23, జులై 2021, శుక్రవారం

రుక్మిణి అనే పదానికి ‘ప్రకృతి’

  రుక్మిణి అనే పదానికి ‘ప్రకృతి’ అనేది ఒక అర్థం. ప్రకృతి పురుషుడి ఆలంబన వల్ల, పురుషుడు ప్రకృతి ప్రేరణ వల్ల ఒకరికొకరు రాణిస్తారు. కృష్ణుడు పూర్ణ (పురాణ) పురుషుడు, రుక్మిణి ప్రకృతి. వారు ఒకర్నొకరు చూసుకోకపోయినా గుణాలు వినడం వల్లనే గాఢంగా ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవాలనే గాఢవాంఛ కలవారయ్యారు. సాధకుడు భగవంతుణ్ని చేరాలని ఎంత గాఢంగా ప్రయత్నిస్తే అతడి ఇష్టాన్ని కాదనలేక భగవంతుడు అతడికి అంత తొందరగా వశమైపోతాడనేది దీని భావం. జీవులతో పరమాత్మకు గల సంబంధం అంత గాఢమైంది.రుక్మిణి సాధకుడిలోని జీవ చైతన్యానికి సంకేతం. కృష్ణుడు పరమాత్మ తత్వానికి ప్రతీక. జీవతత్త్వం, పరమాత్మ తత్త్వం ఒకదాన్ని మరొకటి విడిచి వేరుగా ఉండనివని, రెండింటికీ అనుసంధానంగా ఉండేది ఒక్క ప్రేమ తత్త్వమేననీ రుక్మిణీ కృష్ణుల పరిణయాసక్తికి అర్థం.


 జీవుడు బ్రహ్మజ్ఞానంతో పరబ్రహ్మ స్వరూపాన్ని ఆరాధిస్తే, ప్రకృతి కల్పించే మాయాబంధం నుంచి తప్పించి, అజ్ఞానానికి వశం కాకుండా కాపాడమని చేసే నిరంతర జ్ఞానసాధనే రుక్మిణి- అగ్నిద్యోతనుడి చేత సందేశం పంపడంలోని అంతరార్థం. ఆ సందర్భంలో ఆమె ‘భువన సుందరా’ అని సంబోధించింది. ఇక్కడ భువనమంటే సకల చరాచర జగత్తు. వాటన్నింటిలో సుందరుడు అంటే ఆనందం కలిగించేవాడు. సహజమైన ఆనందం దూరమైతే అవ్యక్తానందాన్ని అలౌకిక ఆనందాన్ని కలిగించేవాడు భగవంతుడొక్కడే. అందుకే అలా సందేశం పంపింది.

కామెంట్‌లు లేవు: