*"రామ" మంత్రం*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*రామనామ ప్రభావం*
*ప్రతీ భగవన్నామంలో ఒక నిగూఢ అంతరశక్తి, మహిమ వుంటుంది. మనకున్న ఏడుకోట్ల మహామంత్రాలలో రెండక్షరాలా "రామ" మంత్రం శ్రేష్టమైనదని మనుస్మృతి తెలుపుతుంది. ఇది హరిహరతత్వంబు కలిసిన మహామంత్రం. 'ఓం నమోనారాయణాయ' అనెడి అష్టాక్షరి మంత్రములో "రా" అను అక్షరం జీవాక్షరం. (ఎందుకంటే ఈ మంత్రంలో 'రా' తొలగించినచో ఓం నమో నాయణాయ అన్నది అర్ధం లేనిదవుతుంది) 'ఓం నమశ్శివాయ' అనెడి పంచాక్షరి మంత్రంబులో "మ" అనునది జీవాక్షరం.(ఎందుకంటే ఈ మంత్రంలో 'మ' తొలగించినచో ఓం నశ్శివాయ అంటే శివుడే లేడని అర్ధం) ఈ రెండు జీవాక్షరముల సమాహారమే "రామ". శివకేశవుల సంఘటిత శక్తియే 'రామ'మంత్రం.*
*అందుచే రామమంత్రం సర్వశక్తివంతమైన, శ్రేష్టమైన ముక్తిప్రసాద మంత్రముగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.100 కోట్ల శ్లోకాలతో రామాయణం వాల్మికిచే రచింపబడినది. అది త్రైలోక్యవాసుల సొత్తు. దానిని పరమశివుడు అందరికి పంచెను. 33 లక్షల 33 వేల 333 శ్లోకముల వంతున పంచగ 1 శ్లోకం మిగిలి పోయింది. దానిని కూడా పంచమని మునులు కోరారు. ఆ శ్లోకంలో 32 అక్షరములు ఉన్నవి. దానిని దశాక్షరి రూపమున ముగ్గురికి పంచగా రెండక్షరములు మిగిలినవి. ఆ రెండక్షరములు శివుడు తనకై తీసుకున్నాడని కధనం. ఆ రెండక్షరములే "రామ."*
*"రామ" అను రెండక్షరములు మనోహరమైనవి. మధురమైనవి. అమృత సమానం. ఈ రెండు అక్షరములు ముక్తి అను అమృతమును ఇచ్చును. సులభమైన ఈ నామం ఇహమందు సుఖమును, సంపదలను ఇస్తే, పరమునందు విష్ణుసాయుజ్యం ఇస్తుంది. లౌకికముగా భవభూతి, పారమార్ధికముగా ఆత్మానుభూతి రామనామం వలన కల్గుతుంది.*
*రాశబ్దోచ్చారణే జాతే వక్ర్తాత్పాపం విగచ్ఛతి | మకార శ్రవణే జాతే భస్మీభావం గమిష్యతి || (ఉమాసంహిత)*
*('రా' అను శబ్దం ఉచ్చరించగానే పాపం వదనము నుండి బయటపడును. పిదప 'మ'కారము వినుటతోడనే భస్మమైపోవును.)*
*రామేతి రామచంద్రేతి రామభద్రేతి వా మనుమ్ | యావజ్జీవం జపన్ మర్త్యో జీవన్ముక్తో న సంశయః ||*
*(ఉమాసంహిత)(రామ, రామచంద్ర, రామభద్ర, అను ఈ మంత్రాలలో దేనినైనను జీవితాంతం వరకు జపించు మనుజుడు జీవన్ముక్తుడు కాగలడు. ఇందులో సంశయం లేదు) కృశాను (అగ్ని) 'ర'అక్షరం అగ్నిబీజాక్షరం. భాను (సూర్యుడు) 'అ'అక్షరం సూర్యబీజాక్షరం. హిమారక (చంద్రుడు) 'మ'అక్షరం చంద్రబీజాక్షరం. ఈ మూడు బీజాక్షరములు కలసి "రామ" శబ్దమయ్యెను. అగ్నిగుణం దహించుట. అగ్నిబీజాక్షరమగు 'ర' శుభాశుభ కర్మలను దహించి మోక్షమును ఇచ్చును. సూర్యుని వలన అంధకారం నశించును. అటులనే సూర్య బీజాక్షరం 'అ' మోహాందకారమును పోగొట్టును. చంద్రుడు తాపమును హరించును. అటులనే చంద్రుని బీజాక్షరం 'మ' తాపత్రయమును హరించును. ఉత్పత్తి కర్తయగు బ్రహ్మవంటివాడు చంద్రుడు. పోషణ కర్తయగు విష్ణువువంటివాడు సూర్యుడు. సంహార కర్తయగు శివుని వంటివాడు అగ్నిదేవుడు. ఈ త్రిమూర్తి స్వరూపుడు శ్రీరాముడు.*
*రామ మంత్రము ఎటువంటిదంటే - పుట్టుట, గిట్టుట అనెడి అలలు గల సంసారమను సముద్రం దాటించునదియును, బ్రహ్మవిష్ణురుద్రాదుల చేత పొగడదగినదియును, బ్రహ్మహత్యాది మహాపాపములను నశింపజేయునదియును, కామక్రోధలోభ మోహమదమాత్సర్యాలాది దుర్గుణములను సంహరించునదియును, నేను జీవుడనేడి అజ్ఞానం తొలగించునదియును, పరబ్రహ్మం (చైతన్యం) నేననెడు దివ్యజ్ఞానం వలన కలిగిన నిరాతిశయానందమును వర్ధిల్లు జేయునదియును, వేదముల కడపటిభాగమైన జ్ఞానకాండం చేత విచారింపదగినదియుయగును.*
*( శ్రీ సీతా రామాంజనేయ సంవాదం)*
*రా శబ్దోశ్చారణాదేవ ముఖాన్నిర్యాంతి పాతకాః | పునః ప్రవేశ భీత్యాచ మకారస్తూ కవాటవత్ ||*
*(నోరు తెరిచి "రా" అని చెప్పునప్పుడే పాపములన్నియు నోటినుండి బయటికి వెళ్లిపోవుచున్నవి. మరల అవి లోపలకు ప్రవేశించకుండా "మ"కారం తో నోటిని మూసి బంధించు చున్నది) "రా" అక్షరం ఉచ్చరించుటవలన నోరు తెరవబడి పాపములు పోయి ముఖం మధురముగా ఉండును. "మ" అక్షరం ఉచ్చరించుటవలన నోరు మూతపడి సంతోషం కలుగును. "రా" అక్షరం బ్రహ్మస్వరూపుడునగు ఆదికూర్మముతో సమానం. "మ" అక్షరం జీవస్వరూపుడగు ఆదిశేషువుతో సమానం. "రా" అక్షరం ఛత్రం వలెను, "మ" అక్షరం కిరీటం వలెను సర్వ వర్ణములకంటే అధికముగా ప్రకాశించును. ఇటువంటి రామనామమును జపించిన సిద్ధత్వమును పొందుదురు. "రా" అగ్ని బీజాక్షరం కావున దానిని స్మరించిన మాత్రమున సకలపాపములు భస్మము కావించుననియు, "మ" అమృత బీజాక్షరం కావున దానిని స్మరించిన యెడల సత్యముగా మోక్షం ఇచ్చుననియు ఋషులు తెలిపారు.*
*"రా" అనగా పరబ్రహ్మం, "మ" అనగా చిచ్ఛక్తి. "రా" అనగా క్షేత్రజ్ఞుడు, "మ" అనగా జీవుడు. "రా" అనగా శివుడు, "మ" అనగా శక్తి. "రా" అనగా విష్ణువు, "మ" అనగా లక్ష్మి. "రా" అనగా బ్రహ్మం, "మ" అనగా సరస్వతి. "రా" అన్న మాత్రమున యముడు గజ గజ వణుకును, "మ" అన్న మాత్రమున అతని పాశం తెగిపోవును. రామ అన్న భవబంధములు నశించును. రామ అన్న సమస్త సంపదలు కల్గును. రామ అన్న సర్వార్ధములు సిద్ధించును.రామ అన్న బ్రహ్మహత్యాది పాతకములెల్ల నివర్తియగును. రామ అన్న సకల సంశయములు నివృత్తి యగును. రామనామం స్మరణం చేసేవారికి మోక్షం కరస్థమై రామమయమై ఉన్నది. రామ మంత్రముకంటే అధికమైన యజ్ఞంగాని, తపంగాని, వ్రతంగాని, మంత్రంగాని, మరియొకటి లేదు.*
*తారక మంత్రం:-*
*తారకం సర్వవిషయం సర్వధా విషయమక్రమం చేతి వివేకజం జ్ఞానం||*
*(పతంజలి యోగం) వివేక జన్య జ్ఞానం తారకం. ఆత్మానాత్మ వివేకజ్ఞానముచే కలిగెడు శుద్ధమైన ఆత్మజ్ఞానమునకు తారకమని పేరు. సంసార సాగరము నుండి తరింపజేసేది కాబట్టి ఇట్టి వివేకజ్ఞానమునకు తారకం అంటారు. రామ మంత్రం ఒక్కటియే తారకమంత్రమైనది.తా..రకం అనగా తన యొక్క స్వరూపం. తన స్వరూపం తాను తెలిసి కొనినచో ఏ చింతయు లేక మనస్సు నెమ్మది పొందును. పరమాత్ముడైన శ్రీరామునితో ప్రత్యగాత్మ స్వరూపుడైన తాను వియ్యమగుటయే యోగమనబడును.*
*రామ ఏవ పరబ్రహ్మ రామ ఏవ పరం తపః| రామ ఏవ పరం తత్వం శ్రీరామో బ్రహ్మతారకం||*
*శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||*
*(నేను సదా రామనామమును ధ్యానించెదను, అది విష్ణు సహస్ర నామములకు సమానమైనది. నీవును ఆ నామమును జపించుమని శివుడు పార్వతీదేవికి ఉపదేశించెను.) తారక మంత్రమునే శివుడు సదా జపించెను. జీవుడు ముక్తి పొందవలెనని తలచి కాశీలోని మరణకాలమున ఈశ్వరుడే తారకమంత్రం స్వయముగా జీవుల దక్షిణ చెవియందు ఉపదేశించును. రామ అను శబ్దమును మరా అని జపించి దోపిడిదొంగ రత్నాకరుడు వాల్మికి మహాముని అయ్యెను. సహస్రనామములతో సమానమని శివుని వచనమును విని, పార్వతీ రామనామమును పఠించి శివుని సాంగత్యం నొందెను.*
*తన వచనముల యందామెకు గల విశ్వాసం జూచి, సంతచించి ప్రసన్నుడై పార్వతికి శివుడు తన శరీరములో ఎడమభాగమును ఇచ్చెను. రామనామ స్మరణతో రాయి రూపంలో ఉన్న అహల్య రామస్పర్శకు నోచుకొని పునీతురాలైనది. రామ అను తారకమంత్రము చేత సకల పాతకములు నశించును. పార్వతీదేవికి పరమేశ్వరుడు, వాల్మికికీ నారదుడు, భరద్వాజునకు వాల్మికి, వ్యాసులకు పరాశరులు, శుకులకు వ్యాసుడు ఉపదేశించినది తారకమంత్రమే. తారకమంత్రము కంటే ఉత్తమమంత్రం లేదు.*
*ఈ మంత్రమును త్రికరణశుద్ధిగా అనుష్టించినవారు భవసాగరమును నిస్సంశయమముగా తరింపగలరు. నిరంతంను ప్రాణావాయువు లోపల వెలుపల సంచరించు నప్పుడెల్లను తదేకధ్యానముతో తారకమంత్రమును మననింపుచు ఉన్నను కాలక్రమేణ ఈ మహామంత్ర ప్రభావంచే ముక్తిని పొందుదురు. రామ అన్నది ఒక్క నామమే కాదు, మంత్రం కూడా. రామ మంత్రం మనిషిని తరింపజేసేది కావునా అది తారకమంత్రమైంది.*
🕉️🌞🌏🌙🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి