3, జులై 2021, శనివారం

క్షమాపణల గంధపుగిన్నె

 క్షమాపణల గంధపుగిన్నె 

----------------------------


అప్పుడప్పుడు

ఆవేశం హద్దులు దాటిపోయి

ఆలోచనకు కళ్ళు మూసుకపోయి

మాటలకు ముళ్ళు మొలుస్తుంటాయి

కళ్ళాలు వదులైపోయి

చేతలు అదుపు తప్పిపోతుంటాయి


తనదైనా పరాయిదైనా

ఎదుటిపక్షం మాత్రం ఆ క్షణంలో

ఎడాపెడా ఇబ్బంది పడిపోతుంది


మనసులకే కాదు 

మనుషులకూ గాయాలవుతుంటాయి

కష్టమో నష్టమో 

కనులముందు అకస్మాత్తుగానో

మెల్లమెల్లగా ఆ తరువాతానో వాటిల్లుతాయి


తప్పు, తలుపు తెరుచుకుని

సంబంధాల వాకిట్లోకొచ్చి

తలదించుకుని మౌనంగా నిలబడుతుంది


అయినంత మాత్రాన సరిపోతుందా...?

ఎంత ప్రయత్నించినా, ప్రాధేయపడినా

కాలం వెనక్కి తిరిగి నడవదుగా

జరిగిన సంఘటన మాయంకాదుగా 

కలిగిన ఇబ్బంది తొలగి, దూరం అయిపోదుగా


అందుకే 

క్షమాపణల గంధపుగిన్నె 

ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి

మనం చేసిన గాయాలపై

అలాఅలా చల్లి చల్లబరుస్తూనే ఉండాలి...


మనసులను ... మాటల మాధ్యమంతోనూ

మనుషులను ... వినయపు చేతల చర్యలతోనూ


              ..,. శ్రీధర్ చౌడారపు (03.07.2021)

కామెంట్‌లు లేవు: