసిపోయేవాడు. కాలక్రమేణా, అతడు యెంతో సాత్విక ప్రవృత్తితో, మాతా పితరుల సేవలో, సత్యనిష్టాగరిష్ఠుడై, మెలుగుతూ వుండడంతో, సత్యవంతుడు అని పిలిచేవారు. అతడు మృదుస్వభావి, రూపవంతుడు. ఏవిధంగానూ సావిత్రికి తీసిపోడు. కానీ, నేను అతనితో వివాహం వద్దని చెప్పినకారణం వింటే, మీరే వెనుకడుగు వేస్తారు. అతని ఆయు:ప్రమాణం యింకా సంవత్సరం పాటు మాత్రమే వున్నది. ఇట్టి అల్పాయుష్కుని, చేసుకోవడానికి, యేస్త్రీ ముందుకువస్తుంది. ' అని చెప్పి మొదట అశ్వపతి వైపు, ఆపై సావిత్రి వైపు చూశాడు, నారదమహర్షి.      

అశ్వపతి సావిత్రిని ఆమె అభిప్రాయం మార్చుకొమ్మని, తిరిగి వరుని గురించి అన్వేషణ చేద్దామని చెప్పాడు. అయితే, సావిత్రి అందుకు అంగీకరించలేదు. ' నేను సత్యవంతుని వరించాను. కానున్నది కాలమే నిర్ణయిస్తుంది. నాకు యిప్పుడు వేరే పురుషుని భర్తగా అంగీకరించే వుద్దేశ్యం లేదు. ' అని స్పష్టంగా చెప్పింది. ' నాకు సత్యవంతుని ఆయు:ప్రమాణం గురించి తెలియకపోయినా, వారితో, నా అత్తమామలతో, అరణ్యంలో నేను నివసించాలని మటుకు నాకుతెలుసు. వారికి తిరిగి రాజ్యం సంప్రాప్టించేవరకు, వారితో పాటు, కష్టాలు పడడానికే నేను నిర్ణయించుకున్నాను. ఆయు: ప్రమాణము అంటారా, నాతో జతకూడిన తరువాత, ఆయనకు విధి అనుకూలంగా మారవచ్చును. అంతా దైవేచ్ఛ. నాకు నా మనస్సే ప్రధానం. కాబట్టి మావివాహం జరిపించండి. ' అని స్థిరంగా చెప్పింది.  

ఆమె చెప్పిన విధానానికి, నారదమహర్షి అబ్బురపడి, ఆమె ఉదాత్తమైన, ఉన్నతమైన స్థిరమైన అభిప్రాయానికి సంతోషంగా తనసమ్మతి కూడా తెలియ జేశాడు. లోక కల్యాణార్థం, ఆమెకు ముందరే రాబోయే ఉపద్రవం గురించి తెలియజేసి, మానసిక స్థిరత్వం కలిగించడమే మహర్షి వుద్దేశ్యమని తెలుస్తూనే వున్నదికదా ! ' మహారాజా ! సావిత్రీ సత్యవంతుల వివాహం నిర్విఘ్నంగా జరుగుతుంది. అందరికీ శుభం కలుగుతుంది. ఆమె యిష్టప్రకారమే వివాహం జరిపించండి. ' అని నారదమహర్షి వెళ్ళిపోయాడు.

వివాహ నిశ్చయ నియమాల ప్రకారం, అశ్వపతి అరణ్యానికి వెళ్లి ద్యుమత్సేనుని కలుసుకుని, తనను తాను పరిచయం చేసుకుని, తన కుమార్తె మనసులోని మాటను చెప్పి, తన కుమార్తె సావిత్రిని ఆయన కోడలుగా స్వీకరించమని ప్రార్ధించాడు. ద్యుమత్సేనుడు, అంత గొప్పసంబంధము తమ కుమారునికి వచ్చిందని, యెగిరి గంతు వెయ్యలేదు. ఎంతో నిదానంగా అలోచించి, ' అశ్వపతి మహారాజా ! నేను అంధుడిని, రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడిని. తిరిగి నా రాజ్యం పొందగలననే ఆశకూడా లేకుండా జీవిస్తున్నవాడిని. ఇప్పుడు మీకుమార్తెను మా యింటికోడలుగా చేసి, ఆ సుకుమారిని కష్టాల పాలు చెయ్యడం న్యాయం కాదు. వియ్యానికి నేను మీతో తూగలేను, యిప్పటి పరిస్థితులలో. ' అనిచెప్పాడు. అయన మాటలకు అశ్వపతి యింకా సంతోషించాడు. 

' రాజర్షీ ! సుఖదుఃఖాలు క్షణభంగురాలు. వస్తూ వుంటాయి. పోతూ వుంటాయి. ఈ విషయాలు అన్నీ ఆలోచించుకునే మీవద్దకు వచ్చాము. కాబట్టి కాదనకండి.' అని అశ్వపతి అన్నాడు. అప్పుడు కాదనలేక, ' రాజా ! నాకు రాజ్యం వున్నరోజులలో, నామనసులో మీ అమ్మాయిని నాకోడలుగా చేసుకోవలెనని అభిప్రాయం తో వుండేవాడిని. కానీ, తరువాత జరిగిన నా అంధత్వము, రాజ్యభ్రష్టుత్వము వలన ఆ వుద్దేశ్యం విరమించుకోవలసి వచ్చింది. ఇప్పుడు మీరే కోరి మీకుమార్తెను మా యింటికోడలుగా పంపిస్తాము అంటున్నారు. కాదనడానికి నాకు మనసురావడం లేదు. ' అని తన అంగీకారం కూడా తెలియజేశాడు ద్యుమత్సేనుడు. 

ఆ విధంగా ఉభయుల అంగీకారంతో సావిత్రీ సత్యవంతుల వివాహం ఆశ్రమపరిధిలోనే, శాస్త్రోక్తం గా జరిపించారు. అశ్వపతిమహారాజు, తెచ్చిన కట్నకానుకలతో పాటు, కుమార్తె సావిత్రిని కూడా వారికి అప్పగించి, మద్రదేశానికి తన పరివారంతో వెళ్ళిపోయాడు.  

అంత అందమైన, సుగుణవతి అయిన భార్య దొరికినందుకు సత్యవంతుడు చాల సంతోషించాడు. సావిత్రి కూడా, పరమానందంతో, తన అత్తమామలను సేవిస్తూ, భర్తతో అనురాగ దాంపత్యజీవితం గడుపుతున్నది. తండ్రి యిచ్చిన రాజాభరణాలను ఆమె త్యజించి, అత్తమామల జీవనానినికి అనుగుణంగా నారచీరలు ధరించి, అనేకవ్రతాలను ఆచరిస్తూ, తపోజీవనం గడుపుతున్నది.  

రోజులు గడుస్తున్నాయి. నారదుని వచనాలు ఆమె మదిలో నిత్యం ప్రతిధ్వనించ సాగాయి. దినమొకయుగంగా ఆమె కఠోర నియమాలతో దైనందిన జీవితం గడుపుతున్నది.  

స్వస్తి.




వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.


🙏🙏🙏


సేకరణ


**ధర్మము-సంస్కృతి*


🙏🙏🙏




**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**


*మన ధర్మాన్ని రక్షిద్దాం**




**ధర్మో రక్షతి రక్షితః**


🙏🙏🙏

కామెంట్‌లు లేవు: