30, ఆగస్టు 2021, సోమవారం

వీలునామా

 వీలునామా


*


"మనింట్లో మనం ఉంటూ అద్దె కట్టడమేంటండి? మాఁవయ్య గారికి ఛాదస్తం పెరుగుతున్నట్లుంది" అంటోంది సునంద.


"మనిల్లు కాదు, ఇది నాన్న గారు లోను తీసుకుని కట్టుకున్న ఇల్లు" సమాధాన పరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు సుశాంత్.


"ఆయనదైతే మాత్రం .... ఆయన తరువాత మీకే కదా వచ్చేది?"


" 'ఆయన తరువాత' అన్నమాట మరొకసారి అనొద్దు సునంద" గొంతు పెంచుతూ అన్నాడు సుశాంత్ 


"ముందే అనుకోకపోతే మా బాబాయి వాళ్ళ పిల్లల్లాగే కొట్టుకు చావాలి" అంటూ సోదాహరణంగా సుశాంత్ మనసు మార్చేందుకు ప్రయత్నం చేస్తోంది సునంద.


"మీ బాబాయికి ఉన్నది ఐదొందల గజాల స్థలం .... అందులో ఇల్లు. నలుగురు సంతానం. పైగా ఆ స్థలం వాళ్ళ నాన్న గారి నుంచి వారసత్వంగా వచ్చింది కాబట్టి కొడుకులందరూ కలసి ఆయన్ని ఏడిపించారు. ఇప్పుడు చూడు ఏమయిందో? ఆ ఐదొందల గజాల కోసం అందరూ కోర్టుకు పోయారు. పోనీ మధ్యవర్తిత్వం చేద్దామంటే ఆ పెద్దాడికి అసలు మన పొడే గిట్టదు ...."


"అందుకే చెప్పేది .... ఇల్లు ముందుగా మన పేరు మీద రాయించేసుకుంటే .... " అంటూండగానే సుశాంత్ అనేసాడు ....


"ఆ తరువాత నా బుధ్ధి మారి ఆయన్ని వేరే వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాడు ఈ వయసులో?" అన్నాడు .... సునంద మనసులో విషయం తన మాటగా చెబుతూ ...,


"అదీగాక ఈ ఇంట్లో చెట్లు, మొక్కలు ఆయన ప్రాణం. రోజూ చూస్తున్నావ్ కదా, ఎంత శ్రధ్ధగా వాటిని చూసుకుంటారో?" అంటూ తండ్రిని సమర్ధిస్తూ మాట్లాడాడు సుశాంత్ 


"ఎంత సేపటికీ మీకు మీ నాన్న గారి ఆలోచనే కానీ నా మనసులో ఆలోచన మాత్రం పట్టదు ...." మూతి వరిచింది సునంద.


ఆమె మనసులోని మాట అతడికి తెలుసు. అందుకే తండ్రికి అద్దె కట్టి మేడ మీద ఉండటానికే నిశ్చయించుకున్నాడు. తమ ఇంటికి తామే అద్దె కట్టడం మాత్రం ఆమెకు సుతరామూ ఇష్టం లేక పోయింది.


"అద్దె డబ్బులు ఏం చేసుకుంటారట? రోజూ వండి పెడుతున్నా కదా?" అంటూ మళ్ళీ మొదలు పెట్టింది సునంద.


"చాల్లే .... నీ వంట సంగతే చెప్పు. వారంలో రెండు, మూడు రోజులు బైట నుండి తెప్పిస్తావు. ఆ తిండి ఆయనకు సయించదు. మొదటినుండి అమ్మ చేతి వంట అలవాటైన మనిషి. ఆ బైట తిండి తింటే ఈ వయసులో మంచిది కాదు కూడా" అంటూ సమాధానం చెప్పాడు. 


ఈ మాటతో సునందకు ఎక్కడలేని రోషం వచ్చింది. 


"అంటే మీ ఉద్దేశ్యంలో నాకు వంట రాదనా?" 


"వంట రాదనలేదు. బైటనుండి తెప్పించే ఆహారం ఆయనకు పెట్టొద్దు అని అంటున్నాను" అన్నాడు సుశాంత్ 


"దానికీ, మన అద్దెకు ఏంటి సంబంధం?" అంటూ మళ్ళీ మొదటికే వచ్చింది సునంద.


"ఆయనకు అద్దె కడితే వంట మనిషిని పెట్టుకుని ఆయనకు కావలసినట్లు చేయించుకుంటాడు. నాకెలాగూ నీ చేతి ముద్ద తప్పదనుకో" అన్నాడు సుశాంత్ 


"మరైతే ఆయనకు అద్దె కడితే ఆయన కోసం వంట చెయ్యనని చెప్పేయండి .... ఐనా కొడుకు దగ్గర అద్దె వసూలు చేసే తండ్రిని ఈయన్నే చూస్తున్నా" అంటూ సాగతీసింది సునంద.


మరేమీ మాట్లాడలేదు సుశాంత్. తండ్రికి ఎలా చెప్పాలో ప్లాన్ వేసుకున్నాడు.


*


"ఏరా ఇలా వచ్చావ్? అద్దె విషయం ఏం చేద్దాం అనుకుంటున్నావ్? అనడిగారు సుశాంత్ తండ్రి సుబ్రమణ్యం గారు.


"అదే నాన్నా .... ఆ విషయం మాట్లాడదామనే వచ్చాను. సునంద విషయం తెలిసిందే కదా, మన ఇంటికి మనం అద్దె కట్టడం ఏంటంటోంది. ఒక వేళ అద్దె కట్టేట్టయితే మీ వంట సంగతి మిమ్మల్నే చూసుకోమని అంటోంది ...."


"నెత్తిన పాలు పోసిందిరా నీ భార్య .... ఇవాళనుండి అద్దె ఇరవై వేలు. ఎడ్వాన్సుగా రెండు నెలల అద్దె ఇచ్చేసి వెళ్ళు. గోడలకు మేకులు కొడితే మేకుకి రెండొందలు ఎక్స్ట్రా కట్టాలి. చిన్న చిన్న రిపేర్లొస్తే నువ్వే చేయించుకోవాలి" అన్నారు సుబ్రమణ్యం గారు.


అన్నిటికీ ఒప్పుకున్న సుశాంత్ అప్పటికప్పుడు నలభై వేలు ఆయనకు తన మొబైల్ నుండి బదిలీ చేసాడు.


మేడ మీదకు రాగానే చెప్పాడు సుశాంత్ నాన్న గారికి వంట చెయ్యనవసరం లేదని.


"అద్దె ఇచ్చారా?" అనడిగింది సునంద.


"ఇచ్చాను"


"ఎంత?" 


"నెలకి ఇరవై వేలు" అని చెప్పాడు సుశాంత్ 


"ఇరవయ్యా? ఇరవై వేలు పెడితే ఇంతకంటే మంచి కొంపే దొరికేది. ఐనా ఈ వయసులో ఆయన అంత డబ్బు ఏం చేసుకుంటాడండి, మరీ కాపీనం కాకపోతే?" అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది సునంద.


"వంట వాడికి జీతం ఇవ్వాలి కదా? అదీ కాక ఆయన పెన్షను సరిపోవడం లేదట. నన్ను డబ్బు అడగడానికి మొహమాట పడుతున్నారు. అందుకే అద్దె కట్టమన్నారు. ఐనా మనం ఆయనతో కలసి ఉండటం లేదు. మేడ మీద విడిగా ఉంటున్నాం. అది మరచిపోకు" అని సున్నితంగా హెచ్చరించాడు సుశాంత్ 


*


నాలుగు రోజులు గడిచాయి. ఉదయం నిద్ర లేచిన సునందకు ఇంటి ఆవరణ అంతా సందడిగా అనిపించింది. 


'ఏఁవిటో హడావాడి?' అనుకుంటూ బాల్కనీలోకి వచ్చి చూసింది.


చాలామంది వృధ్ధులు .... అందరూ పెద్దవాళ్ళే .... ఆవరణలో సందడిగా మొక్కల మధ్య చెట్ల కింద తిరుగుతున్నారు.


బాల్కనీలోనుండి లోపలకొచ్చిన సునంద భర్తను లేపి విషయం చెప్పింది.


సుశాంత్ కూడా వచ్చి చూసాడు. అతడికీ అర్ధం కాలేదు. మొహం కడుక్కుని కిందకు వచ్చాడు. 


నాన్న గారి దగ్గరకు చేరి "ఏంటి నాన్న విషయం, అంతా సందడిగా ఉంది?" అని.


"వీళ్ళందరూ బిడ్డలనుండి దూరంగా ఉంచబడిన తల్లిదండ్రులురా .... వీళ్ళు నాకు తోడుగా ఉంటారని తెచ్చుకున్నాను" అన్న నాన్న గారి మాటలు మొదట అర్ధం కాకపోయినా ఆయన సంగతి తెలుసు కాబట్టి పక్కకు తీసుకువెళ్ళి అడిగాడు.


"ఔన్రా సుశీ .... నాకు ఈ వయసులో నువ్వు, కోడలు తప్ప ఎవరూ లేరు. ఆ అమ్మాయికి నేనంటే ఎందుకో నచ్చదు. తన కారణాలు తనకు ఉండి ఉండవచ్చు. ఆ కారణాల వల్ల నీవు అమ్మాయి పోట్లాడుకోవడం, ఈ వయసులో నాకు ఇవన్నీ అవసరమా? అందుకే 'వీలునామా' రాసాను" అన్నారు సుబ్రమణ్యం గారు.


"వీలునామానా?" ఆశ్చర్యంగా అడిగాడు సుశాంత్.


"ఔన్రా .... నేను బతికున్నంత కాలం ఈ ఇంట్లో ఉన్నందుకు నువ్వు అద్దె కట్టాలి. నా అనంతరం కింద భాగం ఈ వృధ్ధులు ఉండటానికి నువ్వు అనుమతి ఇవ్వాలి. అలాగే ఇరవై వేలు అద్దె కూడా కట్టాలి. ఏ రోజైనా వీళ్ళను ఖాళీ చేయించే ప్రయత్నం చేసావంటే ఆస్థి మొత్తం వయో వృధ్ధుల ఆశ్రమానికి వెళ్ళిపోతుంది" అంటూ 'వీలునామా'లోని ముఖ్యమైన అంశాలు వివరించారు సుబ్రమణ్యం గారు.


తిరిగి వెళ్తున్న సుశాంత్ ని పిలిచి మరొక మాట కూడా చెప్పారు .... "ఈ 'వీలునామా' నేను ఎప్పుడైనా మార్చుకునేందుకు హక్కు నాకు ఉంది" అంటూ.


*


పది నిముషాలలో అందరికీ 'కాఫీ' తీసుకొచ్చింది సునంద.


"మాఁవయ్య గారు .... ఈ వయసులో మీకెందుకండి ఈ బరువు బాధ్యతలు? నేను, ఆయన చూసుకుంటాం కదా? మీరు వాళ్ళ సంగతి మరచిపొండి" అంటూ చేతికి 'కాఫీ' కప్పు అందించింది సునంద.


ఏనాడూ చేతికి 'కాఫీ' కప్పు ఇవ్వని కోడలు అలా చేతికి ఇచ్చేసరికి నవ్వుకున్నారు సుబ్రమణ్యం గారు.


'వీలునామా మార్చుకునే హక్కు ఉంది' అనే మాట వినేసరికి కోడలికి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చినట్లుంది. ఆ మార్పు ఎటైనా మార్చవచ్చు అన్న సంగతి తెలిస్తే కనీసం ఈ 'కాఫీ' నీళ్ళు కూడా ఇవ్వదు' అనుకున్నారు సుబ్రమణ్యం గారు .... #రాయని_వీలునామా గురించి ఆలోచిస్తూ.


పైనుండి సుశాంత్ నవ్వుతూ చూస్తున్నాడు .... నాన్న గారి 'ఏ కీలుకి ఆ కీలు విరిచే వకీలత్వా'న్ని తలచుకుంటూ ....


*************************** (శుభం)


రచన : అధరాపురపు మురళీ కృష్ణ, గుంటూరు

కామెంట్‌లు లేవు: