30, ఆగస్టు 2021, సోమవారం

జీవన సాఫల్యం

 జీవన సాఫల్యం 

మనుషుల మనస్తత్వాలు కొన్ని సార్లు ఆశ్చర్యకరంగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో కొందరు మాట్లాడే మాటలు వింటుంటే మనుషులు ఇలా కూడా ఆలోచిస్తారా అని అనిపిస్తుంది.  మనిషి ఆశా జీవి కాదనలేము. కానీ ఈ రోజుల్లో మనుషులు ఎలావున్నారంటే, ప్రతిదీ ఐహికంగానే ఆలోచిస్తున్నారు, సరే అది పర్వాలేదు అని అనుకుంటే వారి ఆలోచనలకి ఒక గమ్యం లేకుండా కూడా కొన్ని సార్లు అనిపిస్తున్నది. నాకు ఇటీవల తారస పడిన కొన్ని సందర్భాలను ఇక్కడ ఉటంకించ ప్రయత్నిస్తాను.  ఒక న్యాయవాదుల వాట్సాప్ గ్రూపులో అది న్యాయవాదులకు సంబంధించింది కాబట్టి ఒక మిత్రుడు ఢిల్లీలో ఒక సీనియర్ న్యాయవాది న్యాయవాద వృత్తి జీవితాంతం చేయవచ్చు దీనికి రిటైర్మెంట్ లేదు అని పేర్కొన్నారు.  నిజానికి అడ్వాకెట్స్ చట్టంలో కూడా ఎక్కడ న్యాయవాదికి రిటైర్మెంటు అని లేదు.  కానీ విషయం ఏమిటంటే ఆ పోస్టు చూసిన ఒక సభ్యుడు పెట్టిన పోస్టు నన్ను ఆలోచనలో పడేసింది.  ఆయన ఏమన్నారంటే తాను ఇంకా ఐదు సంవత్సరాలకు చనిపోతానన్న దాకా వృత్తిలో కొనసాగుతా అని ఆయన వ్రాసారు. ఇప్పుడు సమస్య ఏమిటంటే ఆయనకి తాను  ఎప్పుడు చనిపోతాడో తెలుసా? ఆయన ఏమి జ్యోతిష్య పండితుడు కాదు.  అయినా కూడా జ్యోతిష్యం ఎంతవరకు కరెక్టుగా ఉంటుంది అన్నది కూడా ప్రస్నార్ధకమే.  నిజానికి తాను యాదృచ్చికంగా ఆ పోస్టు చేసారని నాకనిపించింది. కానీ నేను చెప్పదలచుకుంది ఏమిటంటే ధన వ్యామోహం మనిషిని ఎలా మాట్లాడిస్తుంది అన్నది. యెంత సంపాదించినా ఇంకా ఇంకా సంపాదించాలి దేనికోసం అంటే నా భార్యా పిల్లలకోసం అని అంటారు. నాకు నా భార్య పిల్లలు ఎంతవరకు వస్తారు అని ఎవ్వరు ఆలోచించటం లేదు, ఎందుకంటె మనిషిని కమ్మిన మాయ అటువంటి ఆలోచనని రానివ్వడు. ఎప్పుడైతే మనిషి తాను ఈ శరీరం కాదు కేవలం శరీరం నేను వుండే గృహం లాంటిదని అనుకుంటాడో అప్పుడు ఈ బంధాల మాయలోంచి వెలువడుతాడు.  కానీ చిత్రం ఏమిటంటే అరవై దాటినా, దిబ్బయి దాటినా ఇంకా దేహ వ్యామోహం బంధాల మొహం పోవటం లేదు.  ఏమంటారు. 

ఇంకొక సంఘటన ఇక్కడ ప్రస్తావించదలిచాను నాకు ఒక సహృదయుడు మంచి ఆధ్యాత్మిక మిత్రుడు అయ్యారు. ఆయన విగ్రహారాధనను నిరసిస్తూ అది అంతా ఒక ట్రాష్ నిజానికి ఉన్నది ఒక పరబ్రహ్మ ఒక్కటే విగ్రహారాధనతో ఏమి పని అని అన్నారు. నాకు ఆయన ఆలోచనలు చూసి తాను గొప్ప బ్రహ్మ జ్ఞ్యాని అని అనుకున్నాను. మాటల సందర్భంలో నేను ఆయన చేసే సాధనగూర్చి తెలుసుకుకో దాలిచాను.  ఆయన చెప్పింది ఏమిటంటే తానూ ఒక ఐదు సంవత్సరాల తరువాత జ్ఞ్యాన సాధన మొదలు పెడదామనుకున్నాను అని సెలవించారు. ఐదు సంవత్సరాలు ఎందుకు ఆగారో మాత్రం నాకు చెప్పలేదు.  మనం యెంత అమాయకత్వంలో ఉన్నామంటే రేపు ఇది చేద్దాం అది చేద్దాం అని నిత్యం ఆలోచిస్తూ ఆ ఈశ్వర స్మరణ మరచి ఈ ఐహిక వాంఛలతో ఐహిక బంధాలతో నిత్యము కాలం వృధా చేస్తున్నాము.  నిజానికి ఇక్కడ ఎవ్వరికీ తెలియనిది ఒకటి వుంది అదేమంటే నేను అనుకునే ఈ దేహం ఈ జగత్తుది కానీ నాది కాదు.  అటువంటప్పుడు నాది కాని దేహంలో నేను ఎంతకాలం వుంటాను? అనే ఆలోచన మనసులో వెలువడినప్పుడు ప్రతి వారు ఆ దేవా దేవుని వెంటే పరుగులిడుతారు జన్మ రాహిత్యానికి తహ తహ లాడుతారు. 

ఒకసారి నాకు ఒక మంచి ఆధ్యాత్మిక మిత్రుడు తెలిపినది ఏమిటంటే తాను ఒక మంచి గురువు కోసం ఎదురు చూస్తున్నాడట. మీకు తెలుసా గురువే మనలని వెతుకుంటూ వస్తారు అని అయన సెలవిచ్చారు. నిజానికి ప్రతి మనిషిలో ఒక గురువు ఉంటాడు ఆయనే ఆ పరమాత్మ ఎప్పుడైతే మనం ఆ పరమాత్మా చెప్పినట్లు సంచరిస్తూ అరిషడ్వార్గాలను విడనాడి నిధిజాసలో జీవితాన్ని గడుపుతామో అప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచం కారతలామలకాలం అవుతుంది.  నిజమైన యోగి ఈ ప్రపంచం గురించి ఎక్కువగా ఆలోచించాడు, కేవలం కేవలం అంటే తన ఆధ్యాత్మిక ఉన్నతి గూర్చి మాత్రమే చింతన చేస్తాడు.  మన జ్ఞ్యాన బాండాగారైన ఉపనిషత్తులకు మించిన జ్ఞ్యనం  మనకు మరెక్కడ లభించదు.  ఇప్పుడు సద్గురువులని చెప్పుకునే వారు చాలామంది వారే ఐహిక వాంఛలకు దాసులుగా వుంటూ ఖరీదైన జీవనాన్ని గడుపుతున్నారు.  అటువంటప్పుడు మనకు బ్రహ్మ జ్ఞనాన్ని ఎలా ప్రసాదించి గలరు. ముందుగా నేను జ్ఞ్యాన సాధన చేయాలి అప్పుడే నాకు సాధనా మార్గం దొరుకుతుంది అని ప్రారంభిస్తే తప్పకుండ మార్గం దొరుకుతుంది. 

ఇలా నేను చాలామంది మిత్రులతో సంభాషిస్తూ పొతే నాకు తెలిసింది ఏమిటంటే ప్రతి వారు తమకు తాము జ్ఞ్యానులం అని ప్రకటించుకోటానికి గాను గ్రంథ పఠనం చేస్తారా అని నాకు అనిపిస్తున్నది.  ఈ రోజు చాలా మంది కృష్ణ భగవానుని గీత చదవని వారు వున్నారు.  ఇక చదివిన వారు వారికి గీతాజ్ఞానం వున్నదని పలువురికి తెలియచేయటానికి చదువుతున్నారా అని అనిపిస్తున్నది. నీతులు చదివి ఇతరులకు చెప్పటం సులువు కానీ వాటిని ఆచరించటం కష్టం అని ఎవరో అన్నారట. కేవలం గ్రంథ పఠనం లేక తర్కం చేయటంతో ఏమి సాధించలేము.  అసలు మోక్షము అంటే ఏమిటి దానిని ఎలా సాదించాలి అని సాధన చేస్తే కానీ మోక్షం కారతలామలకాలం కాదు. 

మనకు మన హిందూ ధర్మంలో అపారమైన జ్ఞ్యాన సంపద వున్నది. యెంత జ్ఞ్యానం మనకు ఉపలబ్దం అవుతున్నదంటే నాకు తెలిసి ఒక సాధకుడు వేరే ఏ వ్యాపకం లేకుండా కేవలం తన జీవితాన్ని జ్ఞ్యాన సముపార్జనకు కేటాయించినా కూడా ఒక జీవితకాలం సరిపోదు అని అనిపిస్తుంది. 

నాలుగు వేదాలు, వేల సంఖ్యలో ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, రెండు ఇతిహాసాలు, అనేక వేదాంత గ్రంధాలు మరియు అనేక మహర్షులు, జ్ఞ్యానుల ప్రవచనాలు, వ్యాఖ్యానాలు, భాష్యాలు ఇలా అనేక అనేక గ్రంధాలూ కేవలం ఒక్క హిందూ ధర్మంలోనే వున్నాయి. అన్నది సత్యం. నా అభిప్రాయంలో ఇక్కడ సాధకుడు బహు గ్రంథ పఠనం చేయ నవసరం కూడా లేదనిపిస్తుంది.  ఒక్క శ్రీమత్ భగవత్గీతను త్రికరణ శుద్ధిగా చదవండి.  అందులో స్వామి చెప్పిన విషయాలను తు. చ తప్పకుండ ఆచరించండి చాలు జన్మ తరిస్తుంది.  నాడు ధ్యానం చేయటం కష్టం అట్లా నేను నన్ను నియంత్రించుకోలేను అని అంటారా.  వారికి కూడా భగవానులు సరళమైన మార్గం చెప్పారు. 

భగవద్గీత 18-66

సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః || ”

అర్ధం: “ అన్ని ధర్మాలనూ వదిలేసిఎవరిని వారే శరణు వేడుకోవాలి ; అప్పుడు నిన్ను నేను సర్వపాపాలనుంచీ ఉద్ధరిస్తాను. ”

వివరణ: భగవద్గీతను అర్థం చేసుకోవడంలో అనుసరించవలసిన విధానం :

శ్లోకంలోని మొదటి పాదంలోని “ మామేకం శరణం వ్రజ ” లోని “ మామ్ ”

అన్నది ఎవరికి వారు తమకు తాముగా అన్వయించుకోవాలి.

రెండవ పాదంలోని “అహం” శ్రీకృష్ణుడికీశ్రీ వేదవ్యాసులవారికీ,

మరి స్వీయ పరమ ఆత్మకూ అన్వయించుకోవాలి.

“ శరీరం”, “ మనస్సు ”, “ బుద్ధి ”, “ కుటుంబం ” … ఇంకా సామాజికపరంగా

మనం నిర్వర్తించవలసిన అనేక ధర్మాలు ఉన్నాయి … ఉంటాయి.

సర్వధర్మాలనూ వదిలేసి కేవలం ఆత్మధర్మాన్నే నిర్వర్తించమంటున్నారు.

“ మాం ఏకం శరణం వ్రజ ” అంటే అర్థం “ ఎవరి ఆత్మను వారే శరణు వేడుకోవాలి. ”

ఎవరి ఆత్మను వారే శరణు కోరుకోవాలి … మన ధ్యానంలో మనం కూర్చోవాలి.

ఆకలి వేస్తుందిభోంచెయ్యాలి … అది శరీరధర్మం.

నిద్రవస్తుందినిద్రపోవాలి … అది శరీరధర్మం.

నిద్దుర కొంత నిరాకరించాలిఆకలిని కొంత తిరస్కరించాలి … శ్వాసను

చేపట్టాలిశ్వాస మీద ధ్యాస పెట్టాలిధ్యానం చెయ్యాలి … ఇది ఆత్మధర్మం.

సర్వశారీరిక ధర్మాలనూ పరిత్యజించి,

మన ఆత్మధర్మంలో మనం యదావిధిగా ఉండాలి.

అప్పుడు  “ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి ”,

“ నేను నీ సర్వ పాపాలనూ శుద్ధి చేస్తాను ;

అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను ” అంటున్నారు శ్రీకృష్ణులవారు.

ఎవరినివారుఉద్ధరించుకోడానికిఎంతప్రయత్నంచేస్తే

అంత సహాయం మనకు పరమ ఆత్మల నుండి కూడా లభిస్తుంది.

“ ధ్యానం రక్షతి రక్షితం ”… “ ఎవరైతే ధ్యానాన్ని రక్షిస్తారోవారి చేత రక్షింపబడిన ధ్యానమే తిరిగి వారిని రక్షిస్తుంది ”.

మన చేత రక్షింపబడిన ధ్యాన ధర్మమే మనల్ని తిరిగి రక్షిస్తుంది.

ప్రతిరోజు తప్పనిసరిగా శరీరధర్మంకుటుంబ ధర్మం అన్నవాటిని

కొంతప్రక్కన పెట్టి ఆత్మధర్మం చూసుకోవడమే “ మామేకం శరణం వ్రజ ”.

మనచేతనేరక్షించబడినఆఆత్మధ్యానం

మన పాపాలన్నీ పోగొట్టి మోక్షాన్ని ప్రసాదిస్తుంది.

ఒకసారి ఆది శంకరాచార్యులు వీధిలో వెళుతుంటే అరుగుల మీద కూర్చొని కొందరు పిచ్చాపాటి మాట్లాడుకుంటే అప్పుడు శంకరులవారు 

భజగోవిన్దం భజగోవిన్దం

గోవిన్దం భజమూఢమతే .

సంప్రాప్తే సన్నిహితే కాలే

నహి నహి రక్షతి డుకృఞ్కరణే .. ..

 

మూఢ జహీహి ధనాగమతృష్ణాం

కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్ .

యల్లభసే నిజకర్మోపాత్తం

విత్తం తేన వినోదయ చిత్తమ్ .. ..(పూర్తి శ్లోకాల కోసం ఇక్కడ క్లిక్ https://kavulu.blogspot.com/2021/08/blog-post_255.html  చేయండి ) 

అని ఓ మూఢ మతి తెలుసుకో అని వేదాంత సారాన్ని శ్లోకాలలో వివరించారు.  ఇప్పుడు మనకు జ్ఞ్యానబిక్ష పెట్టటానికి అది శంకరులు మన వద్ద లేరు. ఇప్పుడు వున్న  ప్రవచనకారులు కేవలం వారి జ్ఞానాన్ని భక్తి మార్గం వరకు పరిమితం చేసుకున్నారు.  అంతేకాక వారు విగ్రహారాధనే సర్వ శ్రేష్టమైనదని జ్ఞానులు కూడా తప్పకుండ విగ్రహారాధన చేయాలి అన్నట్లు వున్నది వారి భావం. 

ఈ దేహం శాస్వితంకాదు ప్రతి క్షణం గడచినా కొద్దీ నేను మృతువుకు ఒక్కో క్షణం దగ్గరవుతున్నాను అనే భావన మనలో కలగటంలేదు. తాత్కాలికమైన భోగాలకు, సుఖాలకు శరీరం అలవాటు పడి సర్వ వ్యాపకుడైన ఆ ఈశ్వరుణ్ణి మరచి పోతున్నాము. మన రోజులో ప్రతి క్షణం విలువైనదని, దానిని మనం ఆత్మజ్ఞాన సముపార్జనతోనే సార్ధకం చేసుకోవాలనే సత్యాన్ని మరచి పోతున్నాము. సగానికి సగం మంది కేవలము తమ ఐహిక సుఖాలకోసం మాత్రమే ఒక పక్షివలె, చిమవలే జీవిస్తున్నారు. ఇక చాలామంది వారి అమూల్య కాలాన్ని విగ్రహారాధనలతో, పూజలతో పుణ్యక్షేత్రదర్శనాలతో గడుపుతూ అదే పరమార్ధం అని అనుకుంటున్నారు. పరబ్రహ్మతన హృదయ కుహరంలో ఉంటే అక్కడ చూడటానికి ప్రయత్నించకుండా బాహ్యంగా వెతుకుతూ వారి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. 

బాల్య యవ్వనప్రాయంలో ఐహిక వాంఛలు ఉండటం సర్వ సహజం కానీ అరవై దాటినవారు కూడా ఇంకా జీవితాన్ని ఐహిక సంతోషాలతో గడపాలనుకోటం ఆశ్చర్యాన్ని కలుగ చేస్తుంది. మిత్రులారా ఇప్పుడే ఈ గాఢనిద్రలోంచి లేవండి నిత్యుడు, సత్యుడు సర్వత్రుడు ఐన ఆ పరబ్రహ్మను కనుగొనటానికి ఇప్పుడే వుద్యుత్తులు కండి.  కనీసం మనం ఈ జన్మలోనైనా సాధన మొదలు పెడితే వచ్చే జన్మలలోనయినా మనకు మోక్ష ప్రాప్తి కలుగ వచ్చు. ఇంకా ఎన్నాళ్ళు ఈ చేరాచర సృష్టిలో పరిభ్రమిస్తూ మన కాలాన్ని వృధా చేసుకుందాము. 

ఆలోచించండి. మేల్కొనండి. 

జిజ్ఞాసువులారా సదా జ్ఞాన సముపార్జనలో జీవితాన్ని గడుపుదాము, మోక్ష ప్రాప్తికి ప్రయత్నిద్దాము . 

ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

సుబుధజన విధేయుడు 

భార్గవ శర్మ 






కామెంట్‌లు లేవు: