14, మార్చి 2022, సోమవారం

వినతం నుండి విజయం వరకూ

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

* శ్రీమతి శశికళ ఓలేటి గారి కథ.*                           

                  🌷🌷🌷

వినతం నుండి విజయం వరకూ…..కథ

( వినతము-వంచబడినది) 


ఆ సువిశాలప్రాంగణాన అలుముకున్న ప్రశాంతతను భంగం చేస్తూ… కిర్రుమని శబ్దంచేస్తూ ఆ చిన్నతలుపుతీసుకుని ఆమె ఆ భవనంలోకి ప్రవేశించింది. ఆ పెద్ద భవనంలోపల విశాలమైన హాలు…మొత్తం లేతనీలి పరదాలతో… అతితక్కువ కాంతితో …ఇంచుక దూరం నుండీ వీస్తున్న సంద్రపుగాలితో...బయట చుట్టూ ఆవరించివున్న పచ్చని వృక్షవాటికతో…ఆశ్రమవాతావరణాన్ని తలపిస్తోంది!  ఇంచుమించు ఐదొందలమంది శ్రోతలతో.. ఒకేఒక శాంతగంభీర స్వరం… శ్రోతలను మంత్రముగ్దులుగా కట్టిపడేస్తూ…మంద్రమందాకినీ ఝరిలా సాగిపోతోంది. ఆ కంఠస్వరం శ్రీనారాయణానంద స్వామివారిది! 


ఆయన ప్రవచనానంతరం… ఒకరొకరుగా ఆయన పాదాలు తాకి శెలవుతీసుకుంటున్నారు! కొందరు విదేశీయులు తమ సందేహాలను ఆయన ముందుంచుతున్నారు. స్వచ్ఛమైన ఆంగ్లంలో ఆయన సందేహనివారణ చేస్తుంటే… ఆ సనాతనధర్మసర్వస్వం జాడలు తెలుసుకుంటూ వారు ముగ్దులవుతున్నారు. ముఖ్యంగా భారతీయ సమాజంలో వైవాహికవ్యవస్థ ప్రాముఖ్యత గురించి అద్భుతంగా వివరించారు స్వామి. అందరూ నిష్క్రమించాకా… అక్కడే నిలబడి ఉన్న ఆఖరివ్యక్తిని చూసి స్వామీజీ ఒక్కసారి తడబడ్డారు. మొహం ఛాయామాత్రంగా వివర్ణమయింది. “ యశోదా! నువ్వు... మీరిక్కడ? “ అంటూ నిర్వికారంగా పలకరించారు. ఆమె వినయంగా చేతులుజోడించి నమస్కరించింది. “ మీతో కాస్త మాట్లాడడాలి!  అనుమతిస్తారా? “….సందిగ్దంగా అడిగినా… దృఢంగానే అడిగిందామె. ఒక్క నిమిషం ఆలోచించి…” నా నివాసానికి పదండి.”…. అంటూ బయటకు దారి తీసారు స్వామి! 


           బయటకది పర్ణకుటీరంలా కనిపిస్తున్నా… లోపలంతా అత్యంత ఆధునికమైన సౌకర్యాలున్నాయి. ముఖ్యంగా ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన లైబ్రరీగది… వేలకొలది పుస్తకాలతో! అక్కడ అతిథులకోసం కేటాయించబడిన సోఫాలలో ఆమెను కూర్చోమని సైగచేసారు స్వామీజీ! 

“ ఇప్పుడు చెప్పండమ్మా… ఏం మాట్లాడాలని వచ్చారో! “… చాలా మృదువుగా అడిగారు. 

“ ఆపండి ఈ నటనలు నారాయణరావుగారూ! మీరు సర్వసంగ పరిత్యాగులు అని చెప్పుకోడానికి అగ్నిసాక్షిగా తాళికట్టిన భార్యను... ఇంత పరాయిగా పలకరించనక్కరలేదు. మీరు మీ గురువుగారిని అనుసరించి, ఆశ్రమం కోసం సగం ఆస్థితో మనింటి గడప దాటిననాడే ,నాకు నా తాళి బరువెంతో అర్ధమయింది.” సుమంగళి” అన్న బిరుదు తప్పా మరో హోదా, గౌరవం లేని విగతను నేను! ఈరోజు కేవలం మీరే తీర్చగల కొన్ని సమస్యలతో మీముందుకు వచ్చా. ఎందుకంటే ఇంతకన్నా నాకు మరో మార్గం లేదు”!....యశోద మాటలకు దెబ్బతిన్నట్టు చూసారు నారాయణానంద. మరోమాటకు తావివ్వకుండా… బయట వేచివున్న శిష్యుడను పిలిచి…” ఈ మాతను భోజనానికి తీసుకువెళ్ళు. సాయంత్రం నాలుగింటి వరకూ వారిని విశ్రాంతి తీసుకుని రమ్మను! “…. అంటూ పొడిగా చెప్పి.. చివ్వున లేచి లోపలకు వెళ్ళిపోయారు. భర్త నిరాదరణ అలవాటయిన విషయమే అయినా అతిథిగా కూడా తనను ఆదరించని ఆయన వైరాగ్యానికి హతాశురాలయింది యశోద! 


           భోజనానంతరం…ఆ ఆశ్రమంలో దట్టంగా పరచుకున్న ఆ వృక్షఛాయల్లో ఒక చప్టా మీద కూర్చుంది యశోద! ఎంత అతిసాధారణం తన జీవితం! ఎలాంటి సంభ్రమాలు లేవు. సంతోషాలసలు లేవు. జీవితం ఉంది కాబట్టి జీవించాలి అన్నట్టు నిర్వేదంగా! నిర్లిప్తంగా! నిశ్చల సరోవరంలో రాయివేసినట్టు… తన జీవితాన్ని ఒక్కకుదుపు కుదిపింది మూడునెలల క్రితం ఆడపడచు తనకు పంపిన ఫోటో ఆల్బమ్! ఆరోజు… ఆ తరువాత… ఆమెను అస్థిమితం చేసిన సంఘటనలన్నీ ఆమె మనోపధంలో చలనచిత్రంలా కదిలిపోతున్నాయి! 


                        ******


యశోద స్వగతం:-


అసలు మనుషులంత కుట్రలూ, దగాలూ ఎలా చెయ్యగలరూ!? తన, తమ అనే భేదం ఉండదా వారికి?

తనెప్పుడూ ఎవ్వరినీ మోసం చెయ్యలేదు. 

ప్రతీదీ తనపనే అనుకుంది. 

ప్రతీవాళ్లూ తనవారే అనుకుంది. 


కానీ ఇలా కూడా నమ్మకద్రోహాలు చేస్తారన్న సంగతి తలుచుకుంటుంటే ఒళ్లంతా మంటలు రేగిపోతున్నాయి. 


ఎన్నేళ్ల నుండో అణిగిపోయిన, ఉందో లేదో కూడా తెలీని కోపం లావాలా పొంగుకొచ్చేసింది. 


ఏం చెయ్యాలి!? ఏం చెయ్యగలదు తను! ఎంత అశక్తురాలయిపోయిందో ! 


సడన్ గా తన సవితి తల్లి లక్ష్మి గుర్తుకొచ్చింది. 


ఆమె మంచిదే. 


కానీ " అమ్మా" అని పిలవనిచ్చేది కాదు. 

“నేను కననిదే నీకు అమ్మనవను”.... అని ఖచ్చితంగా చెప్పేసేది. 


తండ్రి తనకు పదవ తరగతి అవడంతో పెళ్లి చేసేస్తానంటే , అడ్డుపడి బీ. యెస్. సీ వరకూ చదవనిచ్చింది. 

చదువయ్యాకా తనచేత బేంక్ పరిక్షలు రాయిద్దామని, లేకపోయే బీ యీడీ చేయిద్దామని నాన్నతో పోట్లాడడం తనకింకా గుర్తే! 


ఆడదానికి తనకాళ్ల మీద తను నిలబడే ఆర్ధిక స్వేచ్ఛ ఉండాలని ఎంతో వాదించింది. 


ఆరోజు తనకు నారాయణరావు సంబంధం ఒచ్చినపుడయితే , ఆమె తండ్రిమీద శివంగిలా విరుచుకుపడిపోయింది. 


రెండవ పెళ్లివాడికిచ్చి యశోద గొంతు కోయద్దని కాళ్లావేళ్లా పడింది . 


అక్కడే ఆమె మంచితనం తెలిసింది తనకు. ఆమె ముభావత లో ఉండే ఆప్యాయత తెల్సింది. 


కానీ  తండ్రికి రెండో భార్యకన్నాకూతురి బాధ్యతే పెద్దగా కనిపించి తను అనుకున్నట్టే తన పెళ్లి చేసేసాడు….  పదిహేనేళ్ళు పెద్దవాడయిన నారాయణరావుతో. 


తనకు ఇప్పటికీ అంతా కలలోలా ఉంటుంది. 


పెళ్లయి సంపన్నుల ఇంటికి కాపురం. 

లంకంత ఇల్లు, ఒంటినిండా బంగారం! ఇంటినిండా మనుషులు! 


నారాయణరావు కూతురిని తను చేరదీయాలనుకుంది. గారంగా సొంత తల్లిలా పెంచాలనుకుంది. 

కానీ ఆ పిల్లను కొన్నాళ్ళకే వాళ్ల అమ్మమ్మగారింటికి ఇచ్చేసారు. 


పెళ్లయిన ఏ కొన్నాళ్లో రావు తనతో అన్యోన్యంగా సహజీవనం చేసారు. 


అంతే! తరువాత తెలీని దూరమేదో ఇద్దరినీ పట్టి ఉంచింది. 


ఇంటికి పెద్దకొడుకుగా ఐదుగురు చెల్లిళ్ల పెళ్లి చేసి, ఆస్తిపాస్తులిచ్చి పంపారు. 


పాపం అమ్మాయిలు చాలా మంచివాళ్లు. అత్తగారయితే దేవతే. 

వాళ్ల పురుళ్లూ, పుణ్యాల మధ్యే తనూ సంతోష్ ని కన్నది. 

  

కాలంతో జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.


నారాయణరావులో రానురానూ ఆధ్యాత్మిక పోకడలు ఎక్కువయ్యాయి! 


యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేసే ఆయన, రోజూ యోగసాధన, సూర్యనమస్కారాలు, రెండు గంటల శ్రీచక్రార్చనలు, చండీ హోమాలు, నవరాత్రి పూజలు .... అంటూ విపరీతమయిన భక్తిసాధనలోకి వెళ్లిపోయారు. 


అంతంతే అయిన సంసారం ఇంక పూర్తిగా మూసుకుపోయింది. 


ఆయనకన్నీ అమర్చిపెట్టి, ఇంటినీ, పిల్లాడినీ, అత్తగారినీ సంభాళించే సరికే తనకి రోజులిట్టే తిరిగిపోయేవి. 


తనను గురించి ఆలోచించుకునే తీరికకానీ, ఇచ్ఛ కానీ మిగిలేదే కాదు. గాలివాటపు జీవితం!! 


మెల్లగా ఇల్లు ఆశ్రమంగా మారిపోతుంటే, సంతోష్ ఇంజినీరింగ్ చదువుకు హాస్టల్ కు వెళ్లిపోయాడు. 


ఎవరెవరో స్వాములు, వారి భిక్షలూ, దేవుడి భోగాలూ , ప్రవచనకర్తల రాకపోకలూ.... వీరి దర్శనార్ధం ఒచ్చే భక్తజనులు, వారి పరివారాలతో ఇల్లు తీర్ధప్రజలా ఉండేది. 


నారాయణరావు మంచి వక్త. ఆయన స్వయంగా ప్రవచనాలివ్వడమో, లేక ఇంగ్లీష్ లో భారతీయ తత్వగ్రంధాలు అనువదించడానికి ఉత్తరాదికో, విదేశాలకో వెళ్తూ ఉండేవారు.


మెల్లమెల్లగా బొత్తులతో ఉండే జమీందారీ ఆస్తిపత్రాలు చిక్కిపోతూ వచ్చాయి. 


అత్తగారే కాదుకూడదని తాముంటున్న రెండువేల గజాలలో ఉన్న పూర్వోత్రపు ఇల్లు , ఒక పెద్ద ఇంటిస్థలం తన పేరు మీదకూ మార్పించారు. 


సంతకాలు పెట్టడమే కానీ తనకే వివరాలూ తెలీదు. 


తన తండ్రి పోయాకా, పిన్ని తన కొడుకులతో ఢిల్లీ వెళిపోయే ముందు ఒచ్చి కలిసి, ఒకటే మాటంది. " యశోదా! కళ్లు మూసుకుని కూర్చోకు. కాస్త గమనించుకో ఇల్లూ వాకిలీ "... అంటూ! అప్పుడు కూడా తనకంటూ చూసుకోవాలని తెలీలేదు. 


సంతోష్ సివిల్ ఇంజినీరింగ్ చదివి, స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం తెచ్చుకున్నాడు. 


అక్కడే తన కొలీగ్ 

సునీతను పెళ్లిచేసుకుంటానని తండ్రికి చెప్పాడు. తనకి చెప్పడం ఏనాడూ లేదు. 


అప్పటికే హిందూ ధర్మ పునరుద్ధరణలో పూర్తిగా తలమునకలయ్యున్న నారాయణరావ్ కులాంతర వివాహానికి సహజంగానే ఒప్పుకోలే! 


అత్తగారే పెద్దమనసు చేసుకుని నగానట్రా పెట్టి తనకోడల్ని ఇంట్లోకి తెచ్చారు!


సునీత గృహప్రవేశం , నారాయణరావు గారి సన్యాసాశ్రమం ఒకేరోజు జరగడం ఏమాత్రం యాధృచ్ఛికం కాదు. 


అప్పుడప్పుడే గురువుగా ఎదుగుతున్న ఒక ఆధ్యాత్మిక వేత్తకు నారాయణరావ్ గారిలాంటి జ్ఞాని సహాయం చాలా అవసరం అవడం కూడా బాగా కలిసొచ్చింది. 


తనకు మాత్రం , తమ మధ్య ఎంత దూరమున్నా తన భర్త తన పక్కనుంటే ఎంతో ధైర్యంగా ఉండేది. 


హోమాల్లో , పూజల్లో ఆయనతో పీటలమీద కూర్చుంటే ఎంతో గర్వంగా ఉండేది. 


అలాంటిది భర్త తన వస్తువులూ, పుస్తకాలూ లారీ కెక్కించి, సన్యసించడానికి తల్లి అనుమతిని బలవంతంగా తీసుకుని, ఇల్లువిడిచి వెళ్లిపోతూ, కొడుక్కి అప్పగింతలు పెట్టి , సహధర్మచారిణి తనకేసి కన్నెత్తికూడా చూడకుండా ,నిష్క్రమించడం ఆమెకు తన జీవితంలో తను గెలుచుకున్న స్ధానమేమిటో పెద్ద ప్రశ్నార్ధకమై నిలిచింది. 


అయితే అతిత్వరలోనే సునీత తన స్థానానికి మంచి స్పష్టతిచ్చింది. 


కాశీ వెళ్లిపోయి, కొన్నాళ్ళకు అత్తగారు మహాప్రస్థానమయిపోయారు. 


ఇంటి యజమానిగా తనభర్త పడుకున్న నైఋతిమూల గది, ఇనప్పెట్టెతో సహా కొడుకు పరమయింది. 


అయినా తనకేనాడూ ఆ ఇనప్పెట్టెతో పని పడలేదు. ఏ ఫంక్షనొచ్చినా అత్తగారు “ ఇవి వేసుకో” అని ఇవ్వడం, తను వేసుకుని తిరిగి ఇచ్చేయడమే! అప్పుడెప్పుడో... కౌలు డబ్బులతో అత్తగారు తనకంటూ ...ఆమె ఒక కాసులపేరు, డజన్ గాజులూ చేయించడం మటుకు తెలుసు. 


"అయినా నాభర్తే సన్యసించాక నేనేమి పెట్టుకుతిరుగుతానులే ".......అని తనే పెద్దగా నగలు పెట్టుకునేది కాదు. 

అత్తగారు అనేవారెప్పుడూ ," వెండి, బంగారాలు పాడుచేసుకోకూడదు. అక్కరకొస్తాయని. " !!


ఆ వెండిబంగారాలే ఆరోజు గుండెలో మంటనెగదోసాయి తనకి……….


మనసు చంపుకుని, ఆత్మాభిమానం అణుచుకుని కొడుకు నీడలో బ్రతుకుతోంది తను. 


పదిహేనేళ్లలో ఎన్ని మార్పులో తెచ్చారా ఇంటికి!!


 ఇంట్లో పెద్దల ఫోటోలు మాయమయ్యాయి. 


దేవతార్చన ...దేవుడిగది నుండి వంటింటి గూటికి చేరింది. 


పండగలు మారాయి. 


కొత్తచుట్టాలు బయలుదేరారు. 


ఇంటి ఆడపిల్లలను పిలిచే వారే లేరు! 


ఇంటి యజమానిరాలి నుండి ...ఆ ఇంటి వంటకు, పిల్లలను సాకడానికీ పనికొచ్చే మనిషిగా తనను దిగజార్చారు! అయినా తనెవరికోసం చేస్తోంది? తనవాళ్లేగా! అలాగే అనుకుంది ఇన్నాళ్లూ! "


మనవలిద్దరూ డబ్బుపట్టినట్టు ఉంటారు. 

ఇంటివంట కిట్టదు. నానమ్మనోలాగా, అమ్మమ్మనోలాగా చూడడం అలవాటు చేసుకున్నారు! 


అదనంగా పట్టలేనంత నోటిజోరు! 


పదేళ్లవరకూ వాళ్ల ఆరోగ్యాలు చూసి, అన్నాలు పెట్టి, అఆ లనుండి అవసరమైన పునాది చదువు చెప్పిన తనంటే ...వాళ్లకేమీ ప్రత్యేక ప్రేమ లేదు! 


తన అవసరాలూ, ఆరోగ్యాలు ఎవరికి పడతాయి? కొడుకుకి తను ఆ ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల్లో ఒకటి!! 


మూడేళ్ల క్రితం సంతోష్ తన ఉద్యోగం రిజైన్ చేసి, రియల్ ఎస్టేట్ లోకి వెళ్లాడు. మొదలుపెట్టిన కొన్నాళ్ళకే" బిజినెస్ లో పెద్దగా రాణింలేకపోతున్నానమ్మా!"..... అనడం మొదలుపెట్టాడు! 


తను ఒకరోజు ఆడపడచు కూతురు పెళ్లికెళ్లాలి. బీరువాలో నగలు కావాలని అడిగింది కొడుకును. 


అప్పుడు చెప్పాడు ...అప్పులవాళ్లు మీద పడడంతో నగలు , వెండిసామానంతా అమ్మాల్సి వచ్చిందని. 


మనస్సంత చివుక్కుమందో తనకి! తన బంగారం అమ్ముతూ తనకు ఒక్కమాట కూడా చెప్పలేదు కదా అని. 


సునీత మాత్రం రోజూ వంటిమీద వందగ్రాములు తగ్గకుండా వేసినవి వెయ్యకుండా వేసుకుని తిరుగుతూనే వుంది. 


అయినా సంభాళించుకుంది తను… పాపం వాడికి ఎంత కష్టమొచ్చిందో కదా ! భార్యని అడగలేక అమ్మ వస్తువులు వాడుకున్నాడు అని! 


కానీ ఈరోజు ఊళ్లోనే ఉండే ఆఖరాడపడుచు సీత తన కళ్లు తెరిపించింది. హెచ్చరించింది! 


సీత తనకు ఇచ్చిన పెద్ద కవర్ అక్కడే పడుంది. దానిని తెరవాలని లేకపోయినా ద్రోహం తాలూకు రంగు, రూపూ ఎలా ఉంటాయో ఇంకోసారి చూడాలనిపించింది. 


పెద్ద పెద్ద ఫోటోలు! కంప్యూటర్ లో కాపీలు తీసిందట సీత! 


"సునీతా పారడైజ్" 


అత్యంత ఆధునాతనమైన అపార్ట్ మెంట్! బిల్డర్ సంతోష్.....! 


ఐదవ అంతస్థు ....పెంట్ హౌజ్ ....ఓనర్ సునీతాకుమారి. 


అద్దె లక్ష రూపాయలు. ఏదో కంపెనీకి గెస్ట్ హౌస్ కిచ్చినట్టున్నారు. 


సీత మరిది ఆ కంపెనీ ఎమ్ డీ! అందుకే సీతకు అన్ని వివరాలూ తెలిసాయి!


ఆ ఫర్నిష్ట్ అపార్ట్ మెంట్ లో...లోపలంతా అత్యంత ఖరీదయిన ఫర్నిచర్, ఇంటీరియర్స్! 


సెల్లార్ లో రెండు కారు పార్కింగుల్లో సరికొత్త ఇన్నోవా, టయోటా కారులు! వెనక తన మనవల పేర్లతో! తన ఇంటి పోర్టికోలో పార్క్ చేసున్నసంతోష్ తిరిగే పాత స్విఫ్ట్ కారు తనని వెక్కిరిస్తోంది…..” ఎంత పిచ్చిదానివే” అంటూ! 


నగరంలోనే అత్యంత ఖరీదయిన ఏరియాలో..... తన అత్తగారుతన పేరు మీద.. కొని ఇచ్చిన స్థలంలో ,కట్టబడ్డ అపార్ట్ మెంట్ అది. 


ఆ స్థలం కాగితాలు తనేమీ సందీప్ కి ఇవ్వలేదే! తన సంతకాలు ఫోర్జరీ చేసుండాలి! 


అంతకన్నా ఘోరం.!సునీత… ఫేస్ బుక్ లో రెండు నెలల క్రితం పెట్టిన ఆ ఇంటి గృహప్రవేశం ఫోటోలు! 


గృహప్రవేశం చేసుకుంటూ! సునీత,మనవరాలు రియా ..చుట్టాలందరి మధ్యలో ప్రత్యేకంగా వెలిగిపోతూ....... వంటినిండా తన నగలు దిగేసుకుని! తనకి తెలుసు తన నగలేవో! తనకెంతో ఇష్టమైన ఆ నగలు! ఎప్పుడూ తనివితీరా ధరించలేకపోయిన నగలు! సంతోష్ అమ్మేసానన్న నగలు! 


అక్కడసునీత బంధువులున్నారు, వారిద్దరి స్నేహితులున్నారు. లేనిది " తనొక్కతే!" !!


ఆఖరి ఫోటో చూసేసరికి తనకు పళ్లు పటపటలాడాయి కోపంతో! 


అపార్ట మెంట్ పక్కన తన తరువాతి వెంచర్ ప్రకటిస్తూసంతోష్ పెట్టిన బోర్డు, అపార్ట్ మెంట్స్ ప్లాన్ ! సైట్ అడ్రస్...... ప్రస్థుతం తాము ఉంటున్న ,తన పేరిట అత్తగారు పెట్టిన ..తనిల్లు! 


అంటే అతి తొందరలో ఈ ఇల్లు కూడా "సునీతా బిల్డర్స్ " పాలవుతుందన్నమాట! 

ఈ ఒక్కటయినా నిలుపుకోవాలి. 

చాలీ వంచన! 

కానీ ఏం చెయ్యగలదు తను! 

పట్టుమని పది రూపాయలు లేవు చేతిలో! 

కానీ ఏం చేసినా ఇప్పుడే చెయ్యాలి. 


ఎల్ టీ సీ మీద నలుగురూ నెలరోజులు నార్త్ ఇండియీ ట్రిప్ కు వెళ్తున్నామని చెప్పి ముందురోజే వెళ్లారు! 


ఫోన్ మోగింది! సీత!


"ఒదినా! రెడీగా ఉన్నావా? డాక్టర్ దగ్గరకి తీసుకెళ్తా! ఆ హైపర్ అసిడిటీ ఏంటో చూపిద్దాం"


————————————————————


సీతతో డా. సరోజ దగ్దరకెళ్లి , చూపించుకుని, మందులు కొనడానికి మెడికల్ షాప్ దగ్గరకెళ్లారు! 


" హాయ్ సీతత్తా!" 


 ఇద్దరూ గిరుక్కున తిరిగి చూసారు! ఒక అందమైన అమ్మాయి, ఇద్దరు టీనేజ్ కూతుళ్లతో! 


ఎందుకో ఆ మొహం చిరపరిచితంగా ఉంది. తెలుపు మీద నలుపుపూల ప్యూర్ శిల్క్ చీరకట్టుకుని ఉంది. 

చెవులకు చిన్న రవ్వల కమ్మలు. మెడలో సన్నగొలుసూ. 

మరే ఆభరణాలు లేకపోయినా రాకుమారిలా ఉంది ఆమె. 


" అరే! సంజూ! బంగారీ! ఎన్నాళ్లయిందే నిన్ను చూసీ....." అంటూ సీత గట్టిగా కావలించుకుని. 

" నీ కూతుళ్లా! ఎంత పెద్దవాళ్లయిపోయారే...." అంటూ వాళ్లనూ పొదివి తీసుకుంది. 


తనకేసి ప్రశ్నార్ధకంగా చూస్తున్న ఆమెతో సీత,

" సంజూ! వదిన! మీ నాన్నగారి భార్య"… అంటూ పరిచయం చేసింది! 


ఆమె వెంటనే తన దగ్గరకొచ్చి, చెయ్యి పట్టుకుని, " నమస్తే! అమ్మా! ఎప్పటినుండో మిమ్మల్ని చూడాలని!! ఇప్పటి కయ్యింది. వీళ్లు మా అమ్మాయిలు. " ... అంటూ ఎంతో ప్రేమగా, చనువుగా పరిచయం చేసుకుంది సంజన….అచ్చం తన అత్తగారి పోలికలో...రాజసంగా ఉన్న అమ్మాయి.” అమ్మా” అన్న ఆమె పిలుపుతో తనలోమాతృభావన ఉప్పొంగిపోయింది. 

సంజన చెయ్యి తనచేతిలోకి తీసుకుని అలాగే ఉండిపోయింది కాసేపు. 


సంజూ ఆహ్వానం మీద పక్కవీధిలోనే ఉన్న తన ఇంటికెళ్లారు తనూ, సీతా! 


అందమైన ఆ గూటిలో గోరింక ఎగిరిపోయిన సంకేతంగా దండవేసుకున్న ఫోటో! 


సొంత కూతురిలా " అమ్మా! అమ్మా!" అంటూ కబుర్లు చెప్తూనే వంటచేసిన సంజూ, " అమ్మమ్మా" అంటూ నోరారా పిలుస్తూ వాళ్ల చదువులూ, సంగీతాల కబుర్లు చెప్తూ మాలిమయిపోయిన ఆమె కూతుళ్ల సమక్షంలో........ పుట్టి బుద్దెరిగిన తరవాత తనెంతో ఆనందంగా గడిపిన రోజు ఇదే అని అర్ధమయ్యింది ! 


మాటల్లో సంజూ ముందున్న సమస్య అర్ధమయింది. 


సంజనది ప్రేమవివాహం. 

పర్యవసానం… తనను అల్లారుముద్దుగా పెంచిన

అమ్మమ్మ కుటుంబం నుంచి వ్యతిరేకత. 

హాయిగా సాగిపోతున్న జీవితంలో అతని అకాలమృత్యువొక పిడుగుపాటు! 


అయినా సంజూ క్రుంగిపోకుండా.. ధైర్యంగా చిన్న స్కూల్ మొదలు పెట్టింది. తన పరిశ్రమ, నిబద్ధత వలన అది అతి త్వరలో మంచి పేరు సంపాదించుకుని, ఏడవ తరగతి వరకూ, సీబీఎస్ సీ సిలబస్ లో ఆరొందలలస్టూడెంట్స్ తో నడుస్తోంది. 


కానీ ఇప్పుడు తను స్కూల్ నడుపుతున్న బిల్డింగ్ లో కమర్షియల్ కాంప్లెక్స్ రాబోతోంది. 


మూడు నెలల్లో బిల్డింగ్ ఖాళీ చెయ్యాలి. ఏం చెయ్యాలో తోచక ప్రెమిసెస్ కోసం ఊరంతా ఒక్కలా వెతుకుతోంది! 


ఇన్ని సమస్యలలో కూడా ఆ అమ్మాయి పెదవులపై చిరునవ్వు, మొహాన ప్రశాంతత చెరగకపోవడం చూసింది తను 


ఇంటికి తిరిగొచ్చాకా...తను నిద్రపోలేకపోయింది.


 తననుండి ఇన్ని తీసుకున్నా...విశ్వాసం లేని తన రక్తానికీ, ఏ రక్తసంబంధం లేకపోయినా ఎంతో ప్రేమ పంచిన సంజూకి మధ్య వ్యత్యాసం గురించి ఆలోచిస్తూ కూర్చుంది. 


సంజనకు మంచి జరగాలి. ఎందుకో కష్టమొచ్చినా, సుఖమొచ్చినా అత్తగారి ఫొటోకి చెప్పుకోడం అలవాటు తనకు.ఆరాత్రి ఆమె ఫోటోముందు నిలబడి… చేతులు జోడించి, “  అత్తమ్మా! మీ పేరింటి పిల్ల! ఈ ఇంటి ఆడపిల్లగా కనీసం పసుపు, కుంకుమ కూడా మనం ఇచ్చి పంపలేదు. ఈరోజు బిడ్డ సమస్యలో ఉంది. పరిష్కారం చూపించండి"...... అనుకుని శాంత , స్వాధుమూర్తి ఆ వృద్ధురాలి మొహం చూస్తూ కళ్లు మూసుకుంది. 


ఇంతలో గోడమీద బల్లి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అరిచింది. 


ఉలిక్కిపడి గోడవేపు చూసిన తన కళ్లు గోడకే అతుక్కుపోయాయి! 


బరువుగా తాళాలగుత్తి! మధ్యలో ఠీవిగా సంతోష్ పడగ్గదిలో ఉండే ఇంటి ఇనప్పెట్టె  తాళం. 


ఉరుములూ, మెరుపులూ ఒస్తే తన గదిలో కంప్యూటర్, టీవీ కనెక్షన్లు తీసేయమని  , అప్పుడెప్పుడో సంతోష్ ఇచ్చిన డూప్లికేట్ తాళాల గుత్తి! 


"గదితలుపులు తెరిచి… ఒకసారి ఇనప్పెట్టెలో చూస్తే పోలేదా...ఏం మిగిల్చాడో! సంస్కారం కాదు నిజమే! కానీ అలాంటి మంచి వ్యవహారం ..అవతలి వారు సంస్కారవంతులయితేనే కదా వర్తిస్తుంది! "… తనలో ముప్పిరిగొన్న భావసంచలనం!  


"నమ్మకద్రోహానికి నమ్మకద్రోహమే విరుగుడు! సహనం అంచులు దాటించేసారు తనని. పేగుబంధాలన్నీ నిలబెట్టుకున్నన్నాళ్లే! పాశం తెంపుకుంటే తల్లెవరు? బిడ్డెవరూ? చూపించి తీరాలి నేనేంటో! ఎంత ఖర్చయినా సరే!"....స్వాభిమానం పొంగుకొస్తుంటే…  సాలోచనగా, తన పెళ్ళిలో పెట్టిన తన చెవులకున్న  అత్యంత విలువైన ,బ్లూ జాగరీ వజ్రాల కమ్మలు తడుముకుంది!!


———————————————————


ఆ మరుసటి వారం రోజులూ తన జీవితంలోనే సాహసోపేతమైన, స్వేచ్ఛా దినాలు! 


అదృష్టవశాత్తూ ఇంకా చేతులు మారని ఇంటి పత్రాలూ, అత్తగారిచ్చిన దంతం పెట్లో భద్రంగా దొరికిన తన నగలను సీత సాయంతో బేంక్ లో తనఖా పెట్టి లోన్ కు అప్లయి చేసింది. 


సంజనను పిలిచింది. 


స్కూల్ ప్లాన్ ఇమ్మంది. 


సంజూకి తెలిసిన బిల్డర్ తో మూడు నెలల్లో తమ మేడను స్కూలుకనుగుణంగాచేసి,పైన మరో రెండు అంతస్థులు లేపి, విశాలమయిన స్కూల్ భవంతి తయారయ్యేట్టు, , విశాలమైన ఖాళీస్థలమంతా పిల్లల ఆటలకు కేటాయించేట్టూ ప్లాన్ చేసారు! 


సీతభర్త సలహా మీద, లాయర్ ద్వారా కట్టబోయే స్కూల్ లో తను ముఖ్యభాగస్వామిగా డీడ్ రాయించారు.


తమ ఇంట్లో ఉన్న విలువయిన రోజే వుడ్ ఏంటిక్ ఫర్నిచర్ అంతా అమ్మడానికి ఆమధ్య సంతోష్ పార్టీలు మాట్లాడి పెట్టుకున్నాడు. 


ఖర్మకాలి ఆ నంబర్ల కాయితం తల్లికిచ్చి , వాళ్లు ఫోన్ చేస్తే ఏంచెప్పాలో, ఎంత చెప్పాలో చెప్పి ఉన్నాడు! 


తను… ఇదే అదననుకుని చాలా మంచి రేటుకు ఇంట్లో ఉన్న ఏంటిక్ ఫర్నిచర్ అమ్మేసింది! డబ్బు తనపేరున వేసుకుంది.


ఎదురింట్లో ఒక ఫ్లాటు అద్దెకు తీసుకుని సంతోష్ కుటుంబానికి సంబంధించిన సామానంతా పేక్ చేయించి పెట్టేసింది. 


తను అవుట్ హవుస్ బాగుచేయించుకుని అక్కడకు మారిపోయింది. 


బలాన్ని కూడగట్టుకుని తను ధైర్యంగా నటిస్తోందే కానీ లోలోపన ఆమెకు ఒణుకుగానే ఉంది….కొడుకు తిరిగొచ్చి చెయ్యబోయే వీరంగానికి. 

కొడుకు కోపం, దుర్మార్గం తనకెరుకే! 


పగ పడితే ఎంత దూరం వెళ్లగలడో , ఎంత తెగిస్తాడో గతంలో కొన్ని సంఘటనలు చూసి ఉంది కూడా! 


సునీత ఇద్దరుఅన్నలు, బావ గవర్నమెంట్ లో చాలా పెద్ద పదవుల్లో ఉన్నారు. తండ్రి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్!చాలా బలగం ఉన్నవారు! 


ఇన్ని వ్యతిరేకబలాలకు తను ఎదురీదగలదా! తనంటే ప్రాణాలకు తెగించింది. కానీ సంజనను కూడా లాగింది. ఏం చెయ్యాలి. సీత, ఆమెభర్త మోరల్ సపోర్ట్ ఇస్తారు కానీ, పూర్తిగా నిలబడతారా?


తన భయాలు నిజం చేస్తూ ఇరవై రోజులకే , ఉప్పంది పరిగెట్టుకొచ్చాడు సంతోష్ కుటుంబంతో! 


ఖాళీ ఇల్లు, ఇంటా బయటా కూలీలు, చుట్టూ కన్ స్ట్రక్షన్ జరుగుతున్న దాఖలాగా నిలబెట్టిన సరుగుడు కర్రలు, ఇంటిముందు ఇసుక, ఇటుకలు.......కాంక్తీట్ మిక్సింగ్ మిషన్ అతనికందిన సమాచారాన్ని ధృవపరుస్తూ! 


సునీత అప్పటికే ఫోన్ తీసి తనవాళ్లకు సమాచారమిస్తోంది. 


పిల్లలు " మా గదులేవి? మా సామాన్లేవి"" అంటూ ఏడుపు లంఘించుకున్నారు. 


సంతోష్ శివాలెత్తుతూ, అక్కడ సపోర్ట్ కోసం పెట్టబడ్డ కర్రలను కాళ్లతో బలవంతంగా తంతూ పడేస్తున్నాడు. 


కాంట్రాక్టర్ అడ్డుపడి , అవుట్ హవుస్ లో ఉన్న తన దగగరకు పరిగెట్టుకొచ్చాడు.సంతోష్ కూడా వెంబడే వెళ్లి, బయటకొస్తున్న తనను చూసాడు. 


 గజగజలాడిపోయింది కొడుకు ఉగ్రరూపం చూసి. ఏదో అనబోతోంది.... అంతే.....


"దొంగ ..... ***! ఎంత పనిచేసావే !" .... అంటూ


...... జుట్టు పట్టుకుని హాల్లోకి ఈడ్చుకొచ్చాడు. 


కిందపడేసి తన్నడం మొదలు పెట్టాడు. 


కాంట్రాక్టర్ సంజనకు కాల్ చేసి, పనివాళ్ల సాయంతో సంతోష్ ను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాడు. 


సంతోష్ కొడుకు అడ్డుపడుతున్న పనివాళ్లని కర్రతో కొడుతున్నాడు. 


సునీత...ఇంకాస్త ఎక్కిస్తూ, " తన్ను రాస్కెల్ ను. డోంట్ లీవ్ దిస్ బ్లడీ వుమన్! చీట్! థీఫ్!" అంటూ అరుస్తోంది.


ఈలోపున సంజన తన స్కూల్ లో పనిచేసే నలుగురు మాస్టర్లతో అక్కడకి వచ్చింది. 


సంతోష్ తనను వదలి దుర్భాషలాడుతూ , సంజూ మీద కలబడ్డాడు. 


ఆఖరికి ఇరుగూపొరుగూ మూగడంతో మర్నాడు చూసుకుందామంటూ, తమసామాన్లు పెట్టిన ఫ్లాటుకి వెళ్లిపోయారు. 


ఇనప్పెట్టె కూడా అక్కడే ఉండడంతో, గబగబా తెరిచిచూసి, ఇంటిపత్రాలు, తన నగలూ తప్పా మిగిలినవన్నీ యధాతధంగా ఉండడం చూసి నిప్పులు చెరిగాడు. 


సాయంత్రం పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనమీద దొంగతనం ఆరోపణ, తన భార్యను దూషించి,తమను రక్తాలోడేట్టు కొట్టించారని రిపోర్ట్ చేసాడు! 


బావమరుదులతో మాట్లాడి తమను బెదరగొట్టాలో ప్లాన్ చేసుకుంటున్నాడు.


సంజనకు పరిస్థితి తీవ్రత అర్ధమయింది. 


తనను తీసుకుని తన మేనమామలను కలిసింది. తమకిష్టంలేని పెళ్లి చేసుకుని దూరమయిన మేనకోడలు ...మళ్లీ వెతుక్కురావడం వాళ్లకి మహదానందమయింది. 


క్రిమినల్ లాయరయిన పెద్దమేనమామ సంతోష్ ను ఎదురుకోడానికి రంగం సిద్ధం చేసాడు. 

దాని పర్యవసనమే తను ఈ రోజు నారాయణానందస్వామి ఆశ్రమానికి శరణువేడుతూ సాయం అర్ధించడానికి వచ్చింది! 


                     *********


దాదాపు నాలుగుగంటల సమయానికి స్వామినుండి పిలుపు వచ్చింది ఆమెకు. ఈసారి కాస్త ఆప్యాయత ధ్వనించింది ఆయనగొంతులో. ఆ చిన్నపాటి ఆదరణకే కన్నీరుమున్నీరయింది యశోద. జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది! 


“ ఎప్పటికయినా వాడి పంచనే రక్షణ పొందవలసిన దానివి. ఇప్పుడు “ నాదీ” అంటూ ఆస్థులకోసం పోరాటం అవసరమా” అని అడిగారాయన. ఆమె అహం దెబ్బతింది. జేవురించిన మొహంతో….


“ నిజమే!నా బ్రతుకంతా ఒకరి అండలోనే బతకాలి కదా! మర్చపోయాను! సంపన్నులింట మెట్టి… నేనెంత ఐశ్వర్యం అనుభవించానో మీకు తెలియదా! నాతిచరామి అంటూ వేలుపట్టుకుని మీరెంత రక్షణనిచ్చారు నాకు? నాకు ఆ ఆస్థికావాలి. బిడ్డతో కలిసి…. నా అత్తమామల పేరిట ఏదయినా సత్కార్యం చేసి… వారి పేర్లు నిలబెట్టాలి. అంతకు మించి తాపత్రయం లేదు. సంతోష్ కు వారసత్వంగా చాలానే సంపద దొరికింది. ఈ ఇంటికోడలిగా అత్తగారు నాకోసం ఇచ్చిన ఈ ఆస్థి నాకు కావాలి. మీ దగ్గర ఒరిజినల్ దస్తావేజులు, మీ అమ్మగారి వీలునామా అసలూ ఉన్నాయి. నాకు దయచేయించండి! మళ్ళీ మీగుమ్మం ఎక్కే సాహసం చెయ్యనని మాటిస్తున్నా! “….కంఠం దుఃఖంతో గద్గదమౌతుంటే ఆమె అర్ధిస్తోంది! 


         ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళిపోయిన భర్తకేసి వెర్రిదానిలా చూస్తూ ఉండిపోయింది యశోద.చేసేదిలేక తిరిగి వెళ్దామని లేచింది.ఆశ్రమం బయట ఉన్న పెద్దగేటు తెరుచుకుని ,బయటకు అడుగుపెట్టింది. “ హు! మనసుకు గేట్లు, గోడలూ కట్టుకుని తాళాలేసుకున్న కఠినహృదయులు! పైకి మాత్రం దైవజ్ఞులు”… అంటూ విరక్తిగా నవ్వుకుంది. ఇంతలో దూరం నుంచీ పరిగెట్టుకొస్తూ... ఆయన శిష్యుడు... ఆమెను ఆగమని అరుస్తూ! ఆ కుర్రాడు ప్లాస్టిక్ కవర్లో పెట్టిన కాగితాల కట్ట ఆమె చేతిలో పెట్టి… నమస్కరించి వెళ్ళిపోయాడు. “ ఆస్థి దస్తావేజులు” అవి!!!


ఆ మర్నాటి నుంచి అసలు సిసలయిన న్యాయపోరాటం మొదలైంది. 


బీహార్ నుండి మనుషులను తెప్పించి వేధించడం మొదలుపెట్టారు... సంతోష్ బృందం! 


లంచం దండిగా అందిన ఇన్స్పెక్టర్ అరెస్ట్ వారెంట్ తో వచ్చాడు. 


కానీ సంజూ మేనమామ ఏంటిసిపేటరీ బెయిల్ తో వెంటనే యశోదనూ, సంజననూ బయటకు తెచ్చారు . 


కోర్టులో తన తాతగారి ప్రోపర్టీ క్లెయిమ్ చేస్తూ సంతోష్ వేసిన దావా నిలబడలేదు. 


నారాయణరావు ఇచ్చినతన తండ్రి వీలునామాలో , ఆ ఇల్లూ, స్థలమూ తన తల్లి పేరిట రిజిస్టర్ అయ్యి ఉండగా,ఆయన తల్లి సరస్వతమ్మ గారి వీలునామా ప్రకారం కోడలుకు ఆ రెండు ఆస్థులూ బహుమతిగా రిజస్టర్ చేయించినట్టు స్పష్టంగా ఉంది. 


పైగా పెద్దామె తన కూతుళ్లకిచ్చిన బంగారంతో పాటూ, కోడలికి ఇచ్చిన మూడొందల తులాల బంగారంనగల తాలూకు వివరాలన్నీ పూసగుచ్చినట్టు ఉండడంతో యశోదపై పెట్టిన కేసులన్నీ వీగిపోయాయి


అనూహ్యంగా... సునీత తల్లితండ్రులు కూతురికీ, అల్లుడికీ ఎదురుతిరిగారు. 


అల్లుడూ, కూతురూ తప్పుడు రిపోర్టు ఇచ్చారని,, ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తాము...వారి మోసానికి మద్దతివ్వలేమని, కూతురి అత్తగారు తమని ఎంత ఆదరించిందో చెప్పి , అలాంటి సాత్వికురాలి మీద తప్పుడు సాక్షాలు ఇవ్వమని...నిక్కచ్చిగా చెప్పడంతో కేసు పలుచనయిపోయింది.


యశోదకు ఇంచుమించు అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. 


సంతోష్ తన ప్రయత్నాలు మానలేదు. 


అయితే అతనికిప్పుడు సునీత కుటుంబం నుండి,లా అండ్ ఆర్డర్ డిపార్ట్ మెంట్ నుండీ ఎలాంటి సపోర్ట్ దొరకడం లేదు. 


యశోద, సంజనా పూర్తి స్వతంత్రులయ్యారు. సంతోష్ చివరకు ఒక్కటే మాటన్నాడు తల్లితో......


" నిన్ను తల్లివి అని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నా! మాతృత్వానికే మచ్చతెచ్చావ్!....." అని! 


మళ్లీ మరోసారి యశోద గుండెలో మంటరేగింది. కానీ ఈసారి అది కేవలం అసిడిటీ మంటే. ఆమెలోని మాతృత్వం ఎప్పుడో కరుడు కట్టేసింది. 


ఆరు నెలల తరువాత నగరం నడిబొడ్డున  " సరస్వతీ రంగారావు స్మారక విద్యానికేతన్" ప్రారంభం అత్యంత ఘనంగా జరిగింది. 


నగరంలోని ప్రముఖవిద్యావేత్తలూ, నాయకులూ, పురప్రముఖుల మధ్య ప్రారంభోత్సవం జరిపారు.


ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే నిలువెత్తు చిత్రపటాలలో వెలిగిపోతున్న శ్రీ రంగారావుగారు, శ్రీమతి సరస్వతీదేవికి ......తన తల్లితండ్రులకు .....పువ్వులతో నివాళులర్పిస్తూ, .......సర్వసంగ పరిత్యాగి...సద్గురు శ్రీనారాయణానందస్వామి ముకుళితహస్తాలతో… కన్నీళ్ళ పర్యంతంగా నిలబడిపోయారు! 

 

ఒక పక్క కూతురునీ, మనవరాళ్లనూ గర్వంగా పొదువుకొని ఎంతో ఎదిగిపోయినట్టు కనిపిస్తున్న "యశోద”…. గౌతమబుద్ధుడిలా తను పరిత్యజించి వదలిపోయిన “ యశోధర”!!! తను సన్యసిస్తూ వెనుతిరిగి కూడా చూడని తన భార్య!!!ఈరోజు సాధికారంగా…సబలగా…సాధీరలా!!స్వావలంబనతో! జీవనపోరాటంలో గెలిచిన విజేతలా! 


ఆ పక్కనే క్రీడా మైదానంలో బారులు తీరిన పాలపిట్టల్లా, " ఎస్ ఆర్ ఎన్" పాఠశాల ఐడెంటిటీ కార్డ్ లు మెడలో గర్వంగా తగిలించుకుని క్రమశిక్షణతో నిలబడ్డ భావిభారతపౌరులు!! 


 *శశికళ ఓలేటి.* 

🌺🌺🙏

కామెంట్‌లు లేవు: