30, ఆగస్టు 2021, సోమవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

 *30.08.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - మూడవ అధ్యాయము*


*భగవదవతారముల వర్ణన*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*3.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*


*శుచిః సమ్ముఖమాసీనః ప్రాణసంయమనాదిభిః|*


*పిండం విశోధ్య| సన్న్యాసకృతరక్షోఽర్చయేద్ధరిమ్॥12294॥*


సాధకుడు స్నానాదులచేత శరీరమును, సంతోషాదులచేత అంతఃకరణమును, పరిశుద్ధమొనర్ఛుకొని, భగవంతుని విగ్రహము ముందు ఆసీనుడు కావలెను. ప్రాణాయామాదులచేత నాడీశోధన గావించుకొనవలయును. నిర్దిష్టముగా మంత్రపూర్వకముగా అంగన్యాసకరన్యాస విధులను అనుష్ఠించి పరమేశ్వరుని ఆరాధింపవలయును.


*3.50 (ఏబదియవ శ్లోకము)*


*అర్చాదౌ హృదయే చాపి యథా లబ్ధోపచారకైః|*


*ద్రవ్యక్షిత్యాత్మలింగాని నిష్పాద్య ప్రోక్ష్య చాఽఽసనమ్॥12296॥*


*3.51 (ఏబది ఒకటవ శ్లోకము)*


*పాద్యాదీనుపకల్ప్యాథ సన్నిధాప్య సమాహితః|*


*హృదాదిభిః కృతన్యాసో మూలమంత్రేణ చార్చయేత్॥12296॥*


సాధకుడు స్వయముగా స్నానాది కృత్యములద్వారా తాను పరిశుద్ధుడై, తాను పూజింప దలచిన భగవద్విగ్రహమును సిద్ధముగా నుంచుకొనవలెను. శుద్ధిచేసిన పూజాస్థలమునందు అర్చామూర్తిని నిలుపవలెను. హృదయము నందు భగవంతుని ధ్యానించుకొని, ఆ విగ్రహమునందు పరమేశ్వరుని భావింపవలెను. సమయానుకూలముగా లభించిన పూజాద్రవ్యములను సమకూర్చుకొనవలెను. అర్చామూర్తిని జలములతో శుద్ధిచేయవలెను. ఆసనము మీదను, తనపైనను నిర్మలోదకములచే ప్రోక్షణ చేసికొనవలెను. పిదప అర్ఘ్యపాద్యాదులను, ధూపదీపములను, నైవేద్యములను అర్చామూర్తికి ఎదురుగా నుంచవలయును. అంగన్యాసములను, కరన్యాసములను, హృదయాది న్యాసములను ఆచరింపవలెను. పిదప మూలమంత్రముతో ఇష్టదైవమును (అర్చామూర్తిని) ఆరాధింపవలెను.


*3.52 (ఏబది రెండవ శ్లోకము)*


*సాంగోపాంగాం సపార్షదాం తాం తాం మూర్తిం స్వమంత్రతః|*


*పాద్యార్ఘ్యాచమనీయాద్యైః స్నానవాసోవిభూషణైః॥12297॥*


*3.53 (ఏబది మూడవ శ్లోకము)*


*గంధమాల్యాక్షతస్రగ్భిర్ధూపదీపోపహారకైః|*


*సాంగం సంపూజ్య విధివత్స్తవైః స్తుత్వా నమేద్ధరిమ్॥12298॥*


అనంతరము సాధకుడు ఆయుధాది ఉపాంగసహితునిగా, పార్షదసమేతునిగా తన ఇష్టదైవమును అర్చామూర్తిలో మూలమంత్ర పూర్వకముగా ఆవాహన చేయవలెను. పిమ్మట పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, మధుపర్కము, స్నానము, వస్త్రము, ఆభూషణములు, గంధపుష్పములు, అక్షతలు, తిలకము, మాలలు, ధూపదీపనైవేద్యములు మొదలగువాటితో ఆ దైవమును విధ్యుక్తముగా పూజింపవలెను. స్తోత్రములద్వారా స్తుతించుచు, శ్రీమన్నారాయణునకు సపరివారముగా ప్రణమిల్లవలెను.


*3.54 (ఏబది నాలుగవ శ్లోకము)*


*ఆత్మానం తన్మయం ధ్యాయన్ మూర్తిం సంపూజయేద్ధరేః|*


*శేషామాధాయ శిరసి స్వధామ్న్యుద్వాస్య సత్కృతమ్॥12299॥*


పిదప ఆరాధ్యమూర్తిని తన ఆత్మలో అంతర్యామిగా ధ్యానింపవలెను. భగవన్నివేదితమైన ప్రసాదమును భక్తిపూర్వకముగా స్వీకరింపవలెను. భగవత్పాదములయందు సమర్పింపబడిన పుష్పాదులను శిరమున దాల్చవలయును. పిమ్మట ఉద్వాసనపూర్వకముగా స్వామిని యథాస్థానమున నిలిపి, పూజావిధిని ముగింపవలెను.


*3.55 (ఏబది ఐదవ శ్లోకము)*


*ఏవమగ్న్యర్కతోయాదావతిథౌ హృదయే చ యః|*


*యజతీశ్వరమాత్మానమచిరాన్ముచ్యతే హి సః॥12300॥*


ఇట్లు సాధకుడు హృదయ పూర్వకముగా అగ్నియందును, సూర్యునియందును, జలములయందును, అతిథులయందును, శ్రీహరిని భావించి పూజింపవలయును. అట్లొనర్చినచో అచిరకాలములోనే అతనికి ముక్తి లభించును.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే తృతీయోఽధ్యాయః (3)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *భగవదవతారముల వర్ణన* అను

మూడవ అధ్యాయము (3)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

కామెంట్‌లు లేవు: