19, అక్టోబర్ 2021, మంగళవారం

మొగలిచెర్ల

 *స్వామి ఇచ్చిన మాట..*


"సీతారాంపురం నుంచి కోటయ్యను మాట్లాడుతున్నాను..ఈమధ్య నువ్వు నువ్వు హైదరాబాద్ వెళ్ళావని చెప్పారు..హైదరాబాద్ నుంచి వచ్చేసావా..?రేపు పొద్దున గుడికొస్తావా? మేము పొద్దున్నే వస్తామయ్యా" అంటూ గుక్క తిప్పుకోకుండా గబ గబ సెల్ లో ఆ పెద్దాయన చెప్పుకుపోతున్నాడు..


ఆయన ఫలానా అని గుర్తుకుతెచ్చుకోవడానికి కొద్దీ సమయం పట్టింది నాకు..

ప్రకాశం జిల్లా, గుడ్లూరు మండలం పూరేటి పల్లి గ్రామ వాస్తవ్యులు చుంచు కోటయ్య గారు..


"హైదరాబాద్ నుంచి తిరిగొచ్చి మూడు రోజులు దాటింది..ఇప్పుడు కూడా స్వామివారి మందిరం వద్దే వున్నాను..రేపు కూడా ఉంటాను.." అన్నాను.


కోటయ్య గారి అబ్బాయి గోపి బెంగళూరు లో సాఫ్టువేర్ ఇంజినీర్..భార్య సాహితి.. మూడేళ్ల వయసున్న కుమారుడు..పేరు కౌశిక్..వాళ్ళ కుటుంబం అంతా దత్తాత్రేయుడి భక్తులే..ఏ చిన్న కష్టం వచ్చినా మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధి వద్దే చెప్పుకుంటారు..


అన్నమాట ప్రకారం కోటయ్య దంపతులు ఆ ప్రక్కరోజు..పైగా ఆరోజు ఆదివారం ..తమ కొడుకూ, కోడలూ, మనుమడితో కలిసి వచ్చారు..ఆ దంపతుల ముఖం లో చాలా సంతోషం తాండవిస్తోంది..కొడుకూ కోడలూ కూడా సంతోషంగా వున్నారు..నేనేమీ అడగకుండానే..నా ప్రక్కన కుర్చీలో కూర్చుని..


"మావాడికి కొడుకు పుట్టాడని నీకు తెలుసుకదా..అంతా ఈ స్వామివారి కృపే..కాకుంటే ఆ పిల్లవాడికి మాటలు రాలేదు..నాలుగో ఏడు వస్తోంది..పిల్లవాడికి మాటలు రాలేదు..కొడుకు కోడలూ బాగా తల్లడిల్లిపోయారు..ఈ స్వామికి మ్రొక్కుకోండి..మనలను ఇంతకాలం చల్లగా చూసాడు..ఆయనే ఈ కష్టం కూడా తీరుస్తాడు అని చెప్పానయ్యా.."


"పిల్లలిద్దరూ భక్తిగా స్వామికి మనసులోనే దణ్ణం పెట్టుకున్నారు..తమ కుమారుడికి మాటలు వస్తే..ఈ మొగిలిచెర్ల మందిరం వద్ద ఒక ఆదివారం నాడు అన్నదానం చేయిస్తామని మ్రొక్కుకున్నారయ్యా..ఆ స్వామి కరుణించాడు..మనుమడికి మాటలు వచ్చాయి..ఈరోజు స్వామివారికి పొంగలి పెట్టుకొని..మ్రొక్కు చెల్లించుకుందామని అందరమూ వచ్చాము..అదీసంగతి.." అన్నారు..


ఆదివారం నాడు భక్తులు ఎక్కువమంది వుంటారు..ఆరోజు అన్నదానం చేయాలని వాళ్ళు అనుకున్నారు.ఎంత ఖర్చు అవుతుందో మా సిబ్బందిని అడిగి, వివరాలు తెలుసుకొని..అంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు..తిరిగి వాళ్ళ ఊరుకు వెళ్లేముందు..శ్రీ స్వామివారి సమాధి వద్దకు మరొక్కసారి వెళ్లి, నమస్కారం చేసుకొని వచ్చారు..


ఈ ఆధునిక కాలంలో వైద్య శాస్త్రం ఎంతో పురోగతి చెందింది..దాదాపు ప్రతి లోపాన్నీ సరిచేసే వైద్య పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి..అటువంటి పద్ధతులకు కూడా అందని వాటిని దైవం మాత్రమే సరి చేయగలడు..దైవసహాయం కోసం నీవేమి ధనాన్ని ఖర్చు పెట్టనక్ఖరలేదు..అందుకు కావలసిందల్లా భక్తి, విశ్వాసాలే..సర్వస్య శరణాగతి చెందడమే..ప్రారబ్ధాన్ని తొలగించడం సాధ్యం కాదు అని మొగిలిచెర్ల స్వామివారు తరచూ చెప్పేవారు..కాకుంటే సద్గురువుకు, దైవానికి శరణాగతి చెందితే..ప్రారబ్ధ తీవ్రతను తగ్గిస్తారు అని కూడా చెప్పేవారు..పై కుటుంబం విషయం లో అదే జరిగింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం... మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: