మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
*శ్రీ స్వామివారు..శ్రీ సాయిబాబా విగ్రహం..*
1996వ సంవత్సరం లో అమ్మా నాన్న గార్లు శిరిడీ వెళ్ళిరావాలని నిర్ణయించుకున్నారు..అంతవరకూ వాళ్ళు ఎన్నడూ శిరిడీ వెళ్ళివుండలేదు..తమతో పాటు తమకు తోడుగా రమ్మని నాన్నగారు నన్ను అడిగారు..సరే నని చెప్పి మా ఆవిడనూ పిల్లలనూ కూడా తీసుకొని శిరిడీ కి బైలుదేరాము..మాకూ అదే మొదటిసారి శిరిడీ ప్రయాణం..ఈ శిరిడీ ప్రయాణానికి ఒక ప్రత్యేకత ఉన్నది..శ్రీ సాయిబాబా చరిత్రను మా అమ్మ నిర్మల ప్రభావతి గారు వ్రాద్దామని నిర్ణయించుకున్నారు..అందుకు ముందుగా శిరిడీ వెళ్లి, శ్రీ సాయినాథుని దర్శనం చేసుకొని..ఆ సాయిబాబా ఆశీస్సులు పొందాలనీ..శ్రీ సాయిబాబా నడయాడిన శిరిడీ క్షేత్రాన్ని చూసిరావాలనీ..ఒక బలమైన కోరిక ఆవిడ మనసులో కలిగింది..ప్రయాణపు ఏర్పాట్లు చేసుకొని..అందరమూ ఒంగోలు నుంచి రైల్లో బైలుదేరాము..
శిరిడీ లో రెండురోజుల పాటు వున్నాము..శ్రీ సాయి సమాధి ని దర్శించి తరించాము..అమ్మ మనసులో శ్రీ సాయి చరిత్ర "శ్రీ శిరిడీ సాయినాథ భాగవతము" అనే పేరుతో రూపుదిద్దుకున్నది..తిరుగు ప్రయాణం నాటికి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తుఫాన్ కారణంగా మేమిక్కిన రైలు ఒంగోలు రాకుండా..తిరుపతి మీదుగా వెళ్లే ఏర్పాటు చేసినందున.. మేము తిరుపతి లో ఆగిపోవాల్సివచ్చింది..ఎలాగూ తిరుపతి వచ్చాము కదా అని ఆ వేంకటేశ్వరుడి దర్శనం కూడా చేసేసుకున్నాము..అలా యాత్ర ముగించుకొని మొగలిచెర్ల చేరాము..
మా చిన్నాన్న గారు శ్రీ పవని శ్రీనాథరావు గారు శ్రీ సాయిబాబాకు భక్తులు..ఆయన నాన్నగారిని కలిసి..
"అన్నయ్యా..మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిర ప్రాంగణంలో.. శ్రీ సాయిబాబా మందిరం కట్టిద్దాము..చిన్నదైనా పర్వాలేదు..అందుకు నేను సహకారం అందిస్తాను..శ్రీ సాయిబాబా కూడా అవధూత కదా.." అన్నారు..అమ్మా నాన్న ఇద్దరూ సరే నన్నారు..శ్రీ స్వామివారి మందిర ప్రాంగణం లోనే నైరుతీ మూల శ్రీ సాయిబాబా మందిరం నిర్మించాలని నిర్ణయించారు..అనుకున్న విధంగానే నిర్మాణం జరిగిపోతున్నది..
శ్రీ సాయిబాబా విగ్రహం రెండు అడుగుల ఎత్తున ఉండేది కావాలని..జైపూర్ వద్ద మంచి విగ్రహాలు దొరుకుతాయనీ..నన్ను వెళ్లి తీసుకురమ్మని చెప్పారు..ముందుగా మొగలిచెర్ల కు వచ్చి..శ్రీ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకున్నాను..జైపూర్ చేరుకున్నాను..జైపూర్ చేరిన తరువాత తెలిసింది..ఇప్పటికిప్పుడు విగ్రహం కావాలంటే దొరకదు..ముందుగా ఆర్డర్ ఇచ్చి..కొన్నాళ్ల తరువాత తయారైన విగ్రహాన్ని తీసుకొని రావాలని చెప్పారు..మాక్రానా లో విచారించాను..అదే చెప్పారు..ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తూ..జైపూర్ లో ఆరోజు ఆగిపోయాను..
ఆరోజు రాత్రి.."స్వామీ దత్తాత్రేయా నీదే భారం.." అనుకున్నాను
ప్రక్కరోజు ఉదయం నేను బస చేస్తున్న హోటల్ కు దగ్గరలోనే.."మూర్తియోంకా బజార్" అని వున్నదని.. అక్కడ కూడా విగ్రహాలు వుంటాయని..హోటల్ తాలూకు మేనేజర్ నాతో చెప్పాడు..చెప్పడమే కాదు..నన్ను ఆటోలో ఎక్కించుకొని..ఆ ప్రదేశం లో దించి వెళ్ళాడు..ఇది నేను ఊహించలేదు..ఆ వీధి లో చాలా మంది శిల్పులు విగ్రహాలు చెక్కుతున్నారు..రకరకాల దేవీ దేవతల విగ్రహాలు తయారవుతూ ఉన్నాయి..
"విగ్రహం బాగుంది కానీ..మనం అడిగింది మూడు అడుగుల ఎత్తు కదా?..ఇది రెండు అడుగులే ఉన్నది.." అని తెలుగులో మాటలు వినిపించాయి..చివ్వున ప్రక్కకు చూసాను..ఇద్దరు మాట్లాడుకుంటున్నారు..నన్ను నేను పరిచయం చేసుకొని..విషయం అడిగాను..వాళ్ళు కూడా శ్రీ సాయిబాబా విగ్రహం కొరకు ఇంతకుముందు వచ్చి ఆర్డర్ ఇచ్చివున్నారట..కాకుంటే వీళ్ళు చెప్పింది మూడడుగుల ఎత్తు..వాళ్ళు చేసింది రెండు అడుగుల ఎత్తు..చక్కటి బాబా విగ్రహం..చిరునవ్వుతో నన్నే చూస్తున్నట్లు అనిపించింది..వాళ్ళను అడిగాను..సంతోషంగా ఒప్పుకున్నారు..ధర కూడా మాట్లాడారు..మరో రెండు గంటల్లో శ్రీ సాయిబాబా విగ్రహం రవాణాకు సిద్ధం చేశారు..అంతా కలలా జరిగిపోయింది..ఆ దత్తాత్రేయుడే దగ్గరుండి చేయించాడేమో అనుకున్నాను..
1997వ సంవత్సరం డిసెంబర్ నెలలో మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం ప్రాంగణం లో శ్రీ శిరిడీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ కన్నుల పండుగలా జరిగింది..
(మాతల్లిదండ్రులు శిరిడీ కి వెళ్లడం అదే మొదటిసారి..చివరి సారి కూడా..అలాగే మా దంపతులము మరలా 2019 జూలై వరకూ దాదాపు 23 సంవత్సరాల కాలంపాటు శిరిడీ వెళ్లే అవకాశం కలుగలేదు..ఎప్పుడైనా ఒక్కసారి శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకున్నా..ఆరోజుకు మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం లో అత్యవసర పని ఏర్పడి..అక్కడే గడపాల్సి వస్తుంది..మావరకూ అన్ని దత్తక్షేత్రాలూ ఇక్కడే..శ్రీ స్వామివారి సన్నిధి లోనే ఉన్నాయనే భావన బలంగా మనసులో నాటుకుపోయింది..)
మరో అనుభూతి తో రేపు కలుద్దాము..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి