13, జూన్ 2022, సోమవారం

అభ్యాసంతో

 ఎవరో ఒక వ్యక్తి ఒక తప్పు చేశాడని అనుకుందాం. ఆ తప్పుని అతనికి ఎత్తి చూపి తను తప్పు చేశాడని నిరూపించి, తర్వాత క్షమించడం క్షమ అనిపించుకోదు. 


ఆ క్షమించిన విషయం సైతం ఆ వ్యక్తికి తెలియకుండా జరిగిపోవాలి. వారిలో తప్పు చేశామనే భావనే రాకూడదు. అది సరైన క్షమ. వారి తప్పును ఎత్తి చూపిస్తున్నావంటే వారిని ఇంకా క్షమించడం లేదని తెలుసుకోవాలి. తప్పు చేశామనే భావన పెద్ద శిక్ష. 


సాధనతో సంపాదించుకున్న జ్ఞానం ఈ భావన నుంచి తప్పించి జీవితాన్ని విశాల దృక్పథంతో చూసేలా చేస్తుంది. అదే అసలైన జ్ఞానం.


అవతలి వ్యక్తుల తప్పులను ఎత్తిచూపడమే పనిగా పెట్టుకునేవారు లోకంలో కోకొల్లలు కనిపిస్తుంటారు. వారంతా ఒకసారి తమ తప్పులను గుర్తించగలిగితే, ఎదుటివారిని అర్థం చేసుకోగలుగుతారు. 


అంటే, తప్పును సమర్థించాలని కాదు, తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయాలే కానీ, దాన్ని చేస్తున్న వ్యక్తిని తప్పుబట్టకూడదు. అలా చేసేంతటి సహనశీలత కొందరిలో ఉండకపోవచ్చు. కానీ, అభ్యాసంతో అన్నీ సాధ్యమే! మన మనసు పారదర్శకంగా ఉంటే, అవతలి వ్యక్తి మనసూ అంతే పారదర్శకంగా కనిపిస్తుంది. మనలో మాలిన్యాలు ఉంటే, ఎదుటివారిలోనూ అవే కనిపిస్తాయి.


క్షమించడానికి ప్రయత్నిద్దాం. ప్రయత్నే ఫలే అన్నారు పెద్దలు. వారు చెప్పిన సూక్తులు ఇప్పటిదాకా వమ్మైన దాఖలాలు లేవు కదా.

కామెంట్‌లు లేవు: