మనం కర్మలు చేస్తాం ధనం సంపాదిస్తాం, ఆస్తులు సంపాదిస్తాం వాటిని కూడబెడతాం. అవి వృద్ధిచెందుతుంటే ఆనందం, అవి పోతే విషాదం. మనం సంపాదించిన ధనం వలన కేవలం ఆనందం మాత్రం కలగాలంటే ఒకటే మార్గము. దానం. తనకు అవసరమైనంత వరకు ఉంచుకొని మిగిలిన దానిని ఇతరులకు దానం చేయడం. దాని వలన తృప్తి, ఆనందం కలుగుతాయి. దానం కూడా ఒక విధమైన యజ్ఞము అని అన్నాడు పరమాత్మ. దీనినే ద్రవ్య యజ్ఞము అని అన్నారు.
ద్రవ్యయజ్ఞము అంటే తాను ఆర్జించినధనమును ఇతరులకు, దానం చేయడం. మంచి విషయాలకు వినియోగం చేయడం. దానము ధర్మము కూడా యజ్ఞంగా భావించాలి. ధనము, ఆస్తులు, ఒకరినుండి ఒకరికి మారుతూ ఉండాలి కానీ ఒకే చోట నిలకడగా ఉండకూడదు. దానం వలన ధనము, వస్తువులు, ఆస్తులు, విద్య ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తాయి. ధనం ఆర్జించిన దానికి ఫలితం కూడబెట్టడం కాదు. దాని వలన దుఃఖము వస్తుంది. ఆర్జించిన ధనాన్ని ఇతరులకు, మంచి కార్యాలకు దానం చేస్తే, మనసుకు ఆనందం కలుగుతుంది సమాజశ్రేయస్సు కలుగుతుంది. అలాగే విద్య నేర్చుకున్న దానికి ఫలితం ఆ విద్యను పది మందికి దానం చేయడం అంటే చెప్పడం. దానివలన పది మంది విద్యావంతులు తయారౌతారు. ఆ విధంగా విద్యావ్యాప్తి జరుగుతుంది. కాబట్టి హిందూ సంస్కృతిలో దానం అత్యంత ఉన్నత స్థానాన్ని సంపాదించుకుంది. కాబట్టి దానాన్ని ఇక్కడ ఒక యజ్ఞంగా చెప్పాడు పరమాత్మ.
రెండవది తపోయజ్ఞము. అంటే మనకు గాను మనం, ఇష్టపూర్వకంగా, స్వీయక్రమ శిక్షణ పాటించడం. ప్రాపంచిక విషయాల మీద, వాటిని అనుభవించడం మీద స్వీయ నియంత్రణ కలిగి ఉండటం. అంటే ప్రాపంచిక విషయాలకు మనం యజమానుల మాదిరి ఉండాలి కానీ వాటికి బానిసలు కాకూడదు. ఉదాహరణకు అయ్యప్పస్వామి మండల దీక్ష నియమ బద్ధంగా పాటిస్తే, అది ఈ తపోయజ్ఞము కిందికి వస్తుంది. అలాగే ఏకాదశి, శివరాత్రి, కార్తీకమాసము, మొదలగు పర్వదినములలో ఉపవాసములు ఉండటం, భగవంతునికి పూజలు, వ్రతాలు, ధ్యానము, దేవుని కథలు వినడం, సత్సాంగత్యము, ఎల్లప్పుడు దైవధ్యానము ఇవి కూడా తపోయజ్ఞము కిందికి వస్తాయి. వీటి వలన మనస్సు ఇంద్రియములు మన స్వాధీనంలో ఉంటాయి.
మూడవది యోగ యజ్ఞము అంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి వీటిని అష్టాంగములు అంటారు. వీటిని ఆచరించడం యోగ యజ్ఞము అంటారు. వీటిని ఎక్కువగా యోగులు, సన్యాసులు అవలంబిస్తారు.
నాలుగవది స్వాధ్యాయ యజ్ఞము. దీనిలో వేదములను అధ్యయనం చేయడం, శాస్త్రములు,పురాణములు, ఇతిహాసములు చదవడం, అందలి అర్థమును గ్రహించడం, దానిని ఇతరులకు బోధించడం, అందులో చెప్పబడిన ధర్మములను ఆచరించడం. ఈ పనులన్నీ శ్రద్ధతో, భక్తితో చేయాలి కానీ ఏదో ప్రచారం కొరకు, చేయాలి కాబట్టి చేయడం, చేయకూడదు. దీనిని స్వాధ్యాయ యజ్ఞము అని అంటారు.
తరువాతది జ్ఞానయజ్ఞము అంటే జ్ఞానమును సంపాదించడం. పైన చెప్పబడిన స్వాధ్యాయ యజ్ఞములో కేవలం శాస్త్రములు పురాణములు చదవడం మననం చేయడం, వల్లెవేయడం చేసే వారు వాటిలో ఉన్న అర్థములను, అంతరార్థములను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించడమే జ్ఞానయజ్ఞము. దానికి గురువు అవసరము. గురుకులములలో ముందు విద్యార్ధి చేత వేదములు వల్లెవేయిస్తారు. అప్పుడే అర్థములు చెప్పరు. వేదములు కంఠతా వచ్చిన తరువాత ఒక్కొక్క శ్లోకానికి అర్థం వివరించి చెబుతారు. అలాగే చదివిన వాటిని అర్థం చేసుకోవడమే జ్ఞానయజ్ఞము అని అంటారు.
🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి