*ॐ నేను ప్రహ్లాదుణ్ణా? హిరణ్యకశిపుణ్ణా?*
"ప్రహ్లాదశ్చాస్మి దైత్యానామ్"
- "అసురులలో ప్రహ్లాదుణ్ణి నేను" అంటాడు భగవద్గీతలో పరమాత్మ.
*ఒక అన్వయం*
ప్రహ్లాదుడు అసురుడు.
అసురకులములో జన్మించినవాడు.
అయినా పరమభక్తాగ్రేసరుడు అవడంచేత సాక్షాత్ భగవంతుని పొందగలిగాడు.
పరమాత్మ "ప్రహ్లాదుడను నేనే" అని చెప్పడంవల్ల, భక్తియొక్క పరాకాష్ఠస్థితియందు భక్తుడు - భగవంతుడు ఒకటే అవుతారు అనే పరమసత్యం వెల్లడవుతోంది.
వారివారి పురుష ( 'పురుష' అంటే "స్త్రీ పురుష" లింగాలలోనిది కాదు. ధర్మార్థకామమోక్షాలనే పురుషార్థాలకి చెందింది ) ప్రయత్నంచే జీవుడు ఈశ్వరుడు కాగలడని స్పష్టమవుతోంది.
క్రూరస్వభావముగల అసురజాతియందు పుట్టికూడా,
- ప్రయత్నపూర్వకంగా ఆర్జింపబడిన తనయొక్క దైవీసంపదచే మహోన్నత పరమార్థస్థితిని చేపట్టి,
- శాస్త్రాదులందు గణుతికెక్కినవాడై,
- భక్తశిరోమణియై తేజరిల్లచు,
- సాక్షాత్ భగవద్రూపుడై వెలసాడు.
కాబట్టి కులముకంటే గుణమే ప్రధానమని తేలతోంది.
దీనినిబట్టి ఎట్టి కులమందు జన్మించినా, తన ప్రయత్నముచేత జనులు మహత్తరదైవస్థితి పొండగలరని ఋజువైంది.
అసురుడే ముక్తినొందగా, ఇక తక్కనవారిమాట చెప్పనేల?
కావున జాతి, మత, కుల, లింగ విచక్షణలేక అందఱూ ఆధ్యాత్మికసాధనలొనర్చి భగవత్పదమును అలంకరించవచ్చును.
*మరొక అన్వయం*
భగవంతుని విభూతులలో దేవతలే కాకుండా, దైత్యులు, దానవులు కూడా ఉన్నారు.
దైత్యులంటే దితి సంతతి.
దానవులంటే దనువు సంతతి.
జీవులలో మంచి స్వభావం కలవారు, చెడ్డస్వభావం కలవారు ఉంటారు.
వారి పరిణామాన్నిబట్టి జన్మసంస్కారమేర్పడుతుంది.
చెడ్డ సంస్కారములు కలవారు అసురులనీ, మంచి సంస్కారములో పుట్టినవారు దేవలక్షణాలు కలిగినవారనీ పరమాత్మ భగవద్గీతలోనే నిర్వచించాడు.
దితి సంతతిలో అందఱూ అసురులు కానక్కరలేదు. ఎక్కువమంది దైత్యులు అసుర లక్షణములు కలవారవడంతో దితికి చెడ్డపేరొచ్చింది. కానీ వారిలోనూ దివ్య లక్షణాలు కలవారున్నారు. అవి యున్నచోట వారిలో ఉన్నది దైవ విభూతియేగానీ మరొకటి కాదు.
దానికి ఉదాహరణగా భగవానుడు ప్రహ్లాదుని చెప్పుతున్నాడు.
హిరణ్యకశిపుడు లోకకంటకుడైతే,
ప్రహ్లాదుడు దైవానుగ్రహం పొందినవాడు. తానే దైవముగా అయినవాడు.
ఎవడు లోక కంటకుడో, వాని బాధలు లోకానికి తప్పించడానికై దేవుడు తన వైభవాన్ని మంచివారి రూపాన ఉంచుతాడు.
హిరణ్యకశిపుడు కోరిన వరాలనుబట్టి అతనికి పరాజయముగానీ, మరణంగానీ ఉండకూడదని అతని భావన.
అతడు అసుర లక్షణాలను పొందకుండా, సత్ప్రవర్తనం కలిగియుంటే, సనక సనందాదులలాగా శాశ్వతుడై, లోకగురువులలో ఒకడైయుండేవాడు.
కానీ అతడు లోక కంటకుడవడంతో,
దైవ విభూతి ప్రహ్లాదునియందు ప్రకాశించింది. అదే హిరణ్యకశిపుని మృత్యువునకు కారణమైంది.
కనుక దైత్యులలో ప్రహ్లాదుడు తన విభూతి అని భగవానుడు చెప్పుచున్నాడు.
*హిరణ్యకశిపుడా? - ప్రహ్లాదుడా?*
హిరణ్యకశిపుడు పరమాత్మను పరమపదంలో ఉండేవానిగానే భావించాడు.
ప్రహ్లాదుడు పరమాత్మ వ్యాపకతత్త్వాన్ని గుర్తించాడు.
తనతోపాటుగా ఉన్న విశ్వమంతా పరమాత్మయే నిండియున్నాడని తెలుసుకున్న దైవశక్తి అయ్యాడు. అందుచేతనే
- పాముతో కరిపించినా,
- ఏనుగుతో తొక్కించినా,
- విషం తాగించినా,
- అగ్నిలో వేసినా,
- సముద్రంలో పారవేసినా బాధా లేదు. మరణమూ లేదు.
అందుచేతనే
- హిరణ్యకశిపుడు మరణం పొందిన హింసాప్రవృత్తి,
- ప్రహ్లాదుడు చిరంజీవియైన శాంతస్వభావం.
*మనమెవరం?*
*ॐ శాంతిశ్శాంతిశ్శాంతిః*
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి