మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
*భక్తి విశ్వాసాలు..*
చెన్నై లో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం గారు అప్పటికి ఐదు ఆదివారాలు క్రమం తప్పకుండా మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని తిరిగి వెళుతున్నారు..ఆదివారం నాడు ఉదయం తొమ్మిదిన్నర కు బస్ దిగి..మందిరం లో ఉన్న కుళాయిల దగ్గరకు వెళ్లి..శుభ్రంగా కాళ్ళూ చేతులూ కడుగుకొని..అర్చన టికెట్ కొనుక్కొని..అర్చన చేయించుకొని..మధ్యాహ్నం హారతి చూసుకొని..అన్నదాన సత్రానికి వెళ్లి..భోజనం చేసి..తిరిగి రెండుగంటలకు వెళ్లే బస్ లో బయలుదేరి సాయంత్రం రైలులో చెన్నై వెళుతున్నారు..వారితో అంతకు ముందు పరిచయం లేని కారణంగా మేమూ అందరి భక్తుల మాదిరి భావించాము..
ఆ ప్రక్కవారం మాత్రం..శనివారం నాటి సాయంకాలమే సుబ్రహ్మణ్యం గారు వచ్చారు..వస్తూ వస్తూ తనతో పాటు తన భార్యా కూతురు తో సహా వచ్చారు..రాత్రికి బస చేయడానికి ఒక రూము కావాలని నన్ను అడిగారు..2008..2009 ప్రాంతాల్లో..రూముల కొరకు ఇప్పుడున్నంత వత్తిడి మాపై లేని కారణంగా..వారికి రూము కేటాయించాము..అప్పుడే వారి గురించి వివరాలు తెలిసింది..
సుబ్రహ్మణ్యం గారు దత్త భక్తులు..తన భార్య ఆరోగ్యం, కూతురు వివాహం..ఈ రెండూ ఆయనకు సమస్యలుగా ఉన్నాయి..భార్యకు తరచూ కడుపులో నొప్పి లాగా వస్తోంది..డాక్టర్లకు చూపించారు..మందులూ వాడారు..తాత్కాలిక ఉపశమనం కలుగుతున్నది కానీ..వ్యాధి పూర్తిగా నయం కావడం లేదు..ఆ సమస్యతో సతమతం అవుతూ వున్నారు..ఈలోపల కూతురికి వివాహం కొరకు సంబంధం వచ్చింది..ఇరువైపులా అన్ని విషయాలూ మాట్లాడుకున్నారు..నిశ్చయ తాంబూలాలు కూడా ఇచ్చి పుచ్చుకున్నారు..అంతా సవ్యంగా ఉన్నది అనుకునే సమయానికి..అబ్బాయి తరఫు వాళ్ళు ఈ సంబంధం తమకు వద్దు అని వెనక్కు వెళ్లారు..సుబ్రహ్మణ్యం గారిని ఆ విషయం తీవ్రంగా కలచి వేసింది..మనసుకు శాంతి లేకుండా పోయింది..
ఆ ప్రక్కరోజు, నెల్లూరు రావడానికి రైలులో ప్రయాణిస్తుంటే..శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారి శిష్యుడొకరు వారికి పరిచయం కావడం జరిగింది..వారి వద్ద ఉన్న మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పుస్తకాన్ని చూసి..కుతూహలం కొద్దీ తీసుకొని..దానిని చదవడం జరిగింది..మొగలిచెర్ల కు వెళ్లి వస్తే బాగుండు అని మనసుకు తోచి..ఒక ఆదివారం నాడు రైలులో సింగరాయకొండ వచ్చి..అక్కడనుంచి కందుకూరు మీదుగా మొగలిచెర్ల వచ్చేసారు..అలా మిగిలిన నాలుగు వారాలూ ఒక్కరే వచ్చారు..ఈ విషయం విన్న భార్యా కూతురు కూడా తామూ వస్తామన్నారు..వాళ్ళనూ వెంటబెట్టుకొని వచ్చేసారు..
ఆరోజు సాయంత్రం ఆ కుటుంబం శ్రీ స్వామివారి పల్లకీ సేవ లో పాల్గొన్నారు..ఆ రాత్రికి మందిరం లోనే నిద్ర చేసారు.. ఆదివారం నాడు శ్రీ స్వామివారి విగ్రహానికి అర్చన చేయించుకొని..సమాధి వద్ద..తమ సమస్యలు తీర్చమని మనసారా మ్రొక్కుకొని, నమస్కారం చేసుకొని..మంటపం లో కొద్దిసేపు కూర్చుని..తిరిగి వెళ్లిపోయారు..
చిత్రంగా ఆ రెండు రోజులూ సుబ్రహ్మణ్యం గారి భార్యకు కడుపులో నొప్పి రాలేదు..ఆ ప్రక్కరోజు..అమ్మాయికి సంబంధం మాట్లాడిన మధ్యవర్తి సుబ్రహ్మణ్యం గారి వద్దకు వచ్చి..అమ్మాయికి మరో సంబంధం చూశాననీ..వివరాలు ఇచ్చాడు..మరో రెండు రోజులకల్లా ఆ సంబంధం కుదరడమూ జరిగిపోయింది..అబ్బాయి విదేశం లో ఉద్యోగం చేస్తున్నందున..త్వరగా ముహూర్తం చూసి పెళ్లి చేయమని వాళ్ళు కోరారు..నెల లోపే వివాహం జరిగిపోయింది..ఈ పెళ్లి తతంగం జరిగినంత కాలమూ..ఆవిడ ఆరోగ్యం ఏ ఇబ్బందీ పెట్టలేదు..అప్పుడే కాదు..మరెన్నడూ ఆవిడ కడుపులో నొప్పితో బాధ పడలేదు..సుబ్రహ్మణ్యం గారి రెండు సమస్యలూ తీరిపోయాయి..
శ్రీ స్వామివారి ని నమ్మి కొలిచినందుకే తన కష్టాలు గట్టెక్కాయని సుబ్రహ్మణ్యం గారు తరచూ అందరితో చెప్పుకునేవారు..అమ్మాయి కాపురానికి వెళ్లిన ప్రక్క ఆదివారం నాడు, శ్రీ స్వామివారి మందిరం వద్ద సుబ్రహ్మణ్యం గారు అన్నదానం చేసారు..ఆ తరువాత నుంచీ , ప్రతిసంవత్సరమూ శ్రీ స్వామివారి సమాధి దర్శనానికి ఆ దంపతులు వచ్చి వెళ్లడం ఒక ఆనవాయితీగా మారిపోయింది..
భక్తి విశ్వాసాల ఫలితం ఎలా ఉంటుందో మరోసారి ఋజువు అయింది..
సర్వం..
శ్రీ దత్తకృప.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114...సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి