21, సెప్టెంబర్ 2022, బుధవారం

ధర్మాకృతి : పీఠాధిపత్యము - 2

 ధర్మాకృతి : పీఠాధిపత్యము - 2


పండితవర్యుని హృదయం హర్షవిస్మయములతో నిండిపోయింది. అహో! ఎవరీ బాలకుడు. విశేష శాస్త్రములను అధ్యయనం చేయలేదు. తల్లిదండ్రుల ఒడి నుండి ఇప్పుడే కదా బయటకు వచ్చారు! అయిన మహా పండితుని వలె ప్రకాశిస్తున్నారు.  ఉచితతమంగా మాట్లాడుతున్నారు. వీరి వదనం బ్రహ్మజ్ఞత్వాన్ని అభివ్యాంజనం చేస్తోంది. వచనం ధర్మ విత్తమునిగా తెలియజేస్తోంది. ఈతనిని సామాన్య బాలకునిగా భావించరాదు. అతి త్వరలోనే ఈయన ద్వారా ఈ గొప్ప పీఠము సర్వతోముఖ వికాసాన్ని పొందుతుంది అని నిశ్చయించుకొని తన భావాలను అక్కడ ఉన్న వారి వద్ద వేనోళ్ళ పొగిడి సంతోషంతో తన పురానికి తిరిగి వెళ్ళారు. ఆ బాలయతి ఖ్యాతి బాగా కుసుమించిన వృక్షపు గంధం వలె దూరదూరములకు బాగా వ్యాప్తి చెందింది.


మఠనిర్వహణము సామాన్యమైన విషయం కాదు. మఠంలోని అధికారులందరూ రెండు మూడు తరములుగా పాతుకొని పోయి ఉన్నవారు. ఎంత ఆచార్యభక్తి ఉన్నప్పటికీ మొన్నటి వరకు పసి బాలునిగా భావించిన వారికి, ఆచార్యుల వారికి చూపవలసిన వినయ విధేయతలు చూపడానికి సమయం పడుతుంది కదా! ఈ ఆచార్యుల వారు కూడా తమ నిర్వహణా సామార్థ్యాన్ని ఋజువు చేసుకోవలసి ఉన్నది. పరిచారక వర్గంలో కొందరు ఉద్దండ పండితులు మరికొందరు పరమ గురువులకు అత్యంత ఆంతరంగికులయిన అధికారిక వర్గము. ఇంకొందరు బహుకాలంగా శ్రీమఠమును ఆశ్రయించి బ్రతుకుతూ ఆనుపానులన్నీ సంపూర్ణంగా ఎరిగి ఉన్నవారు. వీరందరి మీదా ఆధిపత్యం నెరపడానికి కుశాగ్రమైన ధీసంపత్తి, అనుభవము, జాగరూకత అవసరము. ఇది పీఠనిర్వహణ విషయం. 


సన్యాసాశ్రమపు నియమ నిష్ఠలు, శంకరుల వారినుంచి వస్తున్నా ఆచారములు పూజా పద్ధతులను సంపూర్తిగా తెలుసుకొని తమ అలవాటు లోనికి తెచ్చుకోవడమూ, అద్వైత పీఠనాయకులైనందున పండితులతో, ప్రతివాదులతోనూ చర్చించి అద్వైతమతాన్ని సుప్రతిష్ఠితంచేయడానికి తగిన పాండిత్యమూ అవసరము. హిందూ మతమునకు అధినాయకులైనందున వారి ప్రయోజనాలను దృష్టిలో దృష్టిలో నుంచుకొని తగిన రక్షణ చర్యల గురించి ఆలోచించడం ఒక పని. ఇవన్నీ కాక ప్రతిదినము ఆధ్యాత్మిక గురువుగా, దైవ ప్రతినిధిగా, దైవంగా భావించి అనేకమంది భక్తజనుల ఆదిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి తగిన తపోబలం అత్యంత ఆవశ్యకము. ఈరకంగా ఒక పీఠాధిపతికి ఆచారానునుష్ఠానాలలోనూ, శాస్త్రం లోనూ, తపోనిష్ఠలోనూ లౌకికమైన తెలివితేటలలోనూ, బలం ఉంటే కానీ పీఠనిర్వహణ సాధ్యపడదు. ఇంతటి మహత్తరమైన బాధ్యత పదమూడేళ్ళ బాలసన్యాసి పైన పడింది. పై విషయాలను దృష్టిలో ఉంచుకొనే “నాకు గురు సాన్నిధ్యంలో ఉండే భాగ్యము లేదు. సన్యాసాశ్రమపు మొదటి నాటి నుండే పీఠాధిపాత్యపు కష్టసుఖాలు, బాధ్యతలు నన్ను చుట్టుముట్టాయి” అంటారు స్వామివారు. దీనికి తోడు ఈ మఠంలో ఏమి జరుగుతున్నదో ఎప్పటికప్పుడు గమనించుతూ అవకాశం దొరికితే హాని చేయాలని కాచుకొని కూర్చొని ఉన్న వర్గం ఆనాటికి కూడా ప్రబలంగా ఉన్నది.  


పీఠాధిపత్యపు మొదటిరోజు విరామం తీసుకోబోయే సమయానికి శ్రీమఠపు కార్యనిర్వహణాధికారి సదాచార సంపన్నుడయిన ఒక వృద్ధ బ్రాహ్మణుని స్వామివారికి పరిచయం చేసూ ఇకనుంచి వీరు తమకు పరిచర్య చేస్తారని చెప్పే వెళ్ళారు. సర్వాధికారి అలా వెళ్ళారో లేదో ఈ వృద్ధ బ్రాహ్మాణుడు స్వామివారికే సాష్టాంగంగా నమస్కరించి “స్వామీ! మహా పురుషులయిన తమ పరమ గురువుల పరిచర్యల ఈ జీవితం ధన్యమయింది. వారి సేవలో పునీతమయిన ఈ తనువును ఇంకొకరి సేవను వినియోగింపజాలను. స్వామివారు ఈ అపరాధమునకు నన్ను క్షమించాలి అంటూ వినమ్రంగా శలవు తీసుకొన్నారుట. అప్పుడు స్వామివారు ఏమనుకొన్నారో! 99వ ఏట తమ పరిచారకుల ఎదుట ఈ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకొన్న స్వామివారు వారిది ఎంత గొప్ప అనన్యమైన ఆచార్య భక్తి’ అని మెచ్చుకొన్నారు. 


పీఠాధిపత్యము స్వీకరించిన తరువాత పీఠపరిస్థితులు ఆకళింపు చేసుకోవడానికి, పీఠనిర్వహణలోనూ, వివిధ శాస్త్రములలోనూ, పూజా పద్ధతులలో సుశిక్షుతులవడానికి పీఠమునకు అప్పటి ప్రధాన కేంద్రమయిన కుంభకోణం బయలుదేరారు. దారిలో తమ పూర్వాశ్రమపు కుటుంబమున్న తిండివనంలో కొంతకాలం బసచేశారు.


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: