*19.10.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పదిహేడవ అధ్యాయము*
*వర్ణాశ్రమ ధర్మ నిరూపణము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీభగవానువాచ*
*17.9 (తొమ్మిదవ శ్లోకము)*
*ధర్మ్య ఏష తవ ప్రశ్నో నైఃశ్రేయసకరో నృణామ్|*
*వర్ణాశ్రమాచారవతాం తముద్ధవ నిబోధ మే॥12863॥*
*శ్రీభగవానుడు నుడివెను* ఉద్ధవా! లోకహితమునకై నీవు అడిగిన ఈ ప్రశ్న మిగుల ధర్మబద్ధమైనది. వర్ణాశ్రమ ధర్మములను, ఆచారములను పాటించునట్టి వారికి శ్రేయస్కరమైన విహిత ధర్మములను గురుంచి తెలిపెదను వినుము-
*17.10 (పదియవ శ్లోకము)*
*ఆదౌ కృతయుగే వర్ణో నృణాం హంస ఇతి స్మృతః|*
*కృతకృత్యాః ప్రజా జాత్యా తస్మాత్కృతయుగం విదుః॥12864॥*
ఈ కల్పప్రారంభమున కృతయుగమునందు మానవులలో *హంస* అను వర్ణము మాత్రమే యుండెను (హంస అనగా బ్రాహ్మణ వర్ణము). అప్పటి ప్రజలు జన్మచే కృతకృత్యులై యుండిరి. అందువలన దానిని *కృతయుగము* గా భావించిరి.
*17.11 (పదకొండవ శ్లోకము)*
*వేదః ప్రణవ ఏవాగ్రే ధర్మోఽహం వృషరూపధృక్|*
*ఉపాసతే తపోనిష్ఠా హంసం మాం ముక్తకిల్బిషాః॥12865॥*
అప్పుడు ప్రణవమే (ఓంకారమే) వేదముగా నుండెను. విభాగములు లేకుండెను. తపస్సు, శౌచము, దయ, సత్యము అను చరణములతోగూడిన ధర్మముగా నేను వృషభరూపధారినై ఉంటిని. ఆ కాలమున పాపరహితులు, తపస్సంపన్నులు ఐన భక్తులు నన్ను హంసరూపమున ఉపాసించుచుండిరి.
*17.12 (పండ్రెండవ శ్లోకము)*
*త్రేతాముఖే మహాభాగ ప్రాణాన్ మే హృదయాత్త్రయీ|*
*విద్యా ప్రాదురభూత్తస్యా అహమాసం త్రివృన్మఖః॥12866॥*
మహాత్మా! ఉద్ధవా! కృతయుగానంతరము, త్రేతాయుగ ప్రారంభమున నా హృదయమునుండి ప్రాణములద్వారా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అను మూడును ప్రకటితములైనవి. ఆ మూడు వేదములనుండి *హోత, అధ్వర్యువు, ఉద్గాత* అను మూడు కర్మరూప భేదములచే నేను యజ్ఞపురుషునిగా వెలువడితిని.
*17.13 (పదమూడవ శ్లోకము)*
*విప్రక్షత్రియవిట్ శూద్రా ముఖబాహూరుపాదజాః|*
*వైరాజాత్పురుషాజ్జాతా య ఆత్మాచరలక్షణాః॥12867॥*
యజ్ఞపురుషుడనైన (విరాట్ పురుషుడనైన) నా యొక్క ముఖమునుండి బ్రాహ్మణులు, బాహువులనుండి క్షత్రియులు, ఊరువులనుండి వైశ్యులు, పాదములనుండి శూద్రులు ఉద్భవించిరి. వారి వారి స్వభావములను అనుసరించి, ఆయా ఆచారములు, లక్షణములు కుదురుకొనినవి.
*17.14 (పదునాలుగవ శ్లోకము)*
*గృహాశ్రమో జఘనతో బ్రహ్మచర్యం హృదో మమ|*
*వక్షఃస్థలాద్వనే వాసః న్యాసఃశీర్షణి సంస్థితః॥12868॥*
విరాట్ పురుషుడనైన ( చతుర్ముఖ స్వరూపుడనైన) నాయొక్క కటిప్రదేశమునుండి గృహస్థాశ్రమము, హృదయమునుండి బ్రహ్మచర్యాశ్రమము, వక్షస్థలమునుండి వానప్రస్థాశ్రమము, శిరస్సునుండి సన్న్యాసాశ్రమము ప్రకటమైనవి.
*17.15 (పదిహేనవ శ్లోకము)*
*వర్ణానామాశ్రమాణాం చ జన్మభూమ్యనుసారిణీః|*
*ఆసన్ ప్రకృతయో నౄణాం నీచైర్నీచోత్తమోత్తమాః॥12869॥*
చతుర్విధ వర్ణాశ్రమములకు చెందిన పురుషులయొక్క స్వభావములు వారి వారి జన్మస్థానములైన విరాట్ పురుషుని అంగములను అనుసరించి ఉత్తమ, మధ్యమ, అధమములుగా పేర్కొనబడినవి. అనగా ఉత్తమ స్థానముల నుండి ఉత్పన్నమైన వారియొక్క వర్ణాశ్రమముల స్వభావములు ఉత్తమములుగా, అధమ స్థానములనుండి ఉత్పన్నములైన వారియొక్క వర్ణాశ్రమములు అధమములుగా భావింపబడినవి.
*17.16 (పదహారవ శ్లోకము)*
*శమో దమస్తపః శౌచం సంతోషః క్షాంతిరార్జవమ్|*
*మద్భక్తిశ్చ దయా సత్యం బ్రహ్మప్రకృతయస్త్విమాః॥12871॥*
శమము (అంతఃకరణ నిగ్రహము), దమము (బాహ్యేంద్రియ నిగ్రహము) , తపస్సు (ధర్మములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించుట), శౌచము (బాహ్యాభ్యంతరముల శుచిత్వము), సంతోషము (దైవికముగా ప్రాప్తించినదానితో తృప్తిచెందుట), క్షాంతి (ఇతరుల అపరాధములను క్షమించుట, ఇతరులు బాధించినను కలత చెందకుండుట). ఆర్జవము (ఋజుమార్గజీవనము), దైవభక్తి, దయ, సత్యము - ఇవి యన్నియును బ్రాహ్మణవర్ణము వారి స్వాభావిక లక్షణములు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదిహేడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి