3, జులై 2021, శనివారం

"మృగా త్సింహ: పలాయతే"

క్రమాలంకారం 

ఈ రోజు క్రమాలంకారం గూర్చి తెలుసుకుందాం. నాలుగు పాదాలు గల పద్యంలో ఫై మూడు పాదాలలో ప్రశ్నలను పేర్కొని ఆ ప్రశ్నల జవాబులుగా నాలుగవ పదాన్ని కలపటాన్ని క్రమాలంకారం అంటారు. ఏ క్రమంలో పైన ప్రశ్నలు ఉన్నాయో వాటీ జవాబులు చివరి పాదంలో అదే క్రమంలో ఉంటాయి అన్న మాట.  అవధాని  ఎంతో తెలివి తేటలతో, సమయస్ఫూర్తితో ఉంటే మాత్రమే ఎలాంటి ప్రయోగాలు చేయగలడు. 

ముందుగా సూక్షంగా అలంకారాలు అంటే ఏమిటో తెలుసుకుందాం.  కావ్యమునకు అందమును చేకూర్చే దాన్ని అలంకారము  అంటారు.,అలంకారములు మూడు రకములు. అవిశబ్దాలంకారములు: శబ్దం  ప్రధానముగా కవితకు బాహ్యసౌందర్యమును కలిగించేవి .

  1. అర్థాలంకారములు: అర్థము వలన కవితకు అంతఃసౌదర్యమును కలిగించేవి .
  2. ఉభయాలంకారములు: శభ్దార్థాల రెంటి వలన కవితకు అందమును సమకూర్చేవాటిని ఉభయములు అంటారు. ఇంకా వివరంగా మరొక సారి ముచ్చటించుకుందాం. 
ఇప్పుడు క్రమాలంకారంలో పూరించిన ఒక సంస్కృత శ్లోకాన్ని పరిశీలిద్దాం. 
సమస్య ఇది 
"మృగా త్సింహ: పలాయతే"  ఈ సంస్కృత వాక్యానికి అర్ధం మృగమైన సింహం పలాయనం అయ్యింది అని అర్ధం. నిజానికి సింహం మృగ రాజు ఎట్టి పరిస్థితిలో పలాయనం (పారిపోదు) కాదు. 
దీనికి కవిగారు ఎలా పురాణ చేశారో పరికించండి. 
చూడండి శ్లోకం-


కస్తూరీ జయతే కస్మాత్కోహన్తి కరిణాం కులమ్

కిం కుర్యా త్కాతరో యుద్దేమృగా త్సింహ: పలాయతే


దీనిలో మూడు ప్రశ్నలు ఉన్నాయి.

మొదటి మూడు పాదాలలో మూడు ప్రశ్నలు,

చివరిపాదంలో సమాధానం ఉన్నది

కావున దీనిని అంతర్లాపిక అనే ప్రహేలిక అని కూడా అంటారు. 

ఇప్పుడు ప్రతి ప్రశ్నను తిలకించండి. .


1. కస్తూరీ జాయతే కస్మాత్?

   (కస్తూరి దేన్నుండి పట్టును?)

2. కో హన్తి కరిణాం కులమ్?

   (ఏది ఏనుగుల సమూహాన్ని చంపును?)

3. కిం కుర్యా త్కాతరో యుద్ధే ?

   (యుద్ధంలో పిరికివాడు ఏమి చేస్తాడు?)


ఈ ప్రశ్నలకు సమాధానం - మృగా త్సింహ: పలాయతే


1. కస్తూరీ జాయతే కస్మాత్?

   (కస్తూరి దేన్నుండి పట్టును?)

    -   మృగాత్(మృగము)

    కస్తూరి మృగము నుండి పుట్టును

2. కో హన్తి కరిణాం కులమ్?

   (ఏది ఏనుగుల సమూహాన్ని చంపును?)

   - సింహ:(సింహము)

   సింహము ఏనుగుల కులాన్ని చంపుతుంది

3. కిం కుర్యా త్కాతరో యుద్ధే ?

     (యుద్ధంలో పిరికివాడు ఏమి చేస్తాడు?)

     - పలాయతే (పారిపోతాడు)

     పిరికివాడు యుద్ధంలో పారిపోతాడు.

కామెంట్‌లు లేవు: