30, ఆగస్టు 2021, సోమవారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*401వ నామ మంత్రము* 30.8.2021


*ఓం వివిధాకారాయై నమఃః*


నామరూపాత్మకంగా జగత్తంతా వివిధ ఆకారములతో వ్యాపించి ఉన్న పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *వివిధాకారా* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం వివిధాకారాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరాశక్తిని ఉపాసించు సాధకులకు ఆ తల్లి సర్వాభీష్టసిద్ధిని అనుగ్రహించును.


జగన్మాత సర్వదేవతా స్వరూపిణి. జగత్తంతా వివిధ ఆకారములతో, వివిధ నామాలతో వ్యాపించి ఉన్నది. అన్ని రూపాలు ఆ పరమేశ్వరివే. పంచవింశతి (ఇరువది ఐదు) తత్త్వములు ఆ జగన్మాత రూపములే. 

  

*ఇరువది ఐదు తత్త్వములు*: 1. ప్రకృతి, 2. పురుషుడు, 3. బుద్ధి (మహత్తత్త్వము), 4. అహంకారము, 5. మనస్సు, పంచజ్ఞానేంద్రియములు (1. శ్రోత్రము, 2. చర్మము, 3. చక్షుస్సు, 4. జిహ్వ, 5. నాసిక), పంచ కర్మేంద్రియములు (1. వాక్కు, 2. హస్తములు, 3. పాదములు, 4. పాయువు, 5. ఉపస్థ), పంచ మహాభూతములు (1. పృథివి, 2. జలము, 3. తేజస్సు, 4. వాయువు, 5. ఆకాశము), పంచ తన్మాత్రలు (రూపము, 2. రసము, 3. గంధము, 4. స్పర్శ, 5. శబ్దము).


శక్తి పీఠాలలో వివిధ నామాలతో మరియు వివిధ రూపాలతో విరాజిల్లుచున్నది పరమేశ్వరి గనుకనే ఆ తల్లి *వివిధాకారా* యని అనబడినది.


కొండలలో కొండదేవతగా, గ్రామాలలో గ్రామదేవతగా, ఎవరు ఏరూపంతో, ఏ నామంతో కొలిస్తే అలాగే అమ్మవారు వారి మనో నేత్రాలలో దర్శనమిస్తుంది గనుకనే ఆ పరమేశ్వరి *వివిధాకారా* యని అనబడినది.


ఆభరణములు ఎన్నో ఆకారాలు, ఎన్నో నామాలతో ఉంటాయి. కాని వాటిలో ఉండేది బంగారమే అని అనినట్లే, ఎన్ని నామాలు, ఎన్ని రూపాలతో ఆ పరమేశ్వరి ఉన్నను, వాటి అన్నిటిలోని దేవతా మూర్తి ఆ పరమేశ్వరియే. గనుకనే ఆ అమ్మవారు *వివిధాకారా* యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం వివిధాకారాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: