ॐ సీతారాముల అన్యోన్యత - ఆదర్శం
ఉత్తమమైన మనస్సుగల రాముడు సీతయందే మనస్సు నిలిపేవాడు. ఆమె తన హృదయమునందు రామునే సర్వదా నిలుపుకొనేది. ఈ విధముగ అన్యోన్యాసక్తులై సీతారాములు అనేక ఋతువులపాటు (చాలాకాలం) విహరించారు.
తండ్రి అంగీకరించిన సంబంధమవడంతో రామునకు సీతపై ప్రేమకలిగింది. ఆమెయొక్క సద్గుణాలచేతా, లోకోత్తర సౌందర్యముచేతా అతని ప్రేమ ఇంకా వృద్ధి చెందింది.
సీత హృదయంలో భర్తయైన రాముడు రెండింతలుగా మసలుచున్నాడు. లోలోపల నున్న భావమును గూడ ఒకరి హృదయము మరొకరి హృదయంతో చెప్పుచుండెడిది.
సౌందర్యమున దేవతా స్త్రీవలె ఉన్నదీ, లక్ష్మీవలె అపూర్వ సౌందర్యం గలదీ, మిథిలానగర సంజాతయు, జనకుని కూతురూ ఐన సీత రాముని హృదయంలో ఇంకా ఎక్కువగా మసలుతోంది.
విశేషం
తండ్రి అంగీకరించి చేసిన సంబంధమవడంతోనూ, ఆమెకు గల రూపసద్గుణాలచేతనూ రామునకు సీతపై గాఢానురాగం కలుగగా,
సీతకు మాత్రమూ అట్టి బాహ్యనిమిత్తాలతో పనిలేకుండానే, భర్త అనే ఒక్క కారణంచేతనే రామునిపై రెట్టింపు ప్రేమయుండేది.
ఆ ప్రేమ ఎంత ఉత్కృష్టమైనదంటే, వారిరువురూ నోటితోకాక హృదయాలతోనే మాట్లాడుకొనేవారు,
ఒకరి హృదయంలో ఉన్న భావము నొకరు అనాయాసంగా గ్రహించి తదనుగుణంగ ప్రవర్తించేవారు.
వారి ప్రేమ ఒకరిపై ఒకరికి రెట్టింపు రెట్టింపు ఉన్నదట. వారి ప్రేమ కొలవడానికి గానీ, ఎవరికి ఎవరిపై ఎక్కువ ప్రేమయో చెప్పుటకు సాధనమేదీ లేదని భావము.
The high-minded Sree Raama, whose heart was set on his spouse and who stood enthroned in her heart, enjoyed life with her for much time.
Seetha was dear to Sree Raama as a partner made available to him by his father. Nay because of her manifold virtues and comeliness of form his affection for her grew all the more.
Her husband too, because of his excellences and lovely exterior, gained a doubly secure footing in her heart.
Seetha, the princess of Mithila and daughter of Janaka, who compared with goddesses in bodily charm and was beauty incarnate as it were,
could vividly read in minute detail with her mind even that which existed in the inmost heart of Sree Raama.
రామస్తు సీతయా సార్థం విజహార బహూనృతూన్ I
మనస్వీ తద్గతస్తస్యా నిత్యం హృది సమర్పితః ॥
ప్రియా తు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి I
గుణాద్రూపగుణాచ్చాపి ప్రీతిర్భూయోఽభ్యవర్ధత ॥
తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే I
అన్తర్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా ॥
తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజా I
దేవతాభిః సమా రూపే సీతా శ్రీరివ రూపిణీ ॥
- బాలకాండ 77/28,29,30,31
గమనిక:
మా తల్లిదండ్రులు
లక్ష్మీ సమానురాలైన లక్ష్మీ కనకదుర్గా సుందరి -
బ్రహ్మశ్రీ వేదమూర్తులైన బొడ్డపాటి కుటుంబరావు గారల
వివాహము 1947లో ఈ రోజే జరిగి, ఈ నాటికి 75 సంవత్సరాలైంది.
2007లో అరవై వసంతాల వైవాహిక జీవితాన్ని పూర్తిచేసుకుని,
మా నాలుగో మేనమామ ఉపనయనము, మా తల్లిదండ్రుల వివాహముల ఆనాటి సంయుక్త శుభలేఖని,
భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి సమక్షంలో చదివించుకుని,
దండలు మార్చుకుని,
సీతారామ కళ్యాణం చేయించారు.
వాళ్ళ దాంపత్యం సీతారాముల జీవితంలాగా ఆదర్శవంతమైనది.
మాకు వారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంది.
వారి
- దైవీ సంబంధమైన ఆ జీవనమూ,
- కుటుంబ నిర్వహణా విధానమూ,
మా జీవితాలలో మాకు ఎల్లప్పుడూ మార్గదర్శనం.
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి