15, మే 2022, ఆదివారం

ॐశ్రీనృసింహ జయన్తి卐*

 *ॐశ్రీనృసింహ జయన్తి卐*

*(నేడు🦁🦁రేపు)*


*శ్లో𝕝𝕝* వృషభే స్వాతి నక్షత్రే చతుర్ధశ్యాం శుభేదినే l

సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భవ నృకేసరీ ll 


*నృసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం అయినటు వంటి నేడు/రేపు మిగులు 14 / 15-5-22 శనివారం /ఆదివారం నాడు కూడా జరుపుకుంటారు.* ఈ రోజు సాయంకాలం నరసింహ మూర్తి హిరణ్య కశిపుని వధించడానికి ఆతని ఆస్థాన మండప స్తంభము నుండి ఉద్భవించెను.


"వైశాఖశుక్లపక్షేతు చరుర్దశ్యాం సమాచరేత్,

మజ్జన్మసంభవం పుణ్యం వ్రతం పాపప్రణాశనమ్"


అని నరసింహుడు ప్రహ్లాదునితో పేర్కొన్నట్లుగా నృసింహ పురాణములో ఉంది.


శ్రీనృసింహభక్తులు సంప్రదాయానుసారంగ త్రయోదశి (ముందు రోజు) నాటి రాత్రి ఉపవాసం ఉండి, చతుర్దశి నాడు కూడా ఉపవాసం ఉండి, ప్రదోష కాలమున నృసింహ విగ్రహమును పూజించుతారు. స్తంభములో జన్మించాడు గనుక భవంతి స్తంభములకు గంధ, పుష్పాక్షతలతో అలంకరించి పూజిస్తారు. రాత్రి జాగరణముచేసి, స్వర్ణసింహ విగ్రహమును దానమిచ్చి, మరునాడు పారణ చేయుదురు. వైశాఖము గ్రీష్మము గనుక వడపప్పు, పానకము ఆరగింపు పెడతారు.


*నృసింహ పురాణ కథ*

~~~~~~


అవంతీ నగరమున సుశర్మ అను వేద వేదంగ పారాయణుడైన బ్రాహ్మణుడు ఉండెను. అతని భార్య సుశీల మంచి ఉత్తమురాలు. వారికి ఐదుగురు కుమారులు కలిగిరి. వారిలో కనిష్ఠుడు వాసుదేవుడు వేశ్యాలోలుడై, చేయరాని పనులు చేయువాడు. ఇట్లుండగా ఒకనాడు వాసుదేవునకు, వేశ్యకు కలహము సంభవించెను. దాని మూలంగా వాసుదేవుడు ఆ రాత్రి భుజింపలేదు. ఆనాడు నృసింహ జయంతి. వేశ్య లేనందు వలన ఆ రాత్రి వాసుదేవుడు జాగరణ కూడా చేసెను. వేశ్య కూడా ఉపవాసము, జాగరణ చేసినది. అజ్ఞాతముగా ఇట్లు వ్రత మాచరించుట వలన వీరు ఇద్దరూ ముక్తులై ఉత్తమగతులు పొందితిరి.


*నరసింహావతారం:*

~~~~


మానవ పరిణామ క్రమంలో అసంపూర్ణమైన (సగం మానవాకారం, సగం సింహాకారం) మానవ రూపంతో కంనిపించే మొట్టమొదటి అవతారమే నరసింహావతారం. ఈ అవతారానికి ముందు మత్స్య, కూర్మ, వరాహావతారాలున్నాయి. అవి జంతు సంబంధమైనవి. విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా వెన్నెముక నిటారుగా ఉన్న అవతారాల్లో మొట్టమొదటిది నరసింహావతారమే. మానవావిర్భావం మొదట మత్స్య రూపమునుంచి ఆవిర్భవించిందనే సిద్ధాంతానికి, దశావతారాల్లో కనిపించే క్రమమూ, పరిణామమూ నిదర్శనాలుగా నిలుస్తాయి.


నరసింహావతారంలో రెండు భిన్న పార్శ్వాలు కనిపిస్తాయి. నృసింహుడు హిరణ్యకశిపుని పాలిట ఉగ్రుడై కనిపిస్తే, అదే రూపం ప్రహ్లాదునిపై దయారసాన్ని కురిపించింది. హిరణ్యకశిపుడు భయభ్రాంతుడైతే, అదే రూపాన్ని దర్శించిన ప్రహ్లాదుడు భక్తిరసాంబుధిలో ఓలాలాడాడు. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు వీరిద్దరిలో ఎవరు ధైర్యవంతులు? భుజబలం ఉన్నప్పటికీ మానసిక శక్తులు లేని హిరణ్యకశిపునికన్నా, బాలుడైనా ఆత్మశక్తి ద్వారా సంపాదించిన భక్తిబలంతో ప్రహ్లాదుడు ఉగ్రభీకర నృసింహ స్వరూపాన్ని చూసి భయపడలేదు. అలాగే హిరణ్యకశిపుడు కోరిన కోర్కెలు విషయవాంఛలు. విషయ వాంఛలపై ఎంతగా ప్రలోభపడినా చివరికి ఏదో ఒక రూపంలో అవి మనల్ని కాటేయక మానవు.


సంప్రదాయంలో నారసింహస్వామిగ విజయాన్ని అందించే వేల్పుగా ఖ్యాతి వహించాడు. రాజ్యలక్ష్మి సమేతుడై శత్రుభయంకరుడై, ఆర్తుల ఆర్తిని పోగొట్టే ఆర్తత్రాణ పరాయణుడు. నియమపూర్వకమైన సాధనల ద్వారా యౌగిక స్తంభాన్ని చేధిస్తే మాత్రమే మన హృదయంలో ఆవిర్భవించే విజ్ఞాన స్వరూపుడు. అహంకారంతో, ప్రలోభాలతో శరీరాకృతిలో మనల్ని పీడించే భవబాధలను వివేకమనే నఖాగ్రాలతో చీల్చి ఉపశమంపచేసే వాత్సల్య స్వరూపుడు.

అందుకే ఆది శంకరాచార్యులు స్వామివారిని ఇలా స్తుతించారు.


సంసార సాగర విశాల కరాళకాల

నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య

వ్యగ్రస్య రాగరసనోర్మిని పీడితస్య

లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబం!!


*నరసింహ అవతారం*

~~~~


నరసింహ అవతారం తక్కిన అవతారాల కన్నా చాలా విశిష్టమైనది. 


తాను ఆర్తత్రాణపరాయణుడు, భక్త జన పరిపాలకుడు అని నిరూపించే అత్యంత అరుదైన అవతారం. 


తన భక్తుడు ఏవైపైతే వేలు చూపడం ఆపాడో అక్కడనుండి అవతరించి తన భక్తుని నమ్మకాన్ని నిరూపించిన భక్త పరాధీనుడు.


క్షణాలలో క్రోధాన్ని ఆవహింప చేసుకుని తమోగుణప్రధాన రూపమై తానే రుద్రుడై వచ్చాడు శ్రీహరి నరసింహస్వామీయై అర్ధ మానవ, అర్ధ సింహ రూపంలో అత్యంత అరుదైన రూపము. ప్రదోషకాలంలో శివునికి ఎలా పూజలు జరుగుతాయో అలాగే నరసింహ స్వామికి కూడా జరుగుతాయి. శివుడే విష్ణువు అని నిరూపించే మరొక లీల ఇది. 


అటువంటి నృసింహ ఉపాసన చేసి భవసాగరాలు దాటిన మహనీయులు ఎందరో.


ఆది శంకరులు పలుమార్లు నృసింహ స్మరణ మాత్రం చేత కాపాడబడ్డారు. ఆయన పరకాయ ప్రవేశం చేసి తిరిగి తన శరీరంలో వెళ్ళబోవు సమయంలో ఆ రాజభటులు ఆ శరీరానికి నిప్పు పెట్టి ఆహుతి చేయ్యబోగా కరావలంబ స్తోత్రం చేసి కాపాడబడ్డారు.


ఒకసారి ఒక వ్యాధుడు ఆయన శిరస్సును కోరి ఆయన ధ్యానమగ్నులైనప్పుడు తల నరకబోగా ఆయన శిష్యుడు చేసిన నృసింహ స్తోత్రానికి ప్రత్యక్షమై వారిని రక్షించారు. కాశ్మీరంలో ఆయన మీద విషప్రయోగం చెయ్యగా దాన్ని విరిచి మరొక సారి కాపాడారు. ఇలా కోరిన వెంటనే రక్షించిన స్వామీ నరసింహుడు.


మనకు తెలిసిన ఎందరో భక్తాగ్రేసరులు అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, కైవార తాతయ్య ఇలా ఎందరో ముందుగా నృసింహ ఉపాసకులై తద్వారా వేంకటేశుని సన్నిధి చేరి కైవల్యం పొందారు. 


అన్నమయ్య ఆయన రాసిన 32 వేల సంకీర్తనలలో వేంకటేశుని తరువాత అంత ఆర్ద్రంగా రాసిన కీర్తనలు నృసింహుని పైనే. 


అసలు ఇంత అభేధ్యం వారికి ఎలా నిరూపించారో మనం శ్రీనివాసుని కళ్యాణ ఘట్టాన్ని నెమరు వేసుకుంటే అర్ధమవుతుంది.


శ్రీనివాసుడు దేవతలను అందరినీ ఆయన కళ్యాణానికి పిలిచి వారందరికీ తగిన ఏర్పాట్లు చెయ్యడానికి కుబేరుని దగ్గర 14లక్షల రామముద్ర గల సువర్ణనాణములు చతుర్ముఖుడు, రుద్రుడు, అశ్వత్థవృక్ష సాక్షిగా ఋణం తీసుకుంటాడు. 


ఒకొక్క తీర్ధ, సరోవరాలలో వంటలు వండబడ్డాయి. బ్రహ్మదేవుడు ముందుగా దేవునికి నివేదన చెయ్యకుండా మిగిలిన వారికి ఎలా వడ్డించేది అని అడుగుతాడు శ్రీనివాసుని. కనుక ముందు నీవు ఆరగింపమని ప్రార్ధిస్తాడు. నా ఇంటి శుభకార్యానికి వచ్చిన వీరంతా అతిధులు కావున వారికి భోజనం పెట్టకుండా నేను భుజించడం ధర్మ విరుద్ధం అంటాడు. కానీ నివేదన చెయ్యని భోజనం దేవతలు, ముని, ఋషి బ్రాహ్మణులు తినరే ఎలా అని బ్రహ్మ వ్యాకుల పడగా శ్రీనివాసుడు, నేను మరొక రూపంలో నరసింహునిగా అహోబిలంలో ఉన్నాను. కనుక ముందు అక్కడ నివేదన చెయ్యమని చెబుతాడు శ్రీనివాసుడు. ఆ తరువాతే అందరికీ ఆ నైవేద్యం వడ్డించబడింది. 


అందుకే తిరుమలలో కూడా యోగముద్రలో ఉన్న యోగ నృసింహుడు ఆ గుడి ప్రాంగణంలో స్వామికి అభేదంగా ఉంటారు. యోగులు ఆ యోగ నృసిమ్హుని ముందు కూర్చుని ధ్యానిస్తే ఆనందనిలయంలో ఉన్న ప్రత్యక్ష శ్రీనివాసుని దర్శనం అవుతుందని పెద్దలు చెబుతారు.


అందుకే వెంకటేశ్వరపాదసేవలో నృసిమ్హునికి అంత ప్రాముఖ్యం. స్వామీ నైవేద్యం పుచ్చుకునేటప్పుడు భక్తులు ఈ శ్లోకం చెప్పుకోవడం కద్దు


"రమాబ్రహ్మాద యోదేవాః సనకాద్యాఃశుకాదయ: !

శ్రీనృసింహప్రసాదోయం సర్వే గృహ్ణ౦తు వైష్ణవా: !! "

మాతా నృసింహశ్చ పితానృసింహ: సఖానృసింహశ్చ భ్రాతా నృసింహ విద్యానృసింహో ద్రవిణం నృసింహ: స్వామి నృసింహ సకలం నృసింహ

     

🙏 *శ్రీ నృసింహ 🦁 జయన్తి శుభాకాంక్షలు* 

🙏🙏🦁🦁🙏🙏


*బ్రాహ్మణ చైతన్య వేదిక*

కామెంట్‌లు లేవు: