*పురాకృతం...చివరి భాగం*
కాశీలో శివుడు అక్కడ చనిపోయిన వాళ్లకు వెంటనే ముక్తిని ప్రసాదిస్తానని వరం అనుగ్ర హించాడు. కాశీ క్షేత్రపాలకుడైన కాలభైరవుడి ని శివుడు ఆ ప్రాంతంలో చనిపోయిన వాళ్ళను ఆట్టే బాధపెట్టకుండా వాళ్ల పాప ఫలం పూర్తి చేసి తన వద్దకు తీసుకు రమ్మని చెప్పాడట. బాధపడకుండా పాప ఫలం పోయేది ఎలాగా. అన్ని మతాలలో కూడా భగవంతుడు కరుణా మయుడు భగవంతుడి ముందు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి క్షమాపణ చెప్పి శరణాగతి వేడిన వాడిని క్షమిస్తాడు అంటారు. అలా చేస్తే చేసిన పాపాలకు ఫలం అనుభవించనక్కరలేదా అనే ప్రశ్న వస్తుంది. అప్పుడుకూడా అనుభ వించాలిసిందే. తప్పదు. భగవంతుడు కరుణిస్తే ఆ పాప ఫలం ఎలా వెళ్ళిపోతుందో అర్థం చేసు కోవడానికి ఈ ఉదాహరణను గమనించాలి.
Inter పరీక్ష ఒక 100 మంది రాశారు అనుకుందాం. అందులో దాదాపు 20 మంది పరీక్ష తప్పుతారు. ఒక 70 మంది 35 నుంచి 59 మార్కులు తెచ్చుకుంటారు. పదిమంది ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు అనుకుందాము. తప్పిన వాళ్లలో 16 మంది ఏడుస్తూ అవమానంతో ఇంట్లో కూర్చుంటారు. ఇద్దరు అవమానం భరించలేక ఇంట్లో నుంచి పారిపోతారు. ఒకడు ఆత్మహత్య కూడా చేసుకుంటాడు. మొత్తం 20 మందిలో మిగిలిన వజ్రపు తునక బంగారు కొండ ఒకడుంటాడు. వాడు సూటిగా కాలేజీ ఫస్ట్ వచ్చిన పిల్లవాడి దగ్గరికి పోయి నువ్వు కాలేజీ ఫస్ట్ వచ్చావు కాబట్టి పార్టీ ఇస్తావా ఇవ్వవా అని పీడించి వాడి డబ్బులతో వాడితో పాటు హోటలుకు సినిమాకు కూడా పోతాడు. వాడి అమ్మా నాన్నా బాధపడతారేమో. వాడు మాత్రం హాయిగా ఉంటాడు.
ఇప్పుడు చూడండి పరీక్ష తప్పడం అందరికీ ఒకటే శిక్ష. అది ప్రారబ్దం. దానికి ఎవరు ఎట్లా బాధపడ్డారు అనేది వాళ్ళ మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు యోగీ సంసారీ ఒకే లాగా స్పందించరు. శారీరిక బాధలకు కూడా రమణ మహర్షి శంకరా చార్యులు అందరి లాగా బాధ పడలేదు కదా. కష్టాలు బాధ పెట్టవు. వాటికి మనం స్పందించే తీరులో బాధ ఉంటుంది. బాధ మనసుకే కానీ శరీరానికి కాదు కదా.
స్థల పురాణం ప్రకారం కాశీలో మరణించిన వాళ్లకు కాలభైరవుడు కౌన్సిలింగ్ ఇచ్చి కష్టాలకు బాధలకు చలించ కుండా మానసిక స్థైర్యం కల్పించి ప్రారబ్దాన్ని పూర్తి చేయిస్తాడు. అది కూడా, అతి తక్కువ కాలంలోనే. భగవంతుడు కాల స్వరూపుడు. కాలం మీద ఆయనకు పూర్తి అధికారం ఉంటుంది. కాశీ గడియారం (local time) ప్రకారం పది నిమిషాలు గడిచే లోపల మన గడియారం ప్రకారం 10 జన్మలు పూర్తవుతాయి. తక్కువ కాలంలో అన్ని శిక్షలు అనుభవిస్తాము. కానీ ఆ సినిమాకు వెళ్ళిన పిల్లవాడి లాగా సుఖంగా అనుభవిస్తాము.
మనం ఏ రూపంలో భగవంతుడి ని పూజిస్తే ఆయన ఆ రూపంలోనే కాలభైరవుడు చేసే పనినే ఎక్కడైనా ఎప్పుడైనా చేసి చూపిస్తాడు. భగవంతుడు సర్వసమర్ధుడు అనినమ్మకం ఉండాలి. పాపాత్ములను క్షమించడానికి ఉద్ధరించడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు అని గ్రహించి చేసిన వాటికి క్షమాపణలు చెప్పుకుని మళ్లీ పొరపాట్లు చేయకుండా... వైరాగ్యంతో జ్ఞాన, భక్తి, కర్మ మార్గాలలో ప్రయాణం చేసి భవబంధాల నుంచి బయట పడాలి.
*అంతే కానీ కష్టాలు వచ్చినప్పుడల్లా మనం మతం మార్చుకుంటూ పోతే... పూర్వ జన్మ కర్మ మనల్ని వదిలిపెట్టి పోదు.... మన తోపాటు ప్రారబ్దం కూడా ఆ మతం లోకి కూడా వెంట వస్తుంది...తస్మాత్ జాగ్రత్త!!*
*పవని నాగ ప్రదీప్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి