'పుక్కిటి పురాణాలు'
*
"బాబాయ్, ఇతనే నేను చెప్పిన జనార్ధన్, షార్ట్ గా జానీ అంటారు. రిస్ట్ ఫైట్ లో ఛాంపియన్" అంటూ పరిచయం చేసాడు సత్యం తన ఫ్రెండుని, 'బాబాయ్' అని అందరితోను పిలవబడే కృష్ణమూర్తి గారికి.
"రిస్ట్ ఫైట్ అంటే?" అని అడిగారు కృష్ణమూర్తి గారు.
"అదే బాబాయ్ .... బల్లకు అటూ ఇటూ ఇద్దరు కూర్చుని అరచేతులు కలిపి నెట్టుకుంటారే .... అది" అన్నాడు సత్యం.
"ఓహో .... అలాగా? బెస్టాఫ్ లక్" అంటూ బైటకు వెళ్ళబోయారు కృష్ణమూర్తి గారు.
"బాబాయ్ ఒక్క నిముషం. నీకు నువ్వు యంగ్ అని అనుకుంటావు కదా, జానీతో ఓ పట్టు పడతావేంటి?" అని అన్నాడు సత్యం సరదాగా.
కృష్ణమూర్తి గారు నవ్వేసి "అలాగే. కానీ నాకు ఆ ఆటలోని నియమాలు తెలియవే?" అన్నారు.
"మావాడు చెబుతాడు" అన్నాడు సత్యం.
'జానీ' ఆ ఆట ఎలా ఆడాలో చెప్పాడు.
"ఎంతసేపు అలా ఉండాలి?" అని అడిగారు కృష్ణమూర్తి గారు.
"అలా ఏమీ లేదు. మామూలుగా అయితే ఒక నిముషంలోనే వంచేయాలి లేదా చేతిని నిలువుగా నిలబెట్టగలిగితే పడగొట్టేదాకా ఆడవచ్చు" అని చెప్పాడు 'జానీ'.
"నేను సిధ్ధమే" అన్నారు కృష్ణమూర్తిగారు.
సత్యం చెక్క బల్ల సిధ్ధం చేసాడు.
"బైటకు వెళ్తానన్న ఈయన పిల్లలతో ఏదో భేటీ వేసినట్లున్నారు' అనుకున్నారు కృష్ణమూర్తి గారి భార్య రుక్మిణిగారు.
కృష్ణమూర్తిగారికి రిస్ట్ ఫైట్ నియమాలు వివరించి చెబుతున్నాడు 'జానీ'.
"మోచెయ్యి బల్ల మీదనుండి లేవకూడదు.
చెయ్యి శరీరంలోని ఏ భాగానికి తగలరాదు.
ఎవరి చెయ్యి వెనక్కి వంగుతుందో వాళ్ళు ఆ చేతిని ఆట మొదలైన నిముషంలోగా నిలువుగా నిలబెట్టాలి.
ఈ లోపలే చెయ్యి వెనక్కి వంగిపోయి బల్లను తాకితే ఓడిపోయినట్లు. దీనినే 'పిన్' చెయ్యడం అంటారు" అని వివరంగా చెప్పాడు 'జానీ'.
"అయితే నువ్వు మొబైల్లో టైమ్ సెట్ చెయ్యరా సత్యం" అన్నారు కృష్ణమూర్తిగారు.
"అలాగే బాబాయ్ .... నేను రెడీ .... గో అనగానే ఆట మొదలయినట్లు" అని చెప్పాడు సత్యం.
"వాఖే .... నేన్రెడీ" అన్నారు కృష్ణమూర్తిగారు, హూషారుగా.
జానీ నవ్వుకున్నాడు. 'ముసలోడు ఎగస్ట్రాలేస్తున్నాడు' అనుకున్నాడు.
ఇద్దరు తమ మోచేతులు బల్లమీద ఆనించి అరచేతులు కలిపారు.
సత్యం టైమర్ పెట్టుకుని "రెడీ .... గో" అన్నాడు.
కృష్ణమూర్తిగారికంటే ముందే 'జానీ' పట్టు బిగించాడు.
పది .... పదకొండు .... పన్నెండు .... పదమూడు .... పధ్నాలుగు .... పదిహేను సెకన్లకల్లా కృష్ణమూర్తి గారి చెయ్యి పిన్ అయింది.
"ఎలా ఉందంకుల్?" అని అడిగాడు 'జానీ' నవ్వుతూ ....
నవ్వేసారు కృష్ణమూర్తిగారు.
"ఇంకో రౌండు వేద్దామా అంకుల్?" అని అడిగాడు 'జానీ'.
కృష్ణమూర్తిగారు "ఓకే. నేను రెడీయే .... " అనగానే మళ్ళీ సర్దుకుని కూర్చున్నారు ఇద్దరు.
మళ్ళీ ఇద్దరు తమ మోచేతులను బల్ల మీద ఆనించి అరచేతులను కలిపారు. బొటనవేళ్ళు ముడి పడ్డాయి.
అయితే ఈ సారి 'జానీ' అనుకున్నంత ఈజీగా నడవలేదు. కృష్ణమూర్తిగారి రెసిస్టెన్స్ అర్ధం కావడం లేదు 'జానీ'కి. అంత రెసిస్టెన్స్ ఉన్నవాడు తనను 'పిన్' చెయ్యకుండా ఎందుకు ఊరుకున్నారు?' అన్న ఆలోచనలో పడ్డాడు 'జానీ'.
మరుక్షణం 'జానీ' చెయ్యి 'పిన్' అయింది.
ఊహించని విధంగా తన చెయ్యి పిన్ అవడం ఛాంపియన్ అయిన 'జానీ'కి మింగుడు పడలేదు.
"బెస్టాఫ్ త్రీ వేద్దామంకుల్" అన్నాడు 'జానీ'. ఈసారి అతడి మాట దెబ్బతిన్న పులిలా ఉంది.
"బెస్టాఫ్ త్రీయేం కర్మా? బెస్టిఫ్ హండ్రెడ్ అయినా నేను రెడీయే" అన్నారు కృష్ణమూర్తిగారు.
'ఏంటి ఈయన ధైర్యం?' అర్ధం కాలేదు 'జానీ'కి. టీషర్ట్ చేతి మడత కొంచెం పైకి లాగి సిధ్ధమయ్యాడు 'జానీ'.
సత్యం "రెడీ .... గో" అన్నాడు.
మూడోసారికూడా కృష్ణమూర్తిగారు అదే టెక్నిక్ వాడుతున్నాడని అర్ధమయింది 'జానీ'కి.
పది, ఇరవై, ముప్ఫై, నలభై, యాభై సెకన్లు గడిచాయి.
యాభై ఒకటి .... యాభై రెండు ....
కృష్ణమూర్తిగారు తలెత్తి 'జానీ' చొక్కా మడత పైకెత్తిన చేతి కండలను చూసి కళ్ళెగరేసారు.
'జానీ చూపు తన చేతి కండలపై నిలిచింది. మరుక్షణం 'జానీ' చెయ్యి 'పిన్' అయింది.
2:1
'ఛాంపియన్ అయిన తను ఆఫ్ర్టాల్ ఒక ముసలోడి చేతిలో ఓడిపోవడమా? హౌ ఈజిట్ పాజిబుల్ .... '
"యూ ఆర్ గ్రేట్ అంకుల్ .... " అన్నాడు 'జానీ'.
"అది నీ స్పోర్టివ్ నెస్. కానీ నువ్వు మొదటిసారి నన్ను 'పిన్' చేసావు. రెండోసారి, మూడోసారి చెయ్యలేకపోయావు. ఎందుకో తెలుసా?" అని అడిగారు కృష్ణమూర్తి.
"మీ విల్ పవర్ .... " అన్నాడు 'జానీ'.
"కాదు .... అందుకు నువ్వే కారణం" అన్నారు కృష్ణమూర్తిగారు.
"నేనా?" ఆశ్చర్యంగా అడిగాడు 'జానీ'.
"వివరంగా చెప్పు బాబాయ్" అంటూ సత్యం కూడా మొబైల్ పక్కన పడేసి స్టూలు లాక్కుని కూర్చున్నాడు.
కృష్ణమూర్తిగారు చెప్పడం మొదలుపెట్టారు.
"మొదటి రెండు సెకన్లలోనే నీ కండబలం నాకు అర్ధమయింది. అలాగే నా చెయ్యి పట్టుకున్నప్పుడు నువ్వు నా చేతిని ఎక్కడ ప్రెస్ చెస్తున్నావో అర్ధమయింది. ఆ పరిస్థితిలో నేను మొండిగా వ్యవహరిస్తే నా రిస్ట్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. అందుకే నా అంతట నేనే 'పిన్' చేసేసుకున్నాను.
రెండోసారి మన చేతులు లాక్ చేసినప్పుడు నువ్వు మొదటీసారి ఎక్కడ ప్రెస్ చేసావో ఆ ప్రాంతం నీకు అందకుండా జాగ్రత్త పడ్డాను. యాభై సెకన్లైనా నా చేతిని కనీసం వంచలేకపోయావు. కారణం, నీ బలం అంతా అఫెన్సుకే వాడావు. నేను నా బలాన్ని డిఫెన్సుకి కావలసినంత మాత్రమే వాడుతూ అవకాశం కోసం ఆగాను. అప్పుడు నీలో అసహనం మొదలయింది. అది నీ చేతిలోనే తెలిసిపోయింది. అంతే .... నాకు మిగిలిన బలాన్ని అఫెన్సుకి వాడాను. నీ చెయ్యి పిన్ అయింది.
నేను లేచి వెళ్దాం అనుకునే వేళ నువ్వు 'బెస్టాఫ్ త్రీ వేద్దాం అంకుల్" అన్నావు. అంటే నీలో ఓడిపోయానన్న భావన బాగా పాతుకుంది. ఔనా?" అని ఆగారు కృష్ణమూర్తిగారు.
"ఔనంకుల్ .... " అన్నాడు 'జానీ'.
"మూడోసారి నీవే గెలిచేవాడివి. కానీ యాభై సెకన్ల సమయంలో నీ కండలవైపు చూసి కళ్ళెగరేసాను.
అప్పుడు ....
నీ మనసు నీ కండబలం మీద నిలిచింది. నా బలం నా మనసు మీద నిలిచింది.
మరుక్షణం నీ చెయ్యి 'పిన్' అయింది" అంటూ ముగించారు కృష్ణమూర్తి గారు.
'జానీ' మాట్లాడలేదు. సత్యం మౌనంగా ఉన్నాడు.
మళ్ళీ కృష్ణమూర్తిగారే మాట్లాడారు.
"జానీ, ఒక విషయం గుర్తు పెట్టుకో. మన పురాణాలు పుక్కిటి పురాణాలు కావు. వాటినుండి మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి" అన్నారు.
"బాబాయ్ .... బోడిగుండుకి మోకాలుకి వేసిన ముడి విప్పి అసలు విషయం చెప్పు" అన్నాడు సత్యం.
"బోడిగుండుకి మోకాలుకి ముడి కాదురా సత్యం.
మొదటిసారి .... అతడు పట్టుకున్న పట్టు ద్వారా నా బలహీనత నాకు అర్ధం అయింది. రెండోసారి నేను 'జానీ'కి ఆ అవకాశం ఇవ్వలేదు.
రెండోసారి .... జూదంలో మొదటిసారి గెలిచిన దుర్యోధనుడు ధర్మరాజుని మళ్ళీ జూదానికి పిలిచాడు. అంటే విజయగర్వంతో ఉన్నాడు. నువ్వు కూడా అప్పుడు అదే పరిస్థితిలో ఉన్నావు. కానీ నా నుండి ప్రతిఘటన ఊహించలేదు. అది నీ అహాన్ని దెబ్బ కొట్టింది. అహం వివేకాన్ని, విచక్షణని కప్పేస్తుంది. అదే నాకు కలసివచ్చింది.
మూడోసారి .... 'బెస్టాఫ్ త్రీ' వేద్దామా అంకుల్? అన్నావు.
నేను 'బెస్టాఫ్ త్రీయేం కర్మా? బెస్టాఫ్ హండ్రెడైనా నేను రెడీయే' అన్నాను. అదే నువ్వు ఆలోచించుకోవలసిన సమయం. రామాయణంలో వాలి, సుగ్రీవుల యుధ్ధం గురించి విన్నావుగా? వాలి చేతిలో చావుదెబ్బ తిన్న సుగ్రీవుడు వెంటనే వాలిని యుధ్ధానికి పిలుస్తాడు. వాలి కూడా "సై' అంటాడు. కానీ తార వద్దంటుంది. 'ఇప్పుడే చావు దెబ్బ తిన్నవాడు వెంటనే మళ్ళీ యుధ్ధానికి వస్తున్నాడంటే ఆలోచించండి, అతడి వెనుక ఏ బలం ఉందో? ఏ ధైర్యం లేకపోతే అతడు మళ్ళీ మిమ్మల్ని యుధ్ధానికి పిలుస్తాడు? వెళ్ళొద్దు' అంటుంది. కానీ వాలి వినపించుకోకుండా తన కండబలం మీద నమ్మకంతో యుధ్ధానికి వచ్చాడు. పతనమైనాడు. అలాగే మూడోసారి నా బలం చాలడం లేదు అనిపించగానే నీ చేతి కండలవైపు చూసి కళ్ళెగరేసాను. నీ మనసు నీ కండబలంవైపు మళ్ళింది. నా బలం మనసు వైపు మళ్ళింది. నా శక్తినంతా నా మనసులో కేంద్రీకరించి నిన్ను పిన్ చేసేసాను" అంటూ ముగించారు కృష్ణమూర్తిగారు.
వాళ్ళిద్దరు మౌనంగా ఉండిపోయారు.
"సత్యం, నువ్వెప్పుడైనా రామాయణం కానీ భారతం కానీ చదివావా?" అని అడిగారు కృష్ణమూర్తిగారు.
"లేదు బాబాయ్ .... కానీ సినిమాల్లో చూసాను" అన్నాడు సత్యం.
"సినిమాల్లో అయినా ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ, ఆయన ఆహార్యం చూసారే తప్ప ఆ కధల వెనుక ఉన్న అర్ధాలు తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు కదా?" అని ఆగారు కృష్ణమూర్తి గారు.
ఇద్దరు మౌనంగా ఉండిపోయారు.
"సత్యం, మన పురాణాలు పుక్కిటి పురాణాలు కాదురా. వాటిలో నిగూఢమైన జీవిత సత్యాలు, విజయ రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మీ తరం ఎంతసేపు పబ్బులు, సినిమాలు, డేటింగులు, చాటింగులతోనే కాలం వృధా చేస్తున్నారు. మన సాహిత్యం అనంతం. ఆయనెవరో ఇంగ్లీషాయన అన్నాడట .... భారతీయ సాహిత్యం మొత్తం కలిపినా ఇంగ్లీషు సాహిత్యంతో పోలిస్తే కాకిరెట్టతో సమానం అని. కానీ ఇంగ్లీషు సాహిత్యం మొత్తం కలిపినా భగవద్గీతలో ఒక శ్లోకంతో సమానం కాదురా. మరి ఆ భగవద్గీతే భాగంగా ఉన్న భారతం మరెంత గొప్పదై ఉండాలి? అంతకంటే ముందుదైన రామాయణం మరెంత గొప్పదై ఉండాలి? మీ యువతే ఆలోచించుకోవాలి" అంటూ లేచారు కృష్ణమూర్తిగారు 'జానీ' భుజం తట్టి.
****************************** (శుభం)
రచన : అధరాపురపు మురళీకృష్ణ, గుంటూరు
తేది : 14-03-2022
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి